రైల్వే సమస్యలపై టీ రైల్వే జేఏసీ దీక్ష

ABN , First Publish Date - 2021-11-29T05:10:07+05:30 IST

రైల్వే సమస్యలపై టీ రైల్వే జేఏసీ దీక్ష

రైల్వే సమస్యలపై టీ రైల్వే జేఏసీ దీక్ష
కాజీపేటలో రైల్వే ఉద్యోగుల దీక్షా కార్యక్రమంలో మాట్లాడుతున్న చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

కాజీపేటలో 30 గంటల మహా నిరాహార దీక్ష ప్రారంభం

కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.. : చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌

హాజరైన ఎమ్మెల్యే అరూరి, మేయర్‌ సుధారాణి, కాంగ్రెస్‌ నేతలు

కాజీపేట, నవంబరు 28: క్రూ లింకుల తరలింపు, రైల్వే డివిజన్‌ ఏర్పాటు, టౌన్‌ స్టేషన్‌ ఆధునీకరణ, రైల్వే పరిశ్రమలకు నిధుల కేటాయింపు కోసం తెలంగాణ రైల్వే జేఏసీ నడుంబిగించింది. కాజీపేటలోని చౌరస్తాలో ఆదివారం 30 గంటల మహా నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా టీ రైల్వే జేఏసీ చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ప్రకటించారు. తొలుత మహాత్మ జ్యోతిరావు ఫూలే 130వ వర్ధంతిని పురస్కరించుకుని జ్యోతిరావు ఫూలే చిత్ర పటానికి తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌, ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్‌ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన ప్రారంభించారు. 

ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. కాజీపేటకు రైల్వేపరంగా రావాల్సిన అన్నింటికోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. రైల్వే పరిశ్రమలు, డివిజన్‌ సాధన కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, మేయర్‌ గుండు సుధారాణి, డీబీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్‌, 62, 63, 47వ డివిజన్ల కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌ యాదవ్‌, విజయశ్రీ రజాలీ, సంకు నర్సింగ్‌, అంబేద్కర్‌ సంఘం జి ల్లా అధ్యక్షుడు ఎం.ఎల్లయ్య, ఎస్‌.రవి, టీఎంఎం జిల్లా అధ్యక్షుడు ఎ.రాంచందర్‌, సందెల విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ మహా నిరాహార దీక్షలో టీ రైల్వే జేఏసీ కన్వీనర్‌ దేవులపల్లి రాఘవేందర్‌, చైర్మన్‌ కోండ్ర నర్సింగరావు, నాయకులు జి.భాస్కర్‌, కె.సంఘమయ్య, ఎస్‌కె.జానీ, జిట్టా రాజలింగం, వస్కుల రవీందర్‌, బి.దేవయ్య, జి.సుధాకర్‌ తదితరులు కూర్చున్నారు. 

నేడు కాజీపేట బంద్‌

రైల్వే సమస్యలపై టీ రైల్వే జేఏసీ చేపట్టిన మహా నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ కాంగ్రెస్‌ మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కాజీపేట బంద్‌కు పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ, కుల, వర్తక, వాణిజ్య సంఘాలు ఇందుకు సహకరించాలని కార్పొరేటర్‌ జక్కుల రవీందర్‌ యాదవ్‌ కోరారు.

Updated Date - 2021-11-29T05:10:07+05:30 IST