గుంతల్లో రోడ్లు!

ABN , First Publish Date - 2021-09-12T07:51:16+05:30 IST

ప్రయాణానికి రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయి. బైక్‌ అయినా ఆటో అయినా విలాసవంతమైన కారయినా ఆసాంతం కుదుపుల ప్రయాణమే.

గుంతల్లో రోడ్లు!

  • వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న రహదారులు
  • భారీ గుంతలు, కంకర తేలి ప్రమాదకరంగా 
  • మారిన రోడ్లతో వాహనదారులకు నరకం 
  • వర్షాలతో 357 కోట్ల నష్టం: ఆర్‌అండ్‌బీ


అన్నం వండుకునేందుకు బియ్యంలో మెరిగలు ఏరతారు. మరి.. ఆ మెరిగల్లోంచేబియాన్ని ఏరాల్సివస్తే? రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది. రెండు కిలోమీటర్లకో, కిలోమీటర్‌కో ఓ గుంత కాదు.. రహదారి పొడవునా అడుగడుగునా ఓ గోతి.. చుట్టూ తేలిన కంకర, ఇసుకతో అస్తవ్యస్తం! ఆ తిప్పలన్నీ తప్పించుకుంటూ వాహనదారులు గమ్యం చేరడం అంటే ఒక రకంగా పద్మవ్యూహాన్ని ఛేదించడమే అవుతోంది. వాన పడితే వాహనదారుల బాధలు రెండింతలవుతాయి. చెరువులా నిల్చిన నీటిలో ఏది రోడ్డో.. ఏది గుంతో తెలిస్తేనా? ఏమాత్రం పరధ్యానంగా ఉన్నా పడగ విప్పిన ప్రమాదం కాటేయడానికి కోరలు చాస్తుంది. పైపెచ్చు ఇటీవల భారీ వర్షాలకు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. బురదనీటిలో చెప్పులు చేతుల్లో పట్టుకొని నడుస్తూ పాదచారులు పడుతున్న గోస అంతాఇంతా కాదు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ఇది. 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ప్రయాణానికి రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయి. బైక్‌ అయినా ఆటో అయినా విలాసవంతమైన కారయినా ఆసాంతం కుదుపుల ప్రయాణమే. ఈ రోడ్ల దెబ్బకు లక్షలు ఖరీదు చేసే వాహనాలతోపాటు అమూల్యమైన ఆరోగ్యాలూ దెబ్బతింటున్నాయి. గర్భిణులు, వృద్ధులు పడే అవస్థలైతే చెప్పనలవికాదు. కొన్నిచోట్ల ఏడాది క్రితం వేసిన రోడ్లు కూడా తీవ్రంగా దెబ్బతినడం గమనార్హం. రోడ్లపై ఇసుకను అలానే వదిలేస్తుండటం ప్రమాదాలకు కారణం అవుతోంది. హైదరాబాద్‌లో నటుడు సాయిథరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురవడానికి ఇసుకను తొలగించకపోవడమే కారణం అని నిర్ధారించిన సంగతి తెలిసిందే.


 సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌ నుంచి చేగుంట వెళ్లే ప్రధాన రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. ఈ జిల్లాలో పంచాయతీరాజ్‌ పరిధిలోని 36 గ్రామాలకు వెళ్లే రోడ్లు 119.3 కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నాయి. 35 కల్వర్టులు ధ్వంసమయ్యాయి. మరమ్మతులకు రూ. 13.55 కోట్ల వ్యయంకానున్నట్లు జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ప్రతిపాదించారు. జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ఫరిధిలోని దాదాపు 67 గ్రామాలకు వెళ్లే రహదారులు 20 కిలోమీటర్ల మేర పాడైపోయాయి. అత్యవసర కల్వర్టులు, రోడ్ల నిర్మాణం కోసం రూ. 1.67 కోట్లు, పూర్తి దశలో నిర్మించాలంటే రూ. 78.9 కోట్లు ఖర్చు కానున్నట్లు  ప్రతిపాదించారు. 


