టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌పై అత్యాచార ఆరోపణ

ABN , First Publish Date - 2021-05-02T07:15:37+05:30 IST

జవహర్‌నగర్‌ 6వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ పల్లపు రవి వివాదంలో చిక్కుకున్నారు. తనపై అత్యాచారం చేశారంటూ ఆయనపై ఓ దళిత మహిళ జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌పై అత్యాచార ఆరోపణ

  • జనహర్‌నగర్‌ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ పల్లపు రవిపై దళిత మహిళ ఫిర్యాదు
  • ఇంటికొచ్చి అఘాయిత్యం చేశారని బాధితురాలి వెల్లడి
  • బయటపెడితేతీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టినట్లు ఆరోపణ
  • కేసు నమోదు చేసిన పోలీసులు

జవహర్‌నగర్‌, మే1 (ఆంధ్రజ్యోతి): జవహర్‌నగర్‌ 6వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ పల్లపు రవి వివాదంలో చిక్కుకున్నారు. తనపై అత్యాచారం చేశారంటూ ఆయనపై ఓ దళిత మహిళ జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం (ఏప్రిల్‌ 30న) మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న తన ఇంటివద్దకు పల్లపు రవి వచ్చి.. తనను ఇంట్లోకి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపించింది. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారని పేర్కొంది. ఇంచార్జి సీఐ పాండురంగారెడ్డికి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... బీజేఆర్‌ కాలనీకి చెందిన దంపతులు అక్కడ మూడేళ్ల క్రితం 115 గజాల స్థలాన్ని పల్లపు రవి వద్ద నోటరీ ద్వారా  కొనుగోలు చేశారు.  అదే స్థలంలో రేకుల గదులు నిర్మించేందుకు రూ. రెండు లక్షలకు రవితో ఒప్పందపత్రం రాయించుకుని అడ్వాన్స్‌గా రూ. 50 వేలు కూడా ఇచ్చారు. 


ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంటి పనులు జరుగుతున్న స్థలానికి పల్లపురవి వచ్చారు. ఆ సమయంలో అక్కడ పనులు చేసుకుంటున్న ఇంటి యజమానురాలిని ఉద్దేశించి రవి ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అంటూ ఆమెపై చేయివేసి దగ్గరకు లాక్కున్నారు. ఆమె ప్రతిఘటించడంతో బలవంతంగా ఎత్తుకొని నిర్మాణంలో ఉన్న బెడ్‌రూంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆమె రోదిస్తూ బీజేఆర్‌ నగర్‌ బస్టాప్‌ వైపు వెళ్లడంతో అక్కడకు చేరుకున్న రవి...  ‘ఈ విషయం ఇంతటితో ముగించు. ఎవరికైన చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని హెచ్చరించారు. అయితే తన పట్ల జరిగిన దారుణాన్ని బాధితురాలు.. తన భర్త, కుటుంబసభ్యులకు చెప్పింది. ఈ ఘటనపై భర్త, బందువులు శనివారం జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌ పల్లపు రవిపై అత్యాచారంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా కార్పొరేటర్‌ రవిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి బంధువులు, దళిత నాయకులు ఆందోళన నిర్వహించారు.

Updated Date - 2021-05-02T07:15:37+05:30 IST