రిటైర్మెంట్ వయసు పెంపు త్వరలో ?
ABN , First Publish Date - 2021-01-12T08:53:26+05:30 IST
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న నేపథ్యంలో పదవీ విరమణ వయసుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి

60 ఏళ్లకు పెంచవచ్చంటున్న ఉద్యోగ సంఘాలు
రేపో మాపో ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న నేపథ్యంలో పదవీ విరమణ వయసుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు పీఆర్సీ పైనా స్పష్టత వస్తుందని చెబుతున్నాయి. రేపో మాపో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నాయి. ఈ సమావేశం ఈ నెల 13న జరగవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే.. దీనిపై ఉద్యోగ సంఘాలకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. కాగా, పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని టీఆర్‌ఎస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం 60 ఏళ్లకు పెంచవచ్చని అంటున్నారు. పీఆర్సీపై కూడా నిర్ణయం వెలువడుతుందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. పీఆర్సీ నివేదికపై సీఎస్ సోమే్‌షకుమార్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ కావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు జరగలేదు. రేపో మాపో ఉద్యోగ సంఘాలతో సమావేశమై పీఆర్సీ ఫిట్‌మెంట్, వయసు పెంపు నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.