 సంగారెడ్డి జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలోని రోడ్లు సుమారు 90 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. వీటి నష్టం విలువ రూ.1.25 కోట్లుగా అంచనా వేశారు. జహీరాబాద్‌, మునిపల్లి, ఝరాసంగం మండలాల్లోని నాలుగు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 


 హన్మకొండ జిల్లాలోని 14 మండలాల పరిధిలో 105 కి.మీ మేర రోడ్లు చెడిపోయాయి. నడికుండా మండలంలో కంఠాత్మకూరు-ఆరెపల్లి రోడ్డు వరద ధాటికి కోతకు గరైంది. ఈ మండలంలో కౌకొండ-కంఠాత్మకూరు,  కంఠాత్మకూరు-రామక్రిష్ణాపూర్‌, రాయపర్తి- వరికోలు, నడికూడ- ధర్మారం రోడ్లు, భీమదేవరపల్లి మండలం  ముల్కనూరు-గట్ల నర్సింగాపూర్‌, వంగర-రత్నగరి రోడ్డు, ముత్తారం- ముల్కరూరు రోడ్డు బాగా ధ్వంసమయ్యాయి.

 

 ములుగు జిల్లా వ్యాప్తంగా 50 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి.   రూరల్‌ మండలంలోని దుబ్బగూడెం వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. ఏటూరునాగారం మండలం షాపల్లి వద్ద, తాడ్వాయి మండల జంపన్నవాగు వద్ద, అప్రోచ్‌రోడ్లు, వెంకటాపూర్‌(రామప్ప) మండలంలోని పాలంపేట, పస్రా-నార్లాపూర్‌ మధ్యలో రోడ్లు ధ్వంసమయ్యాయి. పది కల్వర్టులు కొట్టుకుపోయాయి. 


 భూపాలపల్లి జిల్లా రేగొండ, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మల్హర్‌, గణపురం, కాటారం, పలిమెల, మహదేవపూర్‌ మండలాలల్లో రోడ్డు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. ఏడాది క్రితం వేసిన రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. రేగొండ, ట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో రహదారులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. లోలెవల్‌ వంతెనలు, చెరువుల దగ్గరలోని రోడ్లు వరద తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయాయి. 


జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 246 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు, ఈ నష్టం రూ. 2.5 కోట్ల మేర అని అంచనా. పెద్దపల్లి జిల్లాలో 146 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.  సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ల నుంచి మానకొండూర్‌కు వెళ్లే బీటీ రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముత్తారం మండలం ఓడేడు నుంచి ఖమ్మంపల్లికి గల రింగురోడ్డు అడవిశ్రీరాంపూర్‌ వద్ద  తెగిపోయింది. 


 పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్‌ నుంచి కొడంగల్‌ వరకు ఉన్న 58 కి.మీ. రహదారి 45 కి.మీ మేర పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డు వెంట వెళ్ళే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మూసాపేట మండలం వేముల మీదుగా దేవర కద్ర వెళ్ళే రహదారి మూడేళ్లుగా ప్రయాణికులకు నరకం చూయిస్తోంది. దేవరకద్రలో రైల్వే ఫ్లైఓవర్‌ పనులు సాగుతుండగా బ్రిడ్జి కింద నుంచి వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది.


నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలంలోని కార్వంగ నుంచి నందిపేటకు చేరుకోవాలంటే చెప్పులు చేత పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కొల్లాపూర్‌  పరిధిలోని చెంచుగూడెం, అమరగిరి, మొలచింతలపల్లి, నార్లాపూర్‌, అంజనగిరి, బోడబండ తాండ, ముక్కిడిగుండం, ఎర్రగట్టు, వడ్డెర గుడిసెల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. 


