రావత్‌ సేవలు విశిష్టం: తమిళిసై

ABN , First Publish Date - 2021-12-09T07:05:06+05:30 IST

సీడీఎస్‌ అడ్మిరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి,

రావత్‌ సేవలు విశిష్టం: తమిళిసై

  •  దిగ్ర్భాంతికి గురయ్యాను: ఏపీ గవర్నర్‌
  •  ఊహించని దుర్ఘటన: చంద్రబాబు
  •  ప్రమాదం ఆశ్చర్యకరం, బాధాకరం: ఉత్తమ్‌
  •  ఆయన సేవలు ఎనలేనివి: కిషన్‌ రెడ్డి
  •  రావత్‌ మృతి దేశానికి తీరని లోటు: కేటీఆర్‌
  •  మాటలకందని విషాదం: రేవంత్‌రెడ్డి 


హైదరాబాద్‌/అమరావతి/న్యూఢిల్లీ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సీడీఎస్‌ అడ్మిరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి, ఇతర జవాన్లు మృతి చెందడం తనను తీవ్ర వేదనకు గురి చేసిందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దేశ భద్రత కోసం రావత్‌ విశిష్టమైన సేవలందించారని, దేశ సైన్యాన్ని ప్రపంచంలోనే బలమైనదిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని ఆమె కొనియాడారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హెలికాప్టర్‌ దుర్ఘటనపై ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సీడీఎస్‌ రావత్‌తో పాటు ఆయన సతీమణి, మిగతా ఆర్మీ సిబ్బంది మరణించడంపై గవర్నర్‌ సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


 సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మృతిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన ఊహించనిదని, దేశానికి సేవ చేస్తున్న సైన్యాధిపతి, ఆయన సహచరులు ప్రాణాలు కోల్పోవడం తీరని లోటని ఆయన పేర్కొన్నారు. హెలికాప్టర్‌ దుర్ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రష్యన్‌ హెలికాప్టర్‌ అయిన ఎంఐ-17ను భద్రతాపరంగా మంచి హెలికాప్టర్‌గా భావిస్తారని, డబుల్‌ ఇంజన్లు ఉంటాయని తెలిపారు. కొండ ప్రాంతాల్లో ప్రయాణించడం, వాతావరణ మార్పులను కూడా తట్టుకుంటుందని, రిస్క్‌ ఉండదని పేర్కొన్నారు. అలాంటి హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడం చాలా ఆశ్చర్యకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మృతి దేశానికి తీరని లోటని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన రావత్‌ కుటుంబంతో పాటు సైనిక సిబ్బంది కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ మంత్రి ట్వీట్‌ చేశారు. హెలికాప్టర్‌ ఘటన తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గొప్ప వీరులను కోల్పోవడం బాధగా ఉందని ఆమె ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రావత్‌ చేసిన సేవలు ఎనలేనివని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ నేత డీకే అరుణ కూడా ఈ ఘటనపై ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. రావత్‌ దంపతుల అకాల మరణం మాటలకు అందని విషాదం నింపాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. డిఫెన్స్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ఆయనను కలిసే అవకాశం తనకు లభించిందని, ఒక సైనికునికి ఉండాల్సిన ఐదు లక్షణాలను ఆయన నిర్వచించిన తీరును దేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రేవంత్‌ సానుభూతి తెలిపారు. అలాగే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ, వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా ఈ ఘటనపై ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కనినర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి సంతాపం తెలిపారు.





రావత్‌ సేవలు చిరస్మరణీయం

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) అడ్మిరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచి వేసింది. దేశ రక్షణ రంగానికి రావత్‌ చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబ సభ్యులతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులకూ నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. 

- ముఖ్యమంత్రి కేసీఆర్‌




సీడీఎస్‌ మరణం నన్ను కలచివేసింది

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. రావత్‌తో పాటు చనిపోయిన ఆయన సతీమణి, ఆర్మీ సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.

- ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌


Updated Date - 2021-12-09T07:05:06+05:30 IST