అటవీ అనుమతులను త్వరితగతిన పూర్తి చేయాలి:కేంద్ర అటవీశాఖ డీడీజీ
ABN , First Publish Date - 2021-03-24T22:47:28+05:30 IST
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేసి, వీలైనంత త్వరగా అటవీ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతీ ఉద్యోగిపైనా ఉందని కేంద్ర అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్

హైదరాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేసి, వీలైనంత త్వరగా అటవీ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతీ ఉద్యోగిపైనా ఉందని కేంద్ర అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ అన్నారు. వివిధ శాఖల ప్రాజెక్టులు- సత్వర పూర్తికి అవసరమైన అటవీ అనుమతులపై అరణ్య భవన్ లో సమీక్షా సమావేశం జరిగింది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి హేమంత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్కింగ్ ఏజెన్సీలు (పలు ప్రభుత్వ శాఖలు) అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేయటం, రెండు దశల అనుమతుల ప్రక్రియ పూర్తికి అవసరమైన విధి విధానాలను పాటించటంపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అయితేనే వాటి ఫలాలు త్వరగా అందుతాయని, అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా చూసేందుకు అన్ని సంబంధిత శాఖల అధికారులతో ఈ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు పీసీసీఎఫ్ఆర్.శోభ తెలిపారు. మొత్తం 109 పనులు, ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులపై చర్చించారు. సాగునీరు, నీటి సరఫరా, జాతీయ రహదారులు, రోడ్లు-భవనాలు, సింగరేణి, విద్యుత్ శాఖల అనుమతుల ప్రక్రియ, స్టేజ్-1, స్టేజ్-2 అనుమతుల ఏ దశలో ఉన్నాయి, వేగవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు.
ఏవైనా అడ్డంకులు ఉంటే వాటి పరిష్కారం కోసం సత్వర సమన్యయంతో పనిచేయాలని నిర్ణయించారు. మూడేళ్లకు పైబడిన స్టేజ్ -1 అనుమతులను నెలరోజుల్లో, రెండేళ్లు దాటిన వాటిని రెండు నెలల్లో, ఏడాదికిపైగా పెండింగ్ లో ఉన్న వాటిని మూడు నెలల్లో అనుమతుల ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుగా ప్రత్యామ్నాయ అటవీకరణ నిధుల చెల్లింపు, మళ్లించిన అటవీ భూమికి బదులుగా అటవీకరణ కోసం ప్రభుత్వ భూమిని కేటాయించిన నివేదికను సమర్పించాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో తలపెట్టిన అన్ని ప్రాజెక్టుల పూర్తిలో వేగాన్ని కోరుకుంటున్నాయని, ఆమేరకు పనిచేయాల్సిన బాధ్యత ప్రతీ శాఖ, అధికారులపై ఉందని, ఆ మేరకు స్టేజ్ - 2 అనుమతులు నిర్ణీత సమయంలో పొందాలని హేమంత్ కుమార్ అన్నారు. న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చూసుకోవాలని, అదే సమయంలో సరైన అటవీ అనుమతులు లేకుండా పనులు ప్రారంభిస్తే సంబంధిత అధికారులు చిక్కుల్లో పడతారని తెలిపారు.