ఆర్జీయూకేటీ జాబితా విడుదల

ABN , First Publish Date - 2021-08-20T09:00:23+05:30 IST

బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆరేళ్ల ఇంటెగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుకు ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేసింది. 2021-22 విద్యా..

ఆర్జీయూకేటీ జాబితా విడుదల

పాలీసెట్‌లో మార్కుల ఆధారంగా ఎంపిక.. అమ్మాయిలదే హవా

మేడ్చల్‌ జిల్లా నుంచి అత్యధికంగా 100మంది

ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా ఐదుగురు

సెప్టెంబరు 1 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం


బాసర, ఆగస్టు, 19: బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆరేళ్ల ఇంటెగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుకు ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి పాలీసెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు. ప్రత్యేక కేటగిరీ సీట్లను మినహాయించి... 1,404 మంది విద్యార్థులతో ఎంపిక జాబితాను ప్రకటించారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారు 638 మంది, ప్రైవేటు స్కూళ్లలో చదివిన విద్యార్థులు 766 మంది ఉన్నారు. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లా నుంచి 100 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా ఐదుగురు విద్యార్థులు మాత్రమే జాబితాలో చోటు సాధించారు. 


మొత్తంగా చూస్తే 46శాతం మంది అబ్బాయిలు, 54శాతం మంది అమ్మాయిలు ప్రవేశాలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది మొత్తం 1,500 సీట్లకు 20,195 దరఖాస్తులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా గ్లోబల్‌ కేటగిరీ సీట్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా 25మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఈడబ్ల్యూఎస్‌ కోటాను కూడా అమలు చేయడంతో 178 మంది విద్యార్థులు ఈ కేటగిరీలో ఎంపికయ్యారు. విద్యార్థుల జాబితాను వర్సిటీ పరిపాలనాధికారి రాజేశ్వర్‌రావు గురువారం విడుదల చేశారు.


రాణించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

ఆర్జీయూకేటీ ప్రవేశాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. 1,404 మందిలో 638 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదివినవారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దుచేయడంతో పాలీసెట్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయాలని ఆర్జీయూకేటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులతో పోటీపడి ఆర్జీయూకేటీకి గణనీయంగా ఎంపికయ్యారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. జాబితాలో సీరియల్‌ నంబరు ప్రకారం...1న 1-500 వరకు, 2న 501- 1000 వరకు, 3వ తేదీన 1001-1404వరకు ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. దీనికి ముందు ఈ నెల 24న ఎన్‌ఆర్‌ఐ, గ్లోబల్‌ కేటగిరీ సీట్లకు, 25న క్యాప్‌ (ఎక్స్‌-సర్వీ్‌సమెన్‌, పీహెచ్‌  కేటగిరీ) సీట్లకు అడ్మిషన్ల ప్రక్రియ చేపడతారు. అలాగే ఆగస్టు 26వ తేదీన ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కేటగిరీల సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-08-20T09:00:23+05:30 IST