రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్‌’ నిధులు

ABN , First Publish Date - 2021-08-10T07:52:52+05:30 IST

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన నిధులను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తొమ్మిదో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 9.75

రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్‌’ నిధులు

తొమ్మిదో విడతలో రాష్ట్రానికి రూ.767.61 కోట్లు

38.37 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లోకి నగదు

డబ్బు డ్రా కోసం రాష్ట్రంలో పోస్టల్‌ మైక్రో ఏటీఎంలు


హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన నిధులను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తొమ్మిదో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 9.75 కోట్లపైచిలుకు రైతుల ఖాతాల్లో రూ.19,500 కోట్లు జమచేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 38.37 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో రూ.767.61 కోట్లు జమచేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం విదితమే. ఈ పథకంలో నమోదైన రైతులు రాష్ట్రంలో 39.33 లక్షల మంది ఉన్నారు. గడిచిన 8 విడతల్లో రూ.5,440.03 కోట్లు రాష్ట్ర రైతాంగానికి అందాయి. తొమ్మిదో విడతతో కలిపి రూ.6,207.64 కోట్లు వచ్చాయి. కాగా, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సొమ్మును పోస్టల్‌ మైక్రో ఏటీఎంల నుంచి డ్రా చేసుకోవచ్చని హైదరాబాద్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


రాష్ట్ర వ్యాప్తంగా 5,794 పోస్టాఫీసుల్లో ఈ మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేశామని వివరించారు. వీటి నుంచి డబ్బు డ్రా చేసుకుంటే సర్వీస్‌ చార్జీలు ఉండవని తెలిపారు. బ్యాంకు అకౌంట్లకు ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేసిన రైతులు గ్రామీణ పోస్టాఫీసుల్లోని ఏటీఎంలో డబ్బు పొందవచ్చని వివరించారు. బయోమెట్రిక్‌ యంత్రంలో వేలిముద్ర వేసి, మొబైల్‌ ఫోన్‌కు వచ్చే ఓటీపీతో డబ్బు డ్రా చేసుకోవచ్చని వివరించారు.Updated Date - 2021-08-10T07:52:52+05:30 IST