నేటి నుంచి ‘ఓటీపీ- ఐరిస్’తో రేషన్!
ABN , First Publish Date - 2021-02-01T08:13:24+05:30 IST
వేలిముద్రల విధానానికి స్వస్తిచెప్పి.. మొబైల్ ఓటీపీ, ఐరిస్ (కనుపాపల) సిస్టమ్‌లో రేషన్ బియ్యం పంపిణీచేసే విధానానికి సోమవారం నుంచి పౌరసరఫరాలశాఖ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మొత్తం 87,56,012

‘ఆధార్’ డేటాతో పీడీఎస్ డేటా అనుసంధానం.. సెల్ నంబర్, ఐరిస్ సీడింగ్ అయితే నో ప్రాబ్లమ్
లేదంటే బియ్యం తీసుకోవటం కష్టమే
ఆధార్ అప్‌డేట్ కోసం 2,067 కేంద్రాలు
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వేలిముద్రల విధానానికి స్వస్తిచెప్పి.. మొబైల్ ఓటీపీ, ఐరిస్ (కనుపాపల) సిస్టమ్‌లో రేషన్ బియ్యం పంపిణీచేసే విధానానికి సోమవారం నుంచి పౌరసరఫరాలశాఖ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మొత్తం 87,56,012 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిపై 2,80,58,651 మంది లబ్ధిదారులున్నారు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఎవరికీ సెల్‌ఫోన్ లేకపోతే? ఇలాంటి వారికి ఐరి్‌స(కనుపాపలు) స్కాన్ చేసి కూడా బియ్యం తీసుకోవచ్చు. అయితే బియ్యం తీసుకునేది ఓటీపీ విధానంతోనా? ఐరిస్ విధానంతోనా అన్నది లబ్ధిదారు ఎంచుకోవచ్చు. రేషన్ డీలర్లు మాత్రం ఎక్కువగా ‘ఓటీపీ’ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. సెల్ నంబర్, ఐరిస్ వివరాలన్నీ ‘ఆధార్’ నెట్ వర్క్ నుంచే తీసుకుంటున్నారు. ఆధార్ కార్డుతో సెల్ నంబర్, ఐరిస్ సీడింగ్ అయివుంటే సమస్య ఉండదు. కానీ సీడింగ్ కానివారికి మాత్రం సమస్య ఎదురవుతుంది. రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల్లో 60-70 శాతం మందికే ఆధార్‌తో సెల్‌ఫోన్ నంబర్లు లింక్ అయి ఉన్నట్లు సమాచారం.
మిగిలినవారు ఐరిస్ విధానంతో రేషన్ తీసుకోవచ్చునని అధికారులు చెబుతున్నా అది ఎంత వరకు పనిచేస్తుందనే విషయంలో స్పష్టతలేదు. పీడీఎ్‌సకు ఆధార్‌డేటా కీలకమైన ఆధార్ డేటా పూర్తిగాలేనివారు అప్‌డేట్ చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,067 ఆధార్ అప్‌డేషన్ సెంటర్లు ఉన్నాయి. సెల్ నంబర్ వివరాలు, ఇతర సమాచారం ఏదైనా ఫీడ్ చేసుకోవాలనుకుంటే ఈ సెంటర్లకు వెళ్లి నమోదు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 15 రోజులు రేషన్ పంపిణీ ఉంటుంది. ఈసారి కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో అదనంగా మరో 5 రోజులు అవకాశం ఇచ్చారు.
కొత్త విధానం ఇలా
నూతన విధానం ప్రకారం.. రేషన్ షాపు వద్దకు లబ్ధిదారు వెళ్లి డీలర్‌కు పేరు, రేషన్ కార్డు నంబరు, మొబైల్ నంబర్ చెబితే సరిపోతుంది. లబ్ధిదారులు రేషన్ షాపులో కార్డు నంబరు చెప్పగానే ఈ-పాస్ డివై్‌సలో ఎంటర్ చేస్తారు. లబ్ధిదారు పేరు మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే.. సెల్‌ఫోన్‌కు వన్‌టైమ్ పాస్ వర్డ్(ఓటీపీ) వస్తుంది. అది చెబితే ఈ-పాస్ డివై్‌సలో ఎంటర్ చేసి రేషన్ ఇస్తారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి సెల్‌ఫోన్ ఉన్నా ఓటీపీ ద్వారా రేషన్ తీసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు.