కిషన్‌రెడ్డికి పదోన్నతి.. ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించడం వెనుక..!

ABN , First Publish Date - 2021-07-08T09:00:47+05:30 IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి పదోన్నతి లభించింది. తెలంగాణ నుంచి తొలిసారిగా కేబినెట్‌ హోదా పొందిన నేతగా రికార్డులకెక్కారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీకి విధేయుడిగా గుర్తింపు ఉన్న

కిషన్‌రెడ్డికి పదోన్నతి.. ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించడం వెనుక..!

  • కేబినెట్‌ హోదా కల్పించిన ప్రధాని మోదీ
  • టూరిజం, సాంస్కృతికం, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల శాఖల అప్పగింత
  • సమర్థ పనితీరుకు దక్కిన గౌరవం
  • మోదీ దృష్టిని ఆకర్షించిన కిషన్‌రెడ్డి
  • తెలుగు వారికి పేరు వచ్చేలా పనిచేస్తా
  • రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి
  • జలవివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలి: కిషన్‌రెడ్డి
  • సమర్థ పనితీరుకు దక్కిన గౌరవం
  • తెలంగాణ నుంచి తొలి కేబినెట్‌ మంత్రి

కిషన్‌రెడ్డికి పదోన్నతి లభించింది. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి కేబినెట్‌ హోదా పొందిన నేతగా రికార్డులకెక్కారు. మోదీ, షాలకు నమ్మకస్తుడిగా, పార్టీకి విధేయుడిగా గుర్తింపు ఉన్న  ఆయనకు కేబినెట్‌ హోదా లభించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


న్యూఢిల్లీ,హైదరాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి పదోన్నతి లభించింది. తెలంగాణ నుంచి తొలిసారిగా కేబినెట్‌ హోదా పొందిన నేతగా రికార్డులకెక్కారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీకి విధేయుడిగా గుర్తింపు ఉన్న కిషన్‌రెడ్డికి కేబినెట్‌ హోదా లభించడం పట్ల పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో లోక్‌సభకు ఎన్నికైన తర్వాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి.. స్వల్పకాలంలోనే పలు కీలక అంశాల్లో సమర్థంగా వ్యవహరించారు. బీజేపీకి రాజకీయంగా సవాలుగా మారిన అంశాలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర విభజన బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు సమయాల్లో పార్లమెంటులో సమర్థంగా వ్యహరించారు.


బీజేపీకి రాజకీయంగా కీలకమైన ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు సంస్థల వల్ల తలెత్తే సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేశారు. దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పుడు కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడంలో సమర్థంగా పనిచేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న మోదీ కిషన్‌రెడ్డికి మరింత పెద్ద బాధ్యతను అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పాయి. కాగా, కిషన్‌రెడ్డి దర్శకత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. ఆయన బుధవారం ఢిల్లీలో కిషన్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.


తెలుగు వారికి పేరు తెచ్చేలా పనిచేస్తా: కిషన్‌రెడ్డి

ప్రధాని మోదీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానన్నారు. కేంద్ర సహాయ మంత్రి నుంచి కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో బుధవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నవభారత నిర్మాణం కోసం ప్రధాని మోదీ స్వప్నాన్ని సాకారం చేయడం, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయడం.. ప్రస్తుతం ఈ రెండు వ్యూహాలు తన ముందున్నాయన్నారు. మంత్రి పదవి కావాలని తాను ఏనాడూ ఎవరినీ అడగలేదని, అలా అడిగే సంప్రదాయం బీజేపీలో తక్కువగా ఉంటుందన్నారు. అయినా పార్టీ నాయకత్వం తనను గుర్తించిందన్నారు. ఇది కార్యకర్తలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదంపై కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. సాధ్యమైనంత వరకు రెండు రాష్ట్రాల సీఎంలు, అధికారులు కలిసి చర్చించుకొని, పరిష్కరించుకోవాలని సూచించారు.


రైతు కుటుంబం నుంచి కేంద్ర మంత్రి వరకు

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కిషన్‌ రెడ్డి కేంద్ర కేబినెట్‌ మంత్రి వరకు ఎదిగారు. 1980 నుంచి 1994 వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనరుగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1992లో యువమోర్చా జాతీయ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, 1993 నుంచి వరుసగా మూడుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.2004లో తొలిసారి హిమాయత్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 నుంచి 2016 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి ఓటమిపాలై, 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు. 

Updated Date - 2021-07-08T09:00:47+05:30 IST