ధాన్యానికి రైతుల నిప్పు

ABN , First Publish Date - 2021-12-09T05:50:35+05:30 IST

ధాన్యానికి రైతుల నిప్పు

ధాన్యానికి రైతుల నిప్పు
ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలుపుతున్న రైతులు

  తరుగు ఎక్కువగా తీస్తున్నారని ఆందోళన

శాయంపేట, డిసెంబరు 8: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  మిల్లర్లు, ఐకేపీ నిర్వాహకులు తరుగు పేరుతో 3 కిలోల ఎక్కువ తూకం వేస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో బుధవారం వరికి నిప్పంటించారు. ఈ సందర్భంగా రైతులు కర్ర వెంకట్‌ రెడ్డి, ఎలమంచ ఇంద్రారెడ్డి, చిలుకల కొమురయ్యలు మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల వడ్ల బస్తాకు ఒక కిలో తూకాన్ని ఎక్కువ వేయాల్సి ఉండగా నిర్వాహకులు అదనంగా 3 కిలోల తూకం వేస్తున్నారని మండిపడ్డారు. ఐకేపీ నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మకై అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. ఇదే గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో రూ.24 లక్షల అవినీతి వెలుగుచూసిందని వాపోయారు. ఈసారి ఐకేపీ వారికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అప్పగించగా తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో రైతులు పెద్దిరెడ్డి మహేందర్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:50:35+05:30 IST