విరసంపై నిషేధం
ABN , First Publish Date - 2021-04-24T08:04:46+05:30 IST
వివిధ సమస్యలపై పోరాడే రాష్ట్రంలోని 16 ప్రజా సంఘాలపై ప్రభుత్వం తొలిసారి నిషేధం విధించింది.
- జాబితాలో పౌర హక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తుడుం దెబ్బ
- 16 ప్రజా సంఘాలపై బ్యాన్.. 33 జిల్లాల్లో ఏడాదిపాటు అమలు
- నిషేధిస్తూ జీవో జారీ.. ఇవన్నీ మావోయిస్టు అనుబంధ సంస్థలే
- మావోయిస్టుల లక్ష్యాల కోసమే ఇవి ఏర్పాటు
- చట్ట వ్యతిరేక, విధ్వంసాలకు పాల్పడుతున్నాయి
- జీవోలో వీటిని చట్ట విరుద్ధ సంఘాలుగా పేర్కొన్న సర్కారు
హైదరాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): వివిధ సమస్యలపై పోరాడే రాష్ట్రంలోని 16 ప్రజా సంఘాలపై ప్రభుత్వం తొలిసారి నిషేధం విధించింది. వీటిలో విరసం, పౌర హక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, గోండు గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న తుడుం దెబ్బ వంటి ప్రజా సంఘాలున్నాయి. ఇవి నిషేధిత భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)కు అనుబంధంగా పనిచేస్తూ, చట్ట వ్యతిరేక, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, కార్యకర్తలను ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఉసిగొల్పుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. అందుకే వీటిని ‘చట్టవిరుద్ధ సంఘాలు(అన్‌లాఫుల్ అసోసియేషన్స్)’గా గుర్తించి, నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల(జీవో నెంబర్ 73)ను జారీ చేశారు. మార్చి 30 నుంచి ఏడాదిపాటు ఈ నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, రాష్ట్రంలోని 33 జిల్లాలకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య(టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ), డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్(డీఎ్‌సయూ), తెలంగాణ విద్యార్థి సంఘం(టీవీఎస్), ఆదివాసి స్టూడెంట్ యూనియన్(ఏఎస్ యూ), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ(సీఆర్‌పీపీ), తెలంగాణ రైతాంగ సమితి(టీఆర్‌ఎస్), తుడుం దెబ్బ(టీడీ), ప్రజా కళా మండలి(పీకేఎం), తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్(టీడీఎఫ్), ఫోరం అగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్(ఎ్‌ఫఏహెచ్‌ఎ్‌ఫవో), సివిల్ లిబర్టీస్ కమిటీ(పౌర హక్కుల సంఘం), అమరుల బంధుమిత్రుల సంఘం(ఏబీఎంఎస్), చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్), రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్(విప్లవ రచయితల సంఘం- ఆర్‌డబ్ల్యూఏ)... మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉంటూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. భీమా-కోరెగాం కేసు, ఉపా చట్టం కింద అరెస్టయిన విరసం నేత వరవరరావు, జీఎన్ సాయిబాబ, రోనా విల్సన్ తదితరులను విడుదల చేయాలంటూ ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని తెలిపింది. ఇలాంటి చట్ట వ్యతిరేక సంఘాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు ప్రకటించింది.