మార్కెట్‌లో ఆధిపత్య ‘పోరు’

ABN , First Publish Date - 2021-11-02T05:37:37+05:30 IST

అడ్తిదారులకు రూ.10 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ వ్యవహారం సోమవారం వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రస్తుత అధ్యక్షుడు బొమ్మినేని రవిందర్‌ రెడ్డి, మాజీ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి బాహాబాహీకి తలపడటంతో పోలీసులు కలగజేసుకోవాల్సి వచ్చింది. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మార్కెట్‌లో ఆధిపత్య ‘పోరు’
మార్కెట్లో బాహాబాహీకి దిగిన రవిందర్‌రెడ్డి, దిడ్డి కుమారస్వామి

బాహాబాహీకి దిగిన చాంబర్‌ అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి
నాగేంద్ర కంపెనీ పద్దులిప్పించాలని తొలుత అడ్తిదారుల ఆందోళన
అధికారులతో చర్చలకు వెళ్లుతుండగా రవిందర్‌రెడ్డికి తారసపడిన ‘దిడ్డి’
మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణ
పోలీసులు, అధికారుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
చర్చల్లో సమస్య పరిష్కారానికి అధికారుల హామీ


వరంగల్‌ టౌన్‌,  నవంబరు 1: అడ్తిదారులకు రూ.10 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ వ్యవహారం సోమవారం వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రస్తుత అధ్యక్షుడు బొమ్మినేని రవిందర్‌ రెడ్డి, మాజీ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి బాహాబాహీకి తలపడటంతో పోలీసులు కలగజేసుకోవాల్సి వచ్చింది. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే...

మిర్చి వ్యాపారం చేసే నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ ని ర్వాహకులు... అడ్తిదారులకు సుమారు రూ.10 కోట్ల మే ర బకాయి పడ్డారు. సకాలంలో చెల్లించకపోవడమే కా కుండా, ఒత్తిడి పెరగడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో తమ డబ్బులు ఇప్పించాలని కోరుతూ గత నెల 12న మార్కెట్‌ ముందు అడ్తిదారులు ఆందోళన చేశారు. అనంతరం సమస్యను కలెక్టర్‌, సీపీ దృష్టికి తీసుకెళ్లడం తో పోలీసులు నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ నిర్వాహకుల కోసం గాలింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో నాలు గు రోజుల క్రితం వారిని అదుపులోకి తీసుకున్నారు.

గతంలో ఎవరైనా వ్యాపారులు.. అడ్తిదారులకు పద్దులు ఎగ్గొడితే పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు చాంబర్‌లో సెటిల్‌ చేసుకోవాలని చె ప్పేవారు. అది ఆనవాయితీ కూడా. అయితే నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ వ్యవహారంలో ఈ ఆనవాయితీకి మంగళం పాడారు. సెటిల్‌మెంట్‌ బాధ్యతను చాంబర్‌కు అప్పగించలేదు.  నాగేంద్ర కంపెనీ నిర్వాహకులు పోలీసుల అదుపులో వుండగానే దిడ్డి కుమారస్వామి వర్గానికి చెందిన అడ్తిదారులకు బకాయిలు ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బయటకు పొక్కింది. దీంతో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో సోమవారం అడ్తిదారులు, వ్యాపారవర్గాలు మార్కెట్‌ ప్రధాన కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. నాగేంద్ర కంపెనీ పద్దుల సెటిల్‌మెంట్‌ను చాంబర్‌కు అప్పగించాలని వారు డి మాండ్‌ చేశారు. అలా చేస్తే అందరు అడ్తిదారులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అడ్తిదారుల ఆందోళనతో మార్కెట్‌లో మూడు గంటలపాటు క్రయ విక్రయాలు నిలిచిపోయాయి.

దీంతో మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌, డీఎంవో, ఏసీపీ, సీఐలు, పాలకవర్గం చైర్‌పర్సన్‌ దిడ్డి భాగ్యల క్ష్మి.. ఆందోళన చేస్తున్న చాంబర్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవిందర్‌ రెడ్డితో పాటు వ్యాపారవర్గాలను సమావేశానికి పిలిచారు. రవీందర్‌ రెడ్డి, ఇతర వ్యాపార ప్రతినిధులు సమావేశ మందిరానికి వెళ్లుతుండగా అక్కడ చాంబర్‌ మాజీ అధ్యక్షుడు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ దిడ్డి భాగలక్ష్మి భర్త కుమారస్వామి కనిపించారు.

దీంతో చాంబర్‌ అధ్యక్షుడు రవిందర్‌ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ దిడ్డి కుమారస్వామి ఏ హోదాలో ఇక్కడి వచ్చారని ప్రశ్నించారు. ఆయన సమావేశంలో పాల్గొంటే తాము హాజరుకామని చెబుతూ అడ్తిదారులతో అక్కడినుంచి బయటకు వెళ్లిపోయారు.  వెంటనే అధికారులు రవిందర్‌రెడ్డిని అనుసరించి, దిడ్డి కుమారస్వామి సమావేశంలో ఉండరని హామీ ఇవ్వడంతో ఆయన సమావేశానికి రావడానికి అంగీకరించారు. వ్యాపారులతో కలిసి రవిందర్‌రెడ్డి పరిపాలన భవనంలోకి వెళ్లుతుండగా దిడ్డి కుమారస్వామి మళ్లీ తారసపడటంతో ‘ఎవరు నువ్వు.. ఎందుకు వచ్చావు..?’ అని ప్రశ్నించగా, ‘నువ్వు ఎవరు నన్ను అడగడానికి?’ అని ఆయన తిరిగి ప్రశ్నించారు. ‘నేను చాంబర్‌ అధ్యక్షుడిని’ అని రవిందర్‌రెడ్డి చెప్పగా, ‘నేను వ్యాపారిని’ అని దిడ్డి బదులిచ్చారు. ‘వ్యాపారులు గేటు వద్ద ధర్నా చేస్తుంటే, మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్‌..?’ అని రవిందర్‌రెడ్డి నిలదీయడంతో దిడ్డి సహనం కోