గుర్తింపుపై గుబులు!

ABN , First Publish Date - 2021-10-21T08:55:48+05:30 IST

చారిత్రక రామప్ప ఆలయం అభివృద్ధికి నిధుల లేమి ఆటంకంగా మారింది.

గుర్తింపుపై గుబులు!

రామప్ప అభివృద్ధిపై ప్రభుత్వాల నిర్లక్ష్యం..

32 కోట్లతో కేంద్ర పురావస్తు శాఖ ప్రతిపాదనలు 

పైసా కేటాయించని ప్రభుత్వాలు

ముంచుకొస్తున్న యునెస్కో గడువు.. 

నేడు రామప్పకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

అభివృద్ధి పనులపైఅధికారులతో సమీక్ష


భూపాలపల్లి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): చారిత్రక రామప్ప ఆలయం అభివృద్ధికి నిధుల లేమి ఆటంకంగా మారింది. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో అభివృద్ధికి అడుగులు పడటం లేదు. ఫలితంగా డిసెంబరు 22లోగా రామప్ప రూపురేఖలు మార్చాలన్న యునెస్కో ఆదేశాలు ఆటకెక్కుతున్నాయి. ఈ ఏడాది జూలై 25న ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పకు యునెస్కో గుర్తింపునిచ్చింది. అంతకు ముందు 2019 సెప్టెంబరు 23, 24 తేదీల్లో రామప్పలో యునెస్కో బృందం పర్యటించింది. ఈ సందర్భంగానే ఆలయ అభివృద్ధి, సంరక్షణ కోసం కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చింది. గుర్తింపు లభించిన నేపథ్యంలో యునెస్కో సూచించిన ఆలయ సంరక్షణ పనులు పూర్తి చేసేందుకు డిసెంబరు 22 వరకు గడువు కూడా ఇచ్చింది. ఈలోగా రామప్ప రూపురేఖలు మారిపోవాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు కూడా మంజూరు చేయాల్సి ఉంది. ఇందుకు మరో రెండున్నర నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబరు 22 తర్వాత ఎప్పుడైనా యునెస్కో బృందం రామప్పలో పర్యటించే అవకాశం ఉంది. ఈలోగా యునెస్కో ఆశించిన రీతిలో రామప్పలో అభివృద్ధి, ఆలయ సంరక్షణ చర్యలు లేకుంటే ఇచ్చిన గుర్తింపును కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో యుద్ధప్రతిపాదికన పనులు చేట్టాల్సి ఉండగా, పాలకులనుంచి ఆశించిన స్థాయిలో నిధులు మంజూరు కాకపోవటం ఆందోళన కలిగిస్తోంది. 


32 కోట్లతో పురావస్తు శాఖ ప్రతిపాదన

రామప్ప ఆలయం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉంది. దీంతో ఆలయం చుట్టూ వంద మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖే అభివృద్ధి చేయాలి. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ నుంచి భారీగా నిధులు విడుదల కావాల్సి ఉంది. ఆ శాఖకు తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో తలపెట్టిన రామప్ప పర్యటన.. అధికారులు  డీపీఆర్‌(సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్‌) సిద్ధం చేయకపోవడంతో వాయిదా పడింది. చివరికి 21న మంత్రి  పర్యటన ఖరారయింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మంత్రి పర్యటనతో నిధుల కేటాయింపు, పనుల నిర్వహణలో పురోగతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.వాస్తవానికి సుమారు రూ.32 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు కేంద్ర పురావస్తు శాఖ ప్రతిపాదనలు చేసింది. ప్రధానంగా ఆలయ ప్రాకారం, తొలిగించిన కామేశ్వరాలయం పునర్నిర్మాణాలు చేపట్టడం, గర్భగుడిలో మూసుకుపోయిన సోమసూత్రాన్ని పునరుద్ధరించటం, కాటేశ్వరాలయానికి మరమ్మతులు, రామప్ప ఆలయ ప్రాంగణంలో ఉన్న ఎనిమిది చిన్న చిన్న ఆలయాల పునరుద్ధరణతో పాటు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోని గొల్లాల గుడి, శివాలయం పునరుద్ధరణ పనులున్నాయి. ఇవే కాకుండా మరో రూ.100 కోట్లతో రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో థీమ్‌ పార్కులు, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని పలు ఆధ్యాత్మిక సంస్థలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి.


సౌకర్యాలకు రూ.60 కోట్లు..

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావటంతో భక్తులసంఖ్య పెరుగుతోంది. వీరికి సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.60 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా రామప్ప ఆలయానికి వెళ్లేందుకు రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే చెరువు కట్టపై నుంచి ఐలాండ్‌లోని ధ్యాన మందిరం వరకు రోప్‌వే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవేకాకుండా హరిత హోటళ్లు, అతిఽథి గృహాల నిర్మాణం తదితర పనులకు మరో రూ.100కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని పర్యాటక శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో రూ.160 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం రామప్పలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. మొత్తంగా రామప్పలో అభివృద్ధి పనులకు సుమారు రూ.392 కోట్ల నిధులు అవసరమని గుర్తించారు. అయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు పైసా కేటాయించలేదు. 


గుర్తింపు వచ్చినా పనులు పెండింగే..

రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు పైసా కూడా కేటాయించలేదు. అయితే రామప్ప ఆలయాన్ని పరిశీలించేందుకు 2019 సెప్టెంబరు 23, 24 తేదీల్లో యునెస్కో బృందం పర్యటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు యునెస్కో బృందం వచ్చే సమయానికి కొన్ని అభివృద్ధి పనులు ఆలయం ఆవరణలో చేపట్టారు. ఆలయ మొదటి గేటు నుంచి ప్రధాన గేటు వరకు రూ.5లక్షలతో ఫ్లాట్‌ఫామ్‌ నిర్మించారు. అలాగే విద్యుత్‌ స్తంభాలు బయటకు కనిపించకుండా ఆలయ ఆవరణలో అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ లైన్ల నిర్మాణం పనులను ఇటీవలే పునఃప్రారంభించారు. వీటి కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. రూ.80లక్షలతో తూర్పు ద్వారం రోడ్డు పనులను చేపట్టారు. ఈ పనులు పూర్తి అయినప్పటికీ ఇటీవల కురిసిన వర్షానికి రామప్ప చెరువు మత్తడి దూకడంతో 50మీటర్ల మేర రోడ్డు తెగిపోయింది. అలాగే తూర్పు గోడ ప్రాకారం పునఃనిర్మాణం కూడా పూర్తి చేశారు. రూ.కోటి వ్యయంతో తూర్పు ద్వారం వద్ద కాకతీయ కళా తోరణం నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు ఇంకా సాగుతునే ఉన్నాయి. వీటితో పాటు ఆలయం చుట్టూ, నంది విగ్రహం వద్ద ఆప్రన్‌ పనులు చేపట్టారు. ఈ పనులన్నీ రెండేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ రామప్పకు యునెస్కో గుర్తింపు రాకముందు 

చేపట్టిన పనులే. 

Updated Date - 2021-10-21T08:55:48+05:30 IST