తెలంగాణ జనాభా 3.77 కోట్లు

ABN , First Publish Date - 2021-11-21T08:02:10+05:30 IST

రాష్ట్ర జనాభా, ఆర్థిక అంచనాలపై ప్రభుత్వ నివేదిక విడుదలైంది. ‘తెలంగాణ ఎట్‌ ఏ గ్లాన్స్‌’ పేరుతో రాష్ట్ర అర్థ గణాంక సంచాలకుల విభాగం రూపొందించిన ఈ నివేదిక..

తెలంగాణ జనాభా 3.77 కోట్లు

  • పదేళ్లలో 7.77 శాతం పెరుగుదల..
  • ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మంది స్త్రీలు
  • రెండింతలకు పైగా పెరిగిన తలసరి ఆదాయం
  • 11.9 శాతంగా వృద్ధి రేటు.. 
  • ‘తెలంగాణ ఎట్‌ ఏ గ్లాన్స్‌’ నివేదిక వెల్లడి


హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జనాభా, ఆర్థిక అంచనాలపై ప్రభుత్వ నివేదిక విడుదలైంది. ‘తెలంగాణ ఎట్‌ ఏ గ్లాన్స్‌’ పేరుతో రాష్ట్ర అర్థ గణాంక సంచాలకుల విభాగం రూపొందించిన ఈ నివేదిక.. పలు ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌, రాష్ట్ర అర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ డైరెక్టర్‌ జీ దయానంద్‌, రాష్ట్ర రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ అదనపు డీజీ శ్రీనివా్‌సరెడ్డి ఖైరతాబాద్‌లోని డైరెక్టరేట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం.. గడచిన పదేళ్లలో తెలంగాణ జనాభా 7.77 శాతం పెరిగి 3 కోట్ల 77 లక్షల 25 వేలకు చేరింది. 2011లో 3 కోట్ల 50 లక్షల 4 వేలుగా ఉన్న జనాభా.. దశాబ్ద కాలంలో 27 లక్షల 21 వేలు పెరిగింది. రాష్ట్రంలోని ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మంది స్త్రీలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల సంఖ్య 1,76,12,000 ఉండగా.. ఇప్పుడది 1,89,78,000కు చేరింది. అలాగే, మహిళల సంఖ్య 1,73,92,000 ఉండగా.. అదిప్పుడు 1,87,47,000కు పెరిగింది. యువత (20-35 మధ్య వయస్కులు) సంఖ్య 2011లో 95.46 లక్షలు ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య 101.60 లక్షలకు చేరింది. అంటే 3.77 కోట్ల జనాభాలో యువతే కోటికి పైగా ఉందన్న మాట. అయితే.. 2011 పూర్వపు దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు (13.58)తో పోల్చితే.. ఈ దశాబ్దంలో భారీగా తగ్గింది. ఇక జన సాంధ్రత విషయానికి వస్తే.. రాష్ట్రంలో ప్రతి చదరపు కిలోమీటరుకు 312 మంది నివసిస్తున్నారు.


మొత్తం జనాభాలో 2.06 కోట్ల మంది అక్షరాస్యులు ఉండగా.. ఇందులో పురుషులు 1.17 కోట్లు, మహిళలు 89.95 లక్షలు. ప్రస్తుతం రాష్ట్ర అక్షరాస్యత శాతం 66.54 కాగా.. ఇది పురుషుల్లో 75.04 శాతం, మహిళల్లో 57.99 శాతంగా ఉంది. షెడ్యూల్డు కులాల జనాభా 54.09 లక్షలు కాగా.. షెడ్యూల్డు తెగల జనాభా 31.78 లక్షలుగా ఉంది. ఇక కుటుంబాల విషయానికి వస్తే.. రాష్ట్రంలో మొత్తం 83.04 లక్షల కుటుంబాలు ఉన్నాయని, అందులో ఒక్కో కుటుంబంలో సగటున నలుగురు ఉన్నారని నివేదిక తెలిపింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 51.69 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 31.35 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయని వివరించింది. ఈ పదేళ్లలో సగటు వృద్ధి రేటు 11.9 శాతంగా ఉంటుందని, అది జాతీయ సగటు వృద్ధి రేటు 9.6 శాతం కన్నా ఎక్కువని వివరించింది. తలసరి ఆదాయం 2011-12లో రూ.91,121గా ఉందని, ప్రస్తుతం అది రూ.2,37,632కు పెరిగిందని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,28,829 మాత్రమేనని చెప్పింది. ఐటీ ఎగుమతుల్లో కూడా 12.98 శాతం వృద్ధి నమోదైందని తెలంగాణ ఎట్‌ ఏ గ్లాన్స్‌ నివేదిక వెల్లడించింది. 

Updated Date - 2021-11-21T08:02:10+05:30 IST