అజర ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-06-26T05:07:12+05:30 IST

అజర ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి

అజర ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి

బాధితుడికి ఫీజు తిరిగి ఇప్పించండి

కలెక్టర్‌ను ఆదేశించిన జిల్లా జడ్జి


వరంగల్‌ లీగల్‌, జూన్‌ 25: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేశారని వచ్చిన ఫిర్యాదుపై అజర ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్‌, జిల్లా జడ్జి నందికొండ నర్సింగరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర హైకోర్టు రిట్‌ పిటీషన్‌ నెం 58- 2020 లో తెలిపిన ఆదేశానుసారం బాధితురాలి నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజును తిరిగి ఇప్పించాలని ఆయన సూచించారు. హన్మకొండ హంటర్‌రోడ్‌ శాంతినగర్‌కు చెందిన వెలుదండి సంధ్య, తన భర్తకు కరోనా సోకడంతో అజర ఆస్పత్రిలో చేర్పించగా సుమారు రూ.12లక్షలు వసూలు చేశారని జిల్లా న్యాయసేవా సంస్థను ఈ నెల 24న ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన న్యాయమూర్తి నర్సింగరావు ప్రభుత్వ జీవో ఆర్‌టీ నెం 248, హైకోర్టు ఆదేశానుసారంగా అధిక ఫీజును బాధితురాలికి ఇప్పించడానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.  ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. 

2021 ఏప్రిల్‌ 18న హన్మకొండకు చెందిన వెలుదండి రమేశ్‌ కరోనా వ్యాధితో బాధపడుతూ హన్మకొండలోని అజర ఆస్పత్రిలో చేరారు. చికిత్స నిమిత్తం మెదటిరోజు రూ.50వేలను డిపాజిట్‌ చేశారు. మరుసటి రోజు మరో రూ.50వేలను డిపాజిట్‌ చేశారు. అయితే రమేశ్‌ చనిపోయేనాటికి మొత్తం రూ.12లక్షలు ఆస్పత్రి వర్గాలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్‌టీ నెం.248 ప్రకారం ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌ సహాయం లేని రోజుకు రూ.7500, వెంటిలేటర్‌తో రోజుకు రూ.9000 ఉండగా నింబంధనలకు విరుద్ధంగా ఫీజలు వసూలు చేశారని పేర్కొన్నారు. 2021 మే 3న తన భర్త రమేశ్‌  చనిపోగా ఇంకా రూ.3లక్షలు  చెల్లించాలని లేదంటే మృతదేహం ఇవ్వమని చెప్పి ఉదయం 6:25 నిమిషాలకు చనిపోతే రాత్రి 7:25 నిమిషాల వరకు  మృతదేహాన్ని ఇవ్వలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి నానా కష్టాలు పడి రూ.2.40 లక్షలు చెల్లించిన తర్వాతనే మృతదేహాన్ని అప్పగించినట్లు ఆమె పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ దృష్టికి తీసుకెళ్లగా స్పందన లేదని బాధితురాలు పేర్కొన్నారు. ఈ విషయమై అఽధికంగా వసూళ్లు చేసిన ఫీజును ఇప్పించి న్యాయం చేయాలని ఆమె కోరింది.  దీంతో సంబంధిత ఆస్పత్రిపైౖ చర్యలు తీసుకుని చెల్లించిన అఽధిక ఫీజును బాధితురాలికి ఇప్పించాలని జిల్లా జడ్జి కలెక్టర్‌ను ఆదేశించారు. 

Updated Date - 2021-06-26T05:07:12+05:30 IST