రాష్ట్ర డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు
ABN , First Publish Date - 2021-12-30T07:17:35+05:30 IST
ఇప్పటి వరకూ జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఉన్నతాధికారుల

- జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు
- సర్కారు ఆదేశాలు జారీ.. కొత్త వైద్యకళాశాలల కోసమే నిర్ణయం
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంఽధ్రజ్యోతి): ఇప్పటి వరకూ జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఉన్నతాధికారుల చేతిలో ఉన్న తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు, ఇకపై జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ల చేతికి రానున్నాయి. ఈమేరకు సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ప్రారంభించనున్న వైద్య కళాశాలల కోసం సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సూపరింటెండెంట్ల అజమాయిషీలో డయాగ్నస్టిక్ కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.
ఇప్పటి వరకూ ల్యాబ్ నిపుణుల నియామకం, వారి విధుల కేటాయింపు, యంత్రాల నిర్వహణ, నాణ్యత వంటి అన్ని అంశాలనూ ఎన్‌హెచ్‌ఎం అధికారులు కనిపెట్టుకుని ఉండేవారు. టి-డయాగ్నస్టిక్స్‌లో ఏదైనా సమస్య వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ విభాగాలతో పాటు ఇతర శాఖల సహకారం తీసుకుని పరిష్కరించేవారు. కానీ.. సూపరింటెండెంట్‌లకు జిల్లా కలెక్టర్‌తో నేరుగా సంబంధాలుండవు. తమ పరిధిలో మాత్రమే వారు పనిచేస్తారు.
ఈ నేపథ్యంలో.. ఏదైనా సమస్య వస్తే త్వరితగతిన స్పందించే సామర్థ్యం కూడా వారికి ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో టి-డయాగ్నస్టిక్ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. మరో 13 జిల్లాల్లో కూడా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం గత నెల 3న వెల్లడించింది. వీటన్నింటినీ ఎన్‌హెచ్‌ఎమ్ నిధులతోనే ఏర్పాటు చేస్తున్నారు.
జాతీయ వైద్య సంఘం నిబంధనల ప్రకారం వైద్య కళాశాలల్లో అత్యాధునిక సెంట్రలైజ్డ్ ల్యాబ్ ఉండాలి. కొత్తగా ఏర్పాటవుతున్న కాలేజీల్లో ల్యాబ్‌లు, ఆ నిబంధనలకు తగ్గట్లుగా లేకపోవడంతో డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రభుత్వం సూపరింటెండెంట్ల కిందకు తీసుకొచ్చిందనేది అంతర్గత వర్గాల మాట. మున్ముందు ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్న యోచనలో సర్కారు ఉంది. ఆది కూడా దృష్టిలో పెట్టుకునే.. డయాగ్నస్టిక్ కేంద్రాలను జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్స్‌కు సర్కారు అప్పగించిందని అంటున్నారు.
అయితే.. సూపరింటెండెంట్లు ఇప్పటి వరకూ ఆస్పత్రుల్లో చిన్న చిన్న పరికరాల మరమ్మతులనే పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరిప్పుడు ఏకంగా డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఉన్న అత్యాధునిక యంత్రాల నిర్వహణపై వారు ఏమేరకు దృష్టిపెడతారు అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. టి- డయాగ్నస్టిక్స్‌కు జిల్లాల్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నుంచి అన్ని రకాల పరీక్షా నమూనాలు ఇకపై వస్తాయా లేదా అన్నదానిపైనా సందిగ్ధత వీడలేదు. అన్ని ఆస్పత్రిల్లోనా ఇప్పటికే ల్యాబ్‌లు ఉన్నప్పటికీ.. కొత్తగా డయాగ్నస్టిక్స్‌ను ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకూ సమాధానం లేదు. దీంతో.. ఇప్పటికే ఉన్న ల్యాబ్‌లను ఏం చేస్తారో చూడాల్సి ఉందంటూ పరిశీలకులు పేర్కొంటుండటం గమనార్హం.