 రంగారెడ్డి జిల్లాలో 169 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. కోట్లల్లో నష్టం వాటిల్లింది. కానీ అధికారులు మాత్రం 25 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు   ప్రతిపాదనలు పంపారు.  వికారాబాద్‌ జిల్లాలో  రుద్రారం, దోర్నాల్‌ మార్గాల్లో రోడ్ల వంతెనలను పునరుద్ధరించకపోవడంతో వికారాబాద్‌ మీదుగా తాండూరుకు కొనసాగాల్సిన రాకపోకలు పరిగి మీదుగా జరుగుతున్నాయి. దోర్నాల్‌, రుద్రారం వద్ద వాగులపై వేసిన తాత్కాలిక వంతెనలు వర్షాలకు కొట్టుకుపోయాయి. 


 నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం నాళేశ్వర్‌- నందిపేట మండలం తల్వేద మధ్య వాగుపై నిర్మించిన బ్రిడ్జి రోడ్డుకు కోతకు గురైంది. దీంతో రెండు మండలాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. జిల్లాలో వర్షాలకు ఆర్‌అండ్‌బీకి చెందిన 89 రహదారులు ధ్వంసమయ్యాయి. పంచాయతీ రాజ్‌ రోడ్లకు కూడా 95 చోట్ల గండ్లు పడ్డాయి. రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 


 ఆదిలాబవాద్‌ జిల్లా బేల మండలంలో పెంబిగూడ, దౌనా, నేరడిగొండ మండలంలో మాదాపూర్‌, కుంటాల, బొందిడి, బోరిగామ్‌, గర్భతాండ, సిరికొండ మండలంలో నారాయణ్‌పూర్‌ గ్రామాల సమీపంలోని కల్వర్టులు కోతకు గురయ్యాయి. వీటి మరమ్మతులకు రూ.2.61కోట్లు అవసరపడతాయని అంచనా. నిర్మల్‌ జిల్లా బాసరలో రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. 


 ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ పరిధిలోని 266 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  రూ.80కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. నల్లగొండ పట్టణంలో గడియారం సెంటర్‌, బస్టాండ్‌, ఎన్జీ కళాశాల, సావర్కర్‌నగర్‌, పానగల్‌, దేవరకొండ, మిర్యాలగూడ రోడ్లు వర్షాలకు పలుచోట్ల  దెబ్బతిన్నాయి. మిర్యాలగూడ వద్ద ఉన్న మంగాపురం బ్రిడ్జి వర్షానికి దెబ్బతింది. దీని పూర్తిస్థాయి మరమ్మతుకు రూ.7కోట్లు అవసరమని నివేదికలు పంపారు. హాలియా నుంచి నాగార్జునసాగర్‌ వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.  


 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రాంతంలోని కొలనుపాక, బేగంపేట రోడ్డు, పారుపల్లి, రాజాపేట గ్రామాల సమీపంలోని రోడ్లు తెగిపోయాయి. వలిగొండ నుంచి సుంకిశాల మీదుగా కాటపల్లి వరకు 18కిలోమీటర్ల రహదారి అధ్వానంగా మారింది. కొత్తగూడెం జిల్లాలో 223 కిలోమీటర్ల మేర రోడ్లు, 83వంతెలు, 75 అప్రొచ్‌ రోడ్లు దెబ్బతిన్నాయని..  రెండు శాఖల  పరిధిలోని రోడ్లకు సంబంధించి రూ.607 కోట్ల నష్టం జరిగినట్లు నివేదికలు సిద్ధం చేశారు.  


ఇది ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం పొచ్చెర, రాంపూర్‌ గ్రామాల నుంచి కప్పర్ల గ్రామం మధ్య రోడ్డు. ఇది తారు రోడ్డు అన్న ఆనవాళ్లే లేవు. వాహనంతో రోడ్డెక్కినవారికి ఏ గొయ్యిని ఎలా తప్పించుకోవాలి? సురక్షితంగా ఎలా వెళ్లాలి? అన్న ఆలోచనలే. వారి ఓపికకు, డ్రైవింగ్‌ సామర్థ్యానికి ఈ రోడ్డు పెద్ద పరీక్ష. భారీ గుంతలు ఏర్పడంతో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం సంభవిస్తోంది.


