‘ధరణి’కి ఏడాది

ABN , First Publish Date - 2021-10-29T08:11:33+05:30 IST

ధరణిలో చాలావరకు సేవలు అనుకున్న విధంగానే జరుగుతున్నా, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పటికి 1.80 లక్షల ఎకరాలకు సంబంధించిన పట్టాలను రైతులకు అందించారు. 10 శాతం వరకు దరఖాస్తులు సాంకేతిక కారణాలతో

‘ధరణి’కి ఏడాది

  • రైతులకు చేరువైన రెవెన్యూ సేవలు
  • 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్‌
  • సర్వే నంబర్లతో తప్పని ఇబ్బందులు


హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధరణి సేవలు ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయింది. రెవెన్యూ, భూ రికార్డుల సేవలను అత్యంత సులభంగా, పారదర్శకంగా, నిమిషాల వ్యవఽధిలోనే అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ గతేడాది అక్టోబరు 29న మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మండల కార్యాలయంలో ధరణి (ఇంటెగ్రేటెడ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) పోర్టల్‌ను ఆవిష్కరించారు. 2020 నవంబరు 2వ తేదీ నుంచి ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌ను తహసీల్దార్‌ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌తో పాటు రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్‌ కూడా వెంటనే జరుగుతుంది. గతంలో తాలుకా కేంద్రాల్లోని 141 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో మాత్రమే వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్లు జరిగేవి. ప్రస్తుతం 574 తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు చేస్తుండడంతో రైతులకు ప్రయాణ ఖర్చులు తగ్గాయి. ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాల్లో గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం కూడా లేదు. స్లాట్‌ బుక్‌ చేసుకుంటే కేవలం 10-15 నిమిషాల్లో రిజిస్ర్టేషన్‌ పూర్తవుతుంది.


1.80 లక్షల ఎకరాలకు పట్టాలు

ధరణిలో చాలావరకు సేవలు అనుకున్న విధంగానే జరుగుతున్నా, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పటికి 1.80 లక్షల ఎకరాలకు సంబంధించిన పట్టాలను రైతులకు అందించారు. 10 శాతం వరకు దరఖాస్తులు సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, ధరణిలో సబ్‌ డివిజన్‌ సర్వే నెంబర్లతో భూమి వివరాలను నమోదుచేశారు. దీంతో ఒక సర్వే నంబరులోని భూమి వివాదంలో ఉంటే మొత్తం డివిజన్‌లోని సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో వస్తున్నాయి. ఈ సమస్యపైనే ఎక్కువ మంది రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏడాది నుంచి 30 శాతం సమస్యలు కూడా పరిష్కారం కాలేదని ధరణి సమస్యలపై పోరాడుతున్న రైతు మన్నె నర్సింహారెడ్డి అన్నారు. మాన్యువల్‌ రికార్డుల ఆధారంగా సర్వే చేసి, ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించడం ద్వారా దీనిని అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు. ధరణిని విజయవంతంగా అమలు చేస్తున్నారని కలెక్టర్లు, రెవెన్యూ ఉద్యోగులను సీఎం అభినందించినట్టు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-10-29T08:11:33+05:30 IST