రచ్చబండ భగ్నం

ABN , First Publish Date - 2021-12-28T07:13:44+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం సీఎం

రచ్చబండ భగ్నం

  • ఎర్రవల్లికి వెళ్లకుండా రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
  • తెల్లవారుజాము నుంచే ఇంటి చుట్టూ మోహరింపు
  • పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాటతో ఉద్రిక్తత
  • రేవంత్‌ సహా పలువురి అరెస్టు.. పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
  • ఎర్రవల్లి గ్రామాన్నీ దిగ్బంధించిన పోలీసులు 
  • కేసీఆర్‌ వడ్లు కొన్నవాళ్లు రైతుల వడ్లు కొనరా?: రేవంత్‌
  • యాసంగి వడ్లు కొనకుంటే ప్రభుత్వాలపై యుద్ధమే: భట్టి


హైదరాబాద్‌/బంజారాహిల్స్‌/జగదేవ్‌పూర్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రవల్లిలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం భగ్నమైంది. రేవంత్‌ ఎర్రవల్లికి వెళ్లకుండా పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. రేవంత్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.


]కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడంతోపాటు సీఎం కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో 150 ఎకరాల్లో సాగవుతున్న యాసంగి వరిపంటను మీడియాకు చూపిస్తానంటూ రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే రేవంత్‌ ఇంటి చుట్టూ పోలీసులను కాపలా పెట్టారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.


మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ నేతలనూ హౌస్‌ అరెస్ట్‌ చేశారు. రేవంత్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తదితరులను గృహ నిర్భంధం చేసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డిని కూడా గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకోగా.. అప్పటికే ఆయన బయటికి వెళ్లిపోయారు. కాగా, రేవంత్‌రెడ్డి ఎర్రవల్లికి వెళ్లకుండా ఆయన ఇంటి వద్దకు పోలీసులు పెద్ద సంఖ్యలో రావడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు అనేక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పేరున్న నాయకులను తప్ప.. మిగతా వారిని రేవంత్‌ను కలిసేందుకు అనుమతించలేదు. ఇంటినుంచి బయటకు రాగానే..

మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రేవంత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ఎర్రవల్లికి వెళ్లేందుకు ఇంటినుంచి బయటకు వచ్చారు. ఆ వెంటనే పోలీసులు ఆయనను చుట్టుముట్టి వెళ్లడానికి వీల్లేదని, తిరిగి ఇంట్లోకి వెళ్లిపోవాలని కోరారు. కానీ, రేవంత్‌ వినిపించుకోకుండా ప్రధాన రోడ్డుపైకి వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను నిలువరించి బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగి.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి అంబర్‌పేట పోలీసుస్టేషన్‌కు తరలించారు.


కాగా, తోపులాటలో ోపులాట సందర్భంగా పలువురు నేతలు కింద పడిపోయారు. సీనియర్‌ నేత మల్లు రవి  స్వల్పంగా గాయపడ్డారు. ఆయన చొక్కా చిరిగింది. పోలీసులు ఆయనను కూడా అరెస్టు చేశారు. మరోవైపు ఎర్రవల్లిని కూడా పోలీసులు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దిగ్బంధించారు. గ్రామానికి వెళ్లే దారులన్నీ మూసివేశారు. దారులన్నింటిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోకి ఎవరైనా వెళ్లాలంటే ఆధార్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే పంపించారు. లేకపోతే వె నక్కి తిప్పి పంపారు. పరిసర గ్రామాల రైతులు తమ వ్యవసాయ భూముల వద్దకు వెళ్లలేక తీవ్ర  ఇబ్బందులు పడ్డారు.


డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు బైక్‌లపై జగదేవ్‌పూర్‌ -ఇటిక్యాల రోడ్డు మార్గంలో ఎర్రవల్లి సమీపానికి చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ రచ్చబండ పిలుపు నేపథ్యంలో ఎర్రవల్లి గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకులు, మండల ప్రజాప్రతినిధులు గ్రామంలోని గ్రామచావిడి వద్ద టెంట్‌ వేసి నిరసన తెలపడానికి ప్రయత్నించారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎర్ర వల్లికి వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. 


Updated Date - 2021-12-28T07:13:44+05:30 IST