చి‘వరి’కి ఏమవునో..!??

ABN , First Publish Date - 2021-12-31T09:32:12+05:30 IST

ఎన్నడూ లేనట్లుగా 2021లో రాష్ట్రాన్ని కుదిపేసిన అంశం వరి ధాన్యం కొనుగోళ్లు! ఏడున్నరేళ్లలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..

చి‘వరి’కి ఏమవునో..!??

ఎన్నడూ లేనట్లుగా 2021లో రాష్ట్రాన్ని కుదిపేసిన అంశం వరి ధాన్యం కొనుగోళ్లు! ఏడున్నరేళ్లలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. యాసంగిలో ధాన్యం కొనేది లేదని చెప్పేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తమ ప్రభుత్వ విధానాలతో ఆయకట్టు కోటిన్నర ఎకరాలకు చేరిందని ప్రకటించుకున్న ప్రభుత్వమే.. వరి వేయవద్దంటూ రైతులకు ఆంక్షలు విధిస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తోంది. గతంలో పంట ఎండిపోతేనో, వరదలతో నష్టం వాటిల్లితేనో రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు. కానీ, ఈసారి ధాన్యాన్ని విక్రయించుకోలేని దీనావస్థతో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయంలో తప్పు మీదంటే మీదంటూ టీఆర్‌ఎస్‌, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ, రాబోయే రోజుల్లో ఈ అంశమే ఆ రెండు పార్టీలకు గొంతులో పచ్చి వెలక్కాయ మాదిరిగా మారనుంది. ఉదాహరణకు, కేసీఆర్‌ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి.


అదే జరిగితే, 2023 ప్రథమార్థంలో ఎన్నికలు ఉంటాయి. అప్పుడు యాసంగి కొనుగోళ్లు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఆలోగా ధాన్యం కొనుగోళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం టీఆర్‌ఎస్‌ సర్కారు ముందున్న తక్షణ కర్తవ్యం. లేకపోతే, ఇప్పటి వరకూ మద్దతుగా నిలిచిన రైతుల నుంచే వ్యతిరేకతనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రభుత్వ విధానాలకు తోడు.. ప్రకృతి విపత్తులూ రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 12.80 లక్షల ఎకరాల పంట వర్షార్పణమైపోయింది. దాదాపు రూ.3,840 కోట్ల పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకుంటుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

Updated Date - 2021-12-31T09:32:12+05:30 IST