తండ్రి ఆదాయానికి మించి ఆస్తుల్లో కుమారుడి ఆస్తుల స్వాధీనమా?: హైకోర్టు

ABN , First Publish Date - 2021-03-21T08:49:15+05:30 IST

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగంపై తండ్రి ఆస్తులతోపాటు కుమారుడి స్వార్జిత ఆస్తులనూ సీజ్‌ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

తండ్రి ఆదాయానికి మించి ఆస్తుల్లో కుమారుడి ఆస్తుల స్వాధీనమా?: హైకోర్టు

హైదరాబాద్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగంపై తండ్రి ఆస్తులతోపాటు కుమారుడి స్వార్జిత ఆస్తులనూ సీజ్‌ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఏసీబీ అధికారులు సీజ్‌ చేసిన కుమారుడు ఫ్లాట్‌ను మినహాయించాలని ఆదేశించింది. సంగారెడ్డి జిల్లాలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న వీ.వరప్రసాద్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆయన కుటుంబానికి చెందిన మొత్తం రూ.1.28 కోట్లకు పైబడిన ఆస్తులను సీజ్‌ చేశారు. వీటిలో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న వరప్రసాద్‌ కుమారుడు వీ.ఆదిత్య.. కొండాపూర్‌లో రూ.53లక్షలకు కొనుగోలు చేసిన ఫ్లాట్‌ కూడా ఉంది. ఈ ఫ్లాటు కొనడానికి తన తండ్రి ఎలాంటి ఆర్థిక సహాయమూ చేయలేదని.. తాను సంపాదించిన డబ్బుతోనే కొనుగోలు చేశానని, తన ఆస్తిని మినహాయించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఆర్జీ పెట్టుకున్నారు. దీనిని విచారించిన ఏసీబీ కోర్టు.. ఈ అంశాన్ని కేసు ట్రయల్‌లో తేలుస్తామని స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టును ఆదిత్యఆశ్రయించారు. 

Updated Date - 2021-03-21T08:49:15+05:30 IST