4 గంటల వ్యవధిలో 2 హత్యలు

ABN , First Publish Date - 2021-11-02T08:54:57+05:30 IST

మత్తులో జోగుతూ , మంచినీళ్లు తాగినంత తేలిగ్గా ప్రాణాలు తీశాడో సైకో కిల్లర్‌.

4 గంటల వ్యవధిలో 2 హత్యలు

  • బండరాయితో కొట్టి కొట్టి చంపిన సైకో కిల్లర్‌
  • ఫుట్‌పాత్‌ మీద నిద్రిస్తున్న వారిపై కిరాతకం
  • మత్తులో జోగుతూ ప్రాణాలు తీసిన వైనం..


మంగళ్‌హాట్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మత్తులో జోగుతూ , మంచినీళ్లు తాగినంత తేలిగ్గా ప్రాణాలు తీశాడో సైకో కిల్లర్‌. తొలుత ఒకరిని హత్య చేసి తాపీగా నడుచుకుంటూ వెళ్లి నిద్రపోయాడు..! అనంతరం ఇంకో వ్యక్తిని హతమార్చాడు. హైదరాబాద్‌ నాంపల్లిలో జరిగిన ఈ దారుణం కలకలం రేపింది. మహ్మద్‌ ఖదీర్‌ (40) హబీబ్‌నగర్‌, నాంపల్లి ఠాణాల పధిలోని ఫుట్‌పాత్‌లపై ఉంటూ జులాయిగా తిరుగుతుంటాడు. ఆదివారం రాత్రి 11.30 సమయంలో యూసుఫియన్‌ దర్గా సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి (35) అతడి కంటపడ్డాడు. ఉన్మాదంతో బండరాయి తీసి అతడి ముఖంపై బాది హతమార్చాడు. తర్వాత నాంపల్లి ఏరియా ఆస్ప్రతి వైపు వెళ్లి ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో లేచి.. గూడ్స్‌ షెడ్‌ ప్రధాన రహదారి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తి (40)ని బండరాయితో కొట్టి చంపాడు.  జన సంచారంతో పాటు వాహన రాకపోకలు జరుగుతుండగానే ఖదీర్‌ హత్యలకు పాల్పడ్డాడు. ఈ దారుణాలపై ఖదీర్‌ మీద నాంపల్లి, హబీబ్‌నగర్‌ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. కొద్దిసేపటికే హబీబ్‌నగర్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, చనిపోయిన ఇద్దరు వ్యక్తులు ఇతర రాష్ట్రాల కూలీలుగా భావిస్తున్నారు. ఖదీర్‌ 2019 డిసెంబరు 30న నాంపల్లి కోర్టు సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిని బండరాయితో కొట్టి చంపాడు. ఆ కేసులో నాలుగు నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అతడిపై రెండు చోరీ కేసులు కూడా ఉన్నాయి. హబీబ్‌నగర్‌ ప్రాంతంలో గత నెల 19న ఓ యువకుడిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. సెక్టార్‌ ఎస్‌ఐ ఆ ప్రాంతంపై దృష్టిపెట్టకపోవడంతోనే తరచూ ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. 

Updated Date - 2021-11-02T08:54:57+05:30 IST