భూ వివాదాల పరిష్కారానికి అవకాశం

ABN , First Publish Date - 2021-01-20T08:27:47+05:30 IST

భూమికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను ధరణి వెబ్‌సైట్‌ ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

భూ వివాదాల పరిష్కారానికి అవకాశం

ధరణిలో విజ్ఞప్తుల స్వీకరణ ప్రారంభం


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): భూమికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను ధరణి వెబ్‌సైట్‌ ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టాదారు పాస్‌పుస్తకంలో విస్తీర్ణం తగ్గిందా? సర్వేనెంబర్‌ త ప్పుగా పడిందా? పట్టాదారు పేరులో తప్పులు దొర్లాయా? భూరికార్డుల్లో తప్పులు ఉన్నాయా? రికార్డుల్లో పేర్లు చేరలేదా? వంటి సమస్యలపై ధరణి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇందుకోసం రెవెన్యూ శాఖ ధరణి వెబ్‌సైట్‌ సిటిజన్‌ డాష్‌బోర్డులో మంగళవారం నుంచి కొత్త ఆప్షన్‌లను అందుబాటులోకి తెచ్చింది. రైతులు/భూ యజమానుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడం మొదలైంది. 2017 సెప్టెంబరు 15 నుంచి జరిగిన భూ రికార్డుల నవీకరణ అనంతరం భారీగా విమర్శలు వచ్చాయి.


90 శాతం రికార్డులు సవ్యంగా ఉన్నప్పటికీ 10 శాతం రికార్డులపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. 2018 తర్వాత రికార్డుల్లో లోపాలు సవరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. ఇక పార్ట్‌-బీ (వివాదస్పద భూముల జాబితా) లో సమస్యలు పరిష్కరించకపోవడంతో  రైతులు/భూయజమానులు పడరాని పాట్లు పడ్డారు. ధరణి చట్టం వచ్చిన తరువాత భూముల వివాదాలను పరిష్కరించే వ్యవస్థే లేకుండా పోయింది. తాజాగా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ వివాదాలను పరిష్కరించే బాధ్యత కలెక్టర్లకే కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూ సమస్యలపై ధరణిలో దరఖాస్తు చేసుకుంటే,  అవి నేరుగా కలెక్టర్లకు చేరతాయి. 

Updated Date - 2021-01-20T08:27:47+05:30 IST