ఇసుక పునాదులు.. తేలే ఇటుకలు

ABN , First Publish Date - 2021-07-26T07:40:26+05:30 IST

ఘన చరిత్ర ఎప్పుడూ జన హితానికి దోహదపడుతుంది. నాటి నాగరికత, సంస్కృతిక వైభవం వర్తమానానికి, భవిష్యత్తుకు మార్గదర్శనంగా నిలుస్తుంది.

ఇసుక పునాదులు.. తేలే ఇటుకలు

ఇసుక పునాదులు.. 

నీటిపై తేలియాడే ఇటుకలు 

రామప్ప ఆలయ నిర్మాణంలో విశిష్టతలెన్నో

భూకంపాలను తట్టుకొనేలా 

శాండ్‌బాక్స్‌ సాంకేతికత వినియోగం

ఏనుగు పేడ, తవుడు, కరక్కాయ, 

చెట్ల జిగురుతో ఇటుకల తయారీ

గుడి శివుడిది.. ఐనా శిల్పి పేరుతోనే ప్రసిద్ధి! 


ఘన చరిత్ర ఎప్పుడూ జన హితానికి దోహదపడుతుంది. నాటి నాగరికత, సంస్కృతిక వైభవం వర్తమానానికి, భవిష్యత్తుకు మార్గదర్శనంగా నిలుస్తుంది. రామప్ప ఆలయం ఈ కోవలోకే వస్తుంది. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆ నిర్మాణశైలి ఇప్పుడు, ఎప్పుడూ ఇంజనీర్లకు ఓ పాఠమే! ఒకపట్టాన అంతుబట్టని అద్భుతమే. పునాదుల నిండా ఇసుకను నింపి ఓ భారీ కట్టడాన్ని నిర్మించాలనే ఆలోచనే ఓ సాహసం. ఆ సాహసాన్ని ఆచరణలో పెట్టి 40 ఏళ్లు కష్టపడి.. భారీ ఆలయం నిర్మించడం మరో అద్భుతమైతే.. ఆ ఇసుక పునాదుల మీదే 800 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఆలయం చెక్కుచెదరకుండా ఉండటం పరమాద్భుతం! రాళ్లకు తాకితే వీణతంతులను మీటినట్లుగా స్వరాలు వినిపించడం.. నీళ్లలో వేస్తే ఇటుకలు మునిగిపోకుండా తేలియాడటం వంటి విశిష్టతలున్న రామప్ప.. ఇక ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులనూ అబ్బురపరచనుంది. విశ్వవ్యాప్తంగా పర్యాటకులను తనవైపు ఆకర్షించనుంది. 


భూపాలపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): అది కాకతీయుల వంశంలో గణపతి దేవుడు రాజ్యాన్నేలుతున్న కాలం. ఆయన సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు, ఓ భవ్యమైన శివాలయాన్ని కట్టించేందుకు సంకల్పించాడు. ఏకబిగిన నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణ పనులు సాగాక క్రీ.శ 1213లో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆలయ ప్రధాన శిల్పి పేరు రామప్ప. తదనంతర కాలంలో ఆ శిల్పాచార్యుడి పేరుతోనే ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ శివుడు రామలింగేశ్వరుడిగా పూజలం దుకుంటున్నాడు. 1310లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ సైన్యాధిపతి మాలిక్‌ కాఫర్‌ దండయాత్రతో ఈ ఆలయం బాగా దెబ్బతిన్నది. గుప్త నిధుల కోసం కొందరు తవ్వడంతోనూ కొంత నష్టం జరిగింది. 1819 జూన్‌ 16న 7.7-8.2 తీవ్రతతో భూకంపం సంభవించినా ఆలయం చెక్కుచెదరలేదు. దానికి కారణం.. అంతుబట్టని రీతిలో సాగిన నిర్మాణశైలే! భూకంపాలను సైతం తట్టుకొని నిలబడేందుకు శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ (ఇసుక పునాది)ని ఉపయోగించారు.


ఆలయంలో ఫ్లోరింగ్‌ అంతా గ్రానైట్‌ వాడారు. ఆలయం లోపలి భాగాల్లో ఎర్ర ఇసుక రాతి(రెడ్‌ శాండ్‌ స్టోన్‌)ని ఉపయోగించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే  కట్టడంపైన బరువును తగ్గించేందుకు ఆలయ గోపుర నిర్మాణంలో నీటి మీద వేస్తే తేలియాడే ఇటుకలను వినియోగించారు. వీటిని ఏనుగు పేడ, తవుడు, కరక్కాయ, చెట్ల జిగురుతో తయారు చేసినట్లుగా చెబుతారు. రామప్ప గర్భాలయంలో ఎత్తయిన పీఠంపై పెద్ద శివలింగం దర్శనమిస్తుంది. ఆలయంలోని శివుడి ఎదురుగా ఉన్న నంది మరో ఆకర్షణ. సూది పట్టేంత శిల్పాలు ఇక్కడ కొలువుదీరాయి. అంతేకాదు.. ఆలయం బరువును మోస్తున్నట్లుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. అయితే రూపం పరంగా వేటికవే భిన్నంగా ఉండడం వీటి ప్రత్యేకత.


ఎలా వెళ్లాలి? 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయానికి దూరం 209 కిలోమీటర్లు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లొచ్చు. రైల్లో వెళ్లాలంటే హైదరాబాద్‌ నుంచి కాజీపేటలో లేదంటే వరంగల్‌ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. కాజీపేట నుంచైతే 73 కిలోమీటర్లు, వరంగల్‌ నుంచైతే  సుమారు 75 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 



Updated Date - 2021-07-26T07:40:26+05:30 IST