బ్లాక్‌లో ‘రెమ్‌డెసివిర్’ అమ్మకాలు.. 3 ముఠాలు అరెస్టు
ABN , First Publish Date - 2021-05-08T08:51:13+05:30 IST
కరోనా చికిత్సకు వినియోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఖమ్మంలో బ్లాక్ మార్కెట్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల (ఒక్క ఇంజక్షన్) చొప్పున విక్రయిస్తున్న మూడు ముఠాలను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- ఖమ్మంలో అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
- హైదరాబాద్‌లో ఒకరికి బేడీలు
- భద్రాద్రిలో ఇంజక్షన్ల అక్రమాల కేసులో..
- ముగ్గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ఖమ్మం/హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్, మే7 (ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్సకు వినియోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఖమ్మంలో బ్లాక్ మార్కెట్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల (ఒక్క ఇంజక్షన్) చొప్పున విక్రయిస్తున్న మూడు ముఠాలను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పలు ముఠాలు ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిచయమున్న వైద్యసిబ్బంది సహాయంతో బ్లాక్‌లో విక్రయాలు జరుపుతున్నాయని శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ఖమ్మం జిల్లా సంచికలో ‘మందు మాయ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ముఠాలను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు.
రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 11 మంది సభ్యులున్న మూడు ముఠాలను అదుపులోకి తీసుకుని వారినుంచి పెద్ద ఎత్తున రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది సాయంతో రెమ్‌డెసివిర్‌ను ఖమ్మానికి తీసుకొచ్చి పలువురు విక్రయిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. మరోవైపు, హైదదాబాద్లోనూ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. జేమ్స్ స్ట్రీట్ పాన్‌బజార్‌కు చెందిన ఆకుల మెహుల్ కుమార్ (26) శుక్రవారం ఒక్కో ఇంజక్షన్ రూ.35 వేల చొప్పున బ్లాక్‌లో విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అతడి నుంచి నాలుగు ఇంజక్షన్లతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఇటీవల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల వినియోగంలో జరిగిన అక్రమాల వ్యవహారంలో ముగ్గురు వైద్య సిబ్బందిపై సంబంధిత అధికారి డాక్టర్ ముక్కంఠేశ్వరరావు సస్పెన్షన్ వేటు వేశారు.
ఉస్మానియాలో ‘రెమ్‌డెసివిర్’ మాయం
ఉస్మానియా ఆస్పత్రిలో పెద్ద మొత్తంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు మాయమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇది ఇంటి దొంగల పనే అన్న అనుమానంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఉన్నతాధికారులతో శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అంతర్గత విచారణ చేపట్టారు. మెడికల్ స్టోర్‌కు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఓపీ స్టోర్స్ నుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు మాయమైనట్లు గుర్తించారు. ఆస్పత్రిలో 50కి పైగా సీసీ కెమెరాలు ఉండడంతో వాటి ఫుటేజీలను పరిశీలించి ఇంటి దొంగలు ఎవరనేది తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.