తెలంగాణలో రాజన్న రాజ్యం
ABN , First Publish Date - 2021-09-03T08:17:24+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు ఒక చోట కూడినా ‘‘ఆ ఒక్కడు బతికుంటే ఇలా జరిగి ఉండేది కాదేమో’’ అన్న మాట వినిపిస్తోందని దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి సతీమణి, వైఎ్‌సఆర్ కాంగ్రెస్..

- నా బిడ్డ షర్మిలను ఆశీర్వదించండి
- వైఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విజయలక్ష్మి
- తెలంగాణలో మళ్లీ వైఎస్ పాలన తెస్తా
- ఇక్కడి ప్రజలు మన కుటుంబమంటూ
- నాన్న నా గుండెలపై విల్లు రాశారు
- మాటిస్తున్నా.. వారి కోసం కొట్లాడతా: షర్మిల
హైదరాబాద్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు ఒక చోట కూడినా ‘‘ఆ ఒక్కడు బతికుంటే ఇలా జరిగి ఉండేది కాదేమో’’ అన్న మాట వినిపిస్తోందని దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి సతీమణి, వైఎ్‌సఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎ్‌స.విజయలక్ష్మి అన్నారు. వైఎస్ 12వ వర్ధంతి సందర్భంగా గురువారం ఇక్కడ హైటెక్స్‌లో తన ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ సంస్మరణ సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలని షర్మిలముందుకు వెళుతోందని, తన బిడ్డను ఆశీర్వదించాలని సంస్మరణ సభకు వచ్చిన వారికి విజ్ఞప్తి చేశారు. షర్మిల వైఎ్‌సఆర్‌కు ముద్దుల బిడ్డ అని, ఆమెకు నాన్నే లోకంగా ఉండేదని చెప్పారు. వైఎ్‌సఆర్ భార్యను కావడం తనకు గర్వకారణమని, ఆయన బిడ్డలుగా జగన్, షర్మిలలు ధన్యులని అన్నారు. వైఎ్‌సఆర్‌ను జ్ఞాపకం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన సభగా పేర్కొన్న విజయమ్మ ఆయన ప్రేమ చాలా విశాలమైనదని గుర్తు చేసుకున్నారు.
అందర్నీ ప్రేమించాలని చెప్పేవారని అన్నారు. వైఎ్‌సఆర్ కంటే ఎక్కువగా తనను, తన బిడ్డలను ఈ ప్రజలు ప్రేమించారని, ఆదరించి అక్కున చేర్చుకున్నారని చెప్పారు. వైఎస్ కారణంగానే తాము కేంద్రంలో అధికారానికి వచ్చినట్లు స్వయంగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ తనతో అన్నట్లు విజయమ్మ వెల్లడించారు. ఇతర పార్టీల నేతలు చనిపోయినపుడు గౌరవ సూచకంగా బీజేపీ జెండాను అవనతం చేయడం ఒక్క వైఎ్‌సఆర్ విషయంలోనే జరిగిందని ప్రస్తుత ప్రధాని మోదీ తనను కలిసినపుడు చెప్పారన్నారు. ప్రాంతానికి అనుగుణంగా ప్రాజెక్టులు, పరిశ్రమలు, సంక్షేమ పథకాలు కనిపిస్తాయని, వైఎస్ చేసిన పనులే ఇప్పుడు మాట్లాడుతున్నాయని అన్నారు. విజయమ్మ మాట్లాడుతూ ఒకదశలో ఉద్వేగానికి గురయ్యారు. దాంతో షర్మిల వేదిక మీదకు వచ్చి ఆమెను అనునయించారు.
తెలంగాణ ప్రజలు నా కుటుంబం
నాన్న నా గుండెలపై విల్లు రాశారు: షర్మిల
‘‘నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రాంత ప్రజలు నా కుటుంబం.. బాధ్యత. ఈ మేరకు నాన్న నా గుండెలపై ఒక విల్లు రాశారు. నాన్న ప్రేమించిన ఈ ప్రజలకు ఆయన వర్ధంతి రోజున మాటిస్తున్నా. వీరికోసం కొట్లాడతా. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ పాలన తెస్తా’’ అంటూ వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి, వైఎ్‌సఆర్ కూతురు షర్మిల అన్నారు. సంస్మరణ సభలో ఆమె మాట్లాడుతూ, తన తండ్రి వైఎ్‌సఆర్ మనసులో తెలుగు ప్రజలంతా ఒక్కటేనని, తప్పక వేరు చేసి చూడాలీ అంటే రెండు ప్రాంతాలూ ఆయనకు రెండు కళ్లేనని చెప్పారు. ఆయన ప్రేమించిన ఒక ప్రాంత ప్రజలు నిర్లక్ష్యానికి గురువుతుంటే.. ఈ రాష్ట్రంలో ఆయన ప్రారంభించిన పథకాలు నీరు కారిపోతుంటే.. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వైఎ్‌సఆర్ బిడ్డగా తాను చూస్తూ ఊరుకోలేక పోయానన్నారు. ఈ ప్రజల కోసం తాను నిలబడి కొట్లాడతానని, వైఎ్‌సఆర్ కన్న కలలు నిజం చేయడానికి జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. తనకు స్వార్థం లేదని, గుండెల్లో నిజాయితీ, ఒంట్లో వైఎ్‌సఆర్ రక్తం ప్రవహిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నియంత పాలన పోయి.. ప్రజల రాజ్యం రావాలన్నారు. వైఎ్‌సఆర్ 12వ వర్థంతిని పుష్కరంగా భావించి ఆయన జ్ఞాపకాల్లో మనం మునిగి తేలామని చెప్పారు. తన తండ్రి తనపై చూపిన ప్రేమ అసాధారణమైనదన్నారు.
వైఎస్ మరణం.. కాంగ్రెస్ పార్టీ దురదృష్టం: కేవీపీ
వైఎ్‌సఆర్ దుర్మరణం.. కాంగ్రెస్ పార్టీ, దేశ.. రాష్ట్ర ప్రజల దురదృష్టమంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల కిందటి వరకూ తనకు ప్రజలు, పత్రికల ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం రాలేదని, వైఎ్‌సఆర్ వెళ్లి దేవుళ్లలో కలిసిన తర్వాత ప్రతి సందర్భంలోనూ మాట్లాడాల్సిన అవసరం కలుగుతోందని అన్నారు. పరోపకారం, దయ, స్నేహభావం మూర్తీభవించిన నాయకత్వ లక్ష్యణం వైఎ్‌సఆర్ సొంతమని చెప్పారు. ఉచిత విద్యుత్తు కోసం తమ పార్టీ నాయకత్వంతోనే ఆయన సుదీర్ఘ యుద్ధం చేశారన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరం సస్యశ్యామలం కావడానికి పునాది వేసింది వైఎ్‌సఆరేనని చెప్పారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వైఎ్‌సఆర్ 20 ఏళ్ల పాటు పడిన కష్టం, ఎవరూ పడలేదని వ్యాఖ్యానించారు. ఆయన ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగించడానికి మనం సంకల్పించాలని పిలుపునిచ్చారు. ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ వైఎ్‌సఆర్ తనను తమ్ముడిలా చూశారన్నారు. రంగా వ్యవసాయ వర్శిటీకి జార్జ్‌బుష్ వచ్చినప్పుడు వైఎస్ గొప్ప రైతు నాయకుడంటూ కితాబునిచ్చారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ మరణం.. ప్రత్యక్షంగా రాష్ట్రానికి, పరోక్షంగా దేశానికి నష్టమన్నారు.
దేశంలోనే గొప్పనాయకుడయ్యేవారు: కోమటిరెడ్డి
వైఎ్‌సఆర్ బతికి ఉన్నట్లయితే దేశంలోనే గొప్ప నాయకుడై ఉండేవారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రాంతాలకు అతీతంగా ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారన్నారు. ఆయన జీవితం తెరిచిన పుస్తకమని, తనలాంటి కార్యకర్తలను ఈ స్థాయికి తీసుకువచ్చారని గుర్తు చేసుకున్నారు. అమెరికాలోనూ లేని విధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి, ప్రముఖ వైద్యుడు గురవారెడ్డి, కిమ్స్ అధినేత భాస్కర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఏబీకే ప్రసాద్, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హాజరు కాని ఇతర పార్టీల నేతలు!
కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీల్లో ఉన్న వైఎస్ మంత్రి వర్గ సహచరులు, సమకాలీకులు, సినీ ప్రముఖులు తదితరులకు ఈ కార్యక్రమానికి రావాలని విజయమ్మ ఆహ్వానం పంపినా ఆ మేరకు స్పందన లేదు. రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పినా.. రావడానికి ఆసక్తి చూపలేదు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలూ ఈ కార్యక్రమానికి దూరంగానే వ్యవహరించడం, కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని రాజకీయ సభగానే చూడడం తదితరాల నేపథ్యంలో రాజకీయ నాయకుల్లోని ఆహ్వానితుల్లో ఎక్కువ మంది హాజరు కాలేదు. ఏపీకి సంబంధించి వైఎ్‌సకు అప్పట్లో సన్నిహితులైన మాజీ ఎంపీలు కేవీపీ రాంచందర్‌రావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎన్ రఘువీరా రెడ్డిలు వచ్చి సభలో మాట్లాడారు కూడా. అయితే వీరు సభకు రాకుంటేనే ఎక్కువగా చర్చ అయ్యేదని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరై తన సందేశాన్నీ ఇచ్చారు. అయితే, విజయలక్ష్మి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం రాజకీయ ప్రేరేపిత సమ్మేళనంగానే భావిస్తున్నామని, ఈ సమ్మేళానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ వెళ్ల వద్దంటూ గురువారం మధ్యాహ్నమే టీపీసీసీ ఒక ప్రకటన చేసింది.
టీపీసీసీ, ఏపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, శైలజానాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనద్దంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ప్రకటించారు. ఎవరు పాల్గొన్నా అది వారి వ్యక్తిగతమని, ఏఐసీసీ ఈ విషయాలను పరిశీలిస్తుందనీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మినహా కాంగ్రెస్ పార్టీ ముఖ్యలెవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ ఎంఏ ఖాన్ హాజరయ్యారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌లు వచ్చారు. సీపీఐ జాతీయ నేత నారాయణ తాను అనివార్య కారాణాల వల్ల రాలేక పోతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సినీ ప్రముఖులను పిలిచినా ఎవరూ రాలేదు. మోహన్‌బాబు ఆడియో సందేశాన్ని, కృష్ణ వీడియో సందేశాన్ని పంపించారు. ఆ సందేశాలను వేదికపై ప్రదర్శించారు.
ఒంటరి దానినైనా..షర్మిల భావోద్వేగ ట్వీట్
‘‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలు ఎదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ కంటిపాపలా చూసుకున్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ అండ్ మిస్ యూ డాడ్’’ అంటూ షర్మిల చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇప్పటికే అన్నా చెల్లెలి మధ్య రాజకీయ దూరం పెరిగిందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, తల్లి చొరవతో ఇద్దరూ కలిసి తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు ముగిస్తే.. 10.20 సమయంలో ‘నేను ఒంటరి దానినైనా..’అంటూ షర్మిల ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
