బీసీలను అగౌరవపరుస్తున్న బీజేపీ

ABN , First Publish Date - 2021-10-22T05:08:34+05:30 IST

బీసీలను అగౌరవపరుస్తున్న బీజేపీ

బీసీలను అగౌరవపరుస్తున్న బీజేపీ
సమావేశంలో మాట్లాడుతున్న బీసీ నేత ఆర్‌ కృష్టయ్య

 హుజూరాబాద్‌లో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం

 బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

ఎల్కతుర్తి, అక్టోబరు 21: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య అ న్నారు. గురువారం ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆధ్వర్వంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య చైర్మన్‌ కృష్ణమోహన్‌ను గజమాలతో ఘనంగా సన్మానించారు. 

అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 56 శాతం ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించకుండా అగౌరవ పరుస్తోందని ఆరోపించారు. బీసీల కు పదవులు ముఖ్యం కాదని ఆత్మగౌరవమే ముఖ్యమన్నా రు. జంతువుల లెక్కలు తీసే కేంద్రప్రభుత్వం.. బీసీల జనాభాను గణించడానికి ఎదురవుతున్న అభ్యంతరం ఏమిటో చెప్పాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి అంబానీ, ఆదానీలాంటి కార్పొరేట్‌ వ్యాపారుల చేతుల్లో పెట్టి బీసీలను జీతగాళ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఎందుకు రిజర్వేషన్‌ కల్పించడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని కులాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని, ఈ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. 

బీసీ హక్కులను సాధించుకుని ఉమ్మడి రాష్ట్రంలో 6వేల బీసీ హాస్టల్స్‌ ఏర్పాటు చేసుకోవడంవల్ల బీసీ బిడ్డలకు ఉన్నత విద్య అందుతోందన్నారు. జాతికి మేలుచేసే వ్యక్తి గురించి ప్రజలు ఆలోచించి ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. కేంద్ర రాజకీయ పార్టీలకు ఓట్లపై ఉన్న ప్రేమ బీసీలపై లేదన్నారు. దళిత బంధు మాదిరిగానే బీసీ బంధును త్వరలోనే అమలు చేస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య వెల్లడించారు. బీసీల అభ్యున్నతికి కృషి చేసే కేసీఆర్‌ పార్టీని ఆదరించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రావుల అశోక్‌గౌడ్‌, హుజూరాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు కాజీపేట కృష్ణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:08:34+05:30 IST