క్రిమినల్‌ కేసులో అసదుద్దీన్‌ ఒవైసీకి ఊరట

ABN , First Publish Date - 2021-02-06T11:58:13+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్‌లో నమోదైన

క్రిమినల్‌ కేసులో అసదుద్దీన్‌ ఒవైసీకి ఊరట

హైదరాబాద్‌ : 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్‌లో నమోదైన క్రిమినల్‌ కేసులో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి ఊరట లభించింది. ఈ కేసులో తదుపరి విచారణను నిలుపుదల చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. పాతబస్తీకి వెళుతుండగా ఒవైసీ, అతని అనుచరులు పురానాపూల్‌ వద్ద తన కారును అడ్డగించి దాడిచేసి గాయపర్చారని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.


ఈ కేసులో అసదుద్దీన్‌ను ఎ-1గా చేరుస్తూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ట్రయల్‌ కోర్టులో చార్జిషీటు, సప్లిమెంటరీ చార్జిషీట్లను వేశారు. ఈ దాడిలో అసదుద్దీన్‌ పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అసద్‌ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వ్యాజ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి హుస్సేనీ ఆలం పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై తదుపరి విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2021-02-06T11:58:13+05:30 IST