రోడ్లపై వరినాట్లు

అంతర్గత రహదారుల దుస్థితిపై ఖమ్మం జిల్లా కారేపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వర్షాలకు రోడ్లు బురదమయంగా మారడంతో నడిచే పరిస్థితి కూడా లేకుండా  పోయింది. రోడ్ల దుస్థితిపై సర్పంచ్‌కు, సంబంధిత పంచాయతీ అధికారులకు గ్రామస్థులు ఎన్నిసార్లు విన్నవించుకున్నారు. అయినా వారు పట్టించుకోపోవడంతో రోడ్లపై నాటు వేసి నిరసన తెలిపారు.  



2,226 కి.మీ మేర

ఇటీవల వర్షాలకు రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని 2,226 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 288 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. 651 కల్వర్టులు పాడయ్యాయి. ఈ మేరకు జిల్లా వారీగా అధికారులు  నివేదికలు తెప్పించుకున్నారు. మరమ్మతులకు 357 కోట్లు అవసరమవుతాయని ఆర్‌అండ్‌బీ శాఖ అంచనాలు రూపొందించింది. 


కాళేశ్వరం రోడ్డు 20 కిలోమీటర్ల మేర 

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టుకు, అక్కడి కాళేశ్వర ముక్తీశ్వరాలయానికి పర్యాటకులు వస్తుంటారు. అయితే ఆ బాట వారికి నరకం చూపిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ నుంచి ఏపీలోని రేణిగుంట వరకు 365 (సీ) జాతీయ రహదారిని ప్రభుత్వం నిర్మించింది. ఇటీవలే హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌ నుంచి భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేశారు. మహదేవపూర్‌ నుంచి కాళేశ్వరం వరకు 20కిలో మీటర్ల రోడ్డు నరకప్రాయంగా మారింది. దీని నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు లభించలేదు. దీంతో మహదేవపూర్‌ నుంచి కాళేశ్వరం వరకు రోడ్డు నిర్మాణాన్ని వదిలేశారు. దీంతో కాళేశ్వరం ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. రోజుకు 1,500కు పైగా ఇసుక లారీలు ఈ   వెళుతుండటంతో రోడ్డుపై అడుగుకో భారీ గుంత పడింది. ఇసుక లారీల నుంచి రోడ్డు డ్యామేజీ కింద ప్రభుత్వం రూ.250 చొప్పున వసూలు చేస్తోంది.  ఈ మూడేళ్ల కాలంలో సుమారు రూ.10 కోట్లకు పైగా రోడ్‌ డ్యామేజీ పన్ను వసూలు చేసి ఉంటుందని అంచనా. అయితే ఇంత నరక ప్రాయంగా మారినా కూడా రోడ్డుకు కనీసం మరమ్మతులు లేకపోవటంతో భక్తులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  


జనగామ జిల్లా వ్యాప్తంగా 50 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పారు. జనగామ- హుస్నాబాద్‌ రహదారిపై వడ్లకొండ వద్ద  5 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతింది. బచ్చన్నపేట  నుంచి చేర్యాలకు వెళ్లే 10 కిలోమీటర్ల మేర మార్గం గుంతలమయంగా మారిపోయింది.  


 సిరిసిల్ల జిల్లాలో తాత్కాలిక మరమ్మతులకు రూ 3.5 కోట్లు, పూర్తి స్థాయి నిర్మాణానికి రూ. 22 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా. కరీంనగర్‌ జిల్లాలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల పరిధిలోని రోడ్లకు రూ.282 కోట్ల నష్టం వాటిల్లింది. మరమ్మతు లకు కరీంనగర్‌ రెవెన్యూ డివిజన్‌లో రూ. 1.67కోట్లు, హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లో 1.15 కోట్లు అవసరమవుతాయని అంచనా. 


 మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పందిపంపుల వాగు, ఎంకమ్మగుంపు వద్ద రోడ్డు పాడైంది. తొర్రూరు మండలం గుర్తూరు, సోమారం గ్రామాల మధ్య ఉన్న లోలెవల్‌ బ్రిడ్జి ధ్వంసమైంది. మహబూబాబాద్‌ నుంచి నర్సంపేట వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది.

Updated Date - 2021-09-12T07:51:16+05:30 IST