దళిత బహుజనుల దేవుడు అంబేడ్కర్‌ : గాలి

ABN , First Publish Date - 2021-01-13T12:49:58+05:30 IST

దళిత బహుజనుల దేవుడు అంబేడ్కర్‌ : గాలి

దళిత బహుజనుల దేవుడు అంబేడ్కర్‌ : గాలి

ఆయనకు డాక్టరేట్‌ ఓయూ చరిత్రలో మైలురాయి

జాతీయ ప్రతిభావంతుల దినోత్సంలో ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌


హైదరాబాద్/ఉప్పల్‌ : దళిత బహుజనులకు అంబేడ్కర్‌ను మించిన దేవుడు లేరని, ఆయన చేసిన కృషి, త్యాగాల ఫలితంగానే నేడు దేశంలో దళిత, బహుజనులు మనుగడ సాగిస్తున్నారని ఓయూ లా విభాగాధిపతి, సౌత్‌ ఇండియా పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసి జనవరి 12 నాటికి సరిగ్గా 67 సంత్సరాలు. ఈ రోజును కొన్నేళ్లుగా జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంలో భాగంగా నిర్వహించిన బహుజన విద్యావంతుల సదస్సులో ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ ప్రసంగించారు.   


బహుజనుల హక్కుల కోసం అంబేడ్కర్‌ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాను ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. అంబేడ్కర్‌తో ఓయూ అనుబంధాన్ని భవిష్యత్‌ తరాలకు అందించేందుకు స్టాచ్యూ ఆఫ్‌ జస్టిస్‌ పేరుతో అంబేడ్కర్‌ రాజసింహాసనంపై కూర్చున్న విగ్రహాన్ని ఆయన జన్మదినమైన ఏప్రిల్‌ 14న ఓయూలో ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్‌ స్ఫూర్తిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు తాను హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం ఓయూ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఓయూలో అంబేడ్కర్‌ పేరుతో ప్రపంచశ్రేణి నైపుణ్య కేంద్రాన్ని, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 


ఓయూ బస్తీల్లో ఏళ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ప్రొఫెసర్లు అన్వర్‌ ఖాన్‌, తిరుపతి, వనజ, ప్రభంజన్‌యాదవ్‌, డాక్టర్‌ రమణ, డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ అంజయ్య, నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మానవతారాయ్‌, బహుజన విద్యార్థి సంఘం నాయకులు వేల్పుల సంజయ్‌, వేణు, మధు, దర్శన్‌, కిరణ్‌, టీజేఎస్‌వీవీ నాయకుడు సలీంపాషా,ఓయూలోని బస్తీల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T12:49:58+05:30 IST