ప్రొక్లయిన్ దహనంతో చల్వాయిలో కలకలం
ABN , First Publish Date - 2021-03-30T05:46:30+05:30 IST
ప్రొక్లయిన్ దహనంతో చల్వాయిలో కలకలం
గోవిందరావుపేట, మార్చి 29 : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయిలో కలకలం రేగింది. గ్రామ శివారు పున్నమ్మబోడు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రొక్లయన్‌ను దహనం చేశారు. ఈసంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఐదో బెటాలియన్ నిర్మాణంలో భాగంగా భూమి చదును పనులను లీజుపై చేపడుతుండగా ఈ ఘటన జరిగింది. ఆదివారం హోలీ కావడంతో పని ప్రాంతంలోనే యంత్రాన్ని ఉంచిన డ్రైవర్ ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం వెళ్లేసరికి ప్రొక్లెయిన్ పూర్తిగా దగ్ధమై కనిపించింది. ఘటనా స్థలాన్ని ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, పస్రా ఎస్సై రవీందర్ సందర్శించారు. క్లూస్‌టీం పలు ఆధారాలను సేకరించింది. ప్రొక్లయన్ యజమాని ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పస్రా పోలీసులు కేసు నమోదు చేశారు.
రామకిష్టాపూర్‌లో ద్విచక్రవాహనం..
టేకుమట్ల : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రామక్రిష్టాపూర్(వి)లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ద్విచక్రవాహనాన్ని దహనం చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తన ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని ఎవరో నిప్పు పెట్టారని అదే గ్రామానికి చెందిన చెక్క సమ్మయ్య తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై కోటా రమణారెడ్డి తెలిపారు.