కొత్త కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ మీటర్లే!

ABN , First Publish Date - 2021-03-21T08:37:11+05:30 IST

భవిష్యత్తులో మీరు వాడే కరెంటు ప్రతీ యూనిట్‌ ముందే కొనుక్కోవాల్సి రావొచ్చు. కొత్త కనెక్షన్‌ తీసుకొనే వారయితే కొద్ది నెలల్లోనే ఈ పరిస్థితిని చవిచూడాల్సి రావొచ్చు.

కొత్త కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ మీటర్లే!

  • పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్‌ మీటర్లు
  • ఏఎంఆర్‌ స్మార్ట్‌ మీటర్లతో ఎప్పటికప్పుడు 
  • కంప్యూటర్‌ సర్వర్లలో రీడింగ్‌ నమోదు
  • ఇక పక్కాగా విద్యుత్తు లెక్క: కేంద్రం
  • నిబంధనల ముసాయిదా విడుదల
  • ఏప్రిల్‌ 21లోగా అభిప్రాయ సేకరణ
హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో మీరు వాడే కరెంటు ప్రతీ యూనిట్‌ ముందే కొనుక్కోవాల్సి రావొచ్చు. కొత్త కనెక్షన్‌ తీసుకొనే వారయితే కొద్ది నెలల్లోనే ఈ పరిస్థితిని చవిచూడాల్సి రావొచ్చు. సెల్‌ఫోన్‌ టాక్‌టైంను రీచార్జి చేసుకున్నట్లుగా విద్యుత్తును యూనిట్ల వారీగా డబ్బులు ఇచ్చి ముందే రీచార్జి చేసుకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే, కొత్త కనెక్షన్లు అన్నింటికీ ప్రీపెయిడ్‌ మీటర్లు లేదా ప్రీపెయిడ్‌ ఫీచర్‌ ఉన్న స్మార్ట్‌ మీటర్లు బిగించాలని కేంద్ర విద్యుత్తు సంస్థ(సీఈఏ) నిర్ణయించింది. దీనికోసం విద్యుత్తు మీటర్ల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేస్తోంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం కోరాలని కేంద్ర విద్యుత్‌ సంస్థ నిర్ణయించింది. ఏప్రిల్‌ 21లోగా తమకు అభిప్రాయాలను పంపాలని కోరుతూ ప్రకటన ఇచ్చింది. ఈ మెయిల్‌(ఛ్ఛిజ్ఛూజ్చజూఛ్ఛ్చిఃజౌఠి.జీుఽ) ద్వారా అభిప్రాయాన్ని పంపవచ్చు. తాజా ప్రతిపాదనల ప్రకారం ఇదివరకే కనెక్షన్లు ఉన్న వినియోగదారులకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఒక తేదీలోగా పాత మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్‌ మీటర్లు లేదా ప్రీపెయిడ్‌ ఫీచర్‌ ఉన్న స్మార్ట్‌ మీటర్లలో ఏదైనా ఒకటి అమర్చుతారు. ఇక ఓపెన్‌ యాక్సెస్‌ నుంచి 11 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను వినియోగించే వారికి కూడా ఆటోమాటిక్‌ మీటర్‌ రీడింగ్‌(ఏఎంఆర్‌) సౌకర్యం ఉన్న స్మార్ట్‌ మీటర్లు పెడతారు. 

ఈ ముసాయిదా కార్యరూపం దాల్చితే అన్ని ఫీడర్‌లలోని డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు 2023 జూన్‌ కల్లా స్మార్ట్‌ మీటర్లు బిగించాల్సి ఉంటుంది. ఏఎంఆర్‌ స్మార్ట్‌ మీటర్ల ప్రత్యేకత ఏమిటంటే మీటర్‌ రీడింగ్‌ తీయడానికి ఉద్యోగి క్షేత్ర స్థాయికి రానక్కరలేదు. ఎప్పటికప్పుడు రీడింగ్‌ విద్యుత్‌ సంస్థ కంప్యూటర్‌ సర్వర్లలో నమోదు అవుతూ ఉంటుంది. విద్యుత్‌ వినియోగానికి సంబంధించిన లెక్కల సమాచారాన్ని మూడు నెలలకు ఒకసారి విద్యుత్‌ నియంత్రణ మండళ్ల వెబ్‌సైట్‌లతో పాటు నేషనల్‌ పవర్‌ పోర్టల్‌(ఎన్‌పీపీ)లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. విద్యుత్‌ వినియోగంపై పక్కాగా లెక్కలు లేకపోవడంతో దుర్వినియోగం పెరుగుతుందనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రీపెయిడ్‌ మీటర్లను పెట్టుకున్న వారు ముందస్తుగా బిల్లులు కట్టి, కరెంట్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్‌ మీటర్లతో విద్యుత్‌ వినియోగాన్ని మొబైల్‌ ఫోన్లతో కూడా నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్న పరికరాలను అన్నింటినీ స్మార్ట్‌గా మార్చుకొని స్మార్ట్‌ మీటర్‌తో అనుసంధానం చేస్తే ఆఫీసులో కూర్చొని ఇంట్లో వృధాగా పని చేస్తున్న ఏసీని మీ మొబైల్‌ ఫోన్‌లోని యాప్‌ ఆధారంగా నిలిపివేయవచ్చు. ఇంట్లోకి చేరడానికి ముందే ఏసీని ఆన్‌ చేసుకొవొచ్చు. మీటర్‌కు ఇంట్లోని పరికరాలన్నీ స్మార్ట్‌గా అనుసంధానం చేస్తే అన్నింటిని స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా నియంత్రించవచ్చు. దీన్ని ఖర్చు ఎక్కువ అయినప్పటికీ భవిష్యత్తులో కరెంటు బిల్లు తగ్గుతుంది. దీనికోసం మొత్తం విద్యుత్‌ సరఫరా వ్యవస్థనే మార్చుతూ ప్రత్యేక స్మార్ట్‌ గ్రిడ్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఒక ప్రాంతంలో స్మార్ట్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు అమలవుతోంది. ఇక ప్రభుత్వ కార్యాలయాన్నింటికీ ప్రీపెయిడ్‌ మీటర్లను బిగించే ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తికానుంది. స్మార్ట్‌ లేదా ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టుకునే వారికి విద్యుత్‌ చార్జీలలో రాయితీ కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. 

Updated Date - 2021-03-21T08:37:11+05:30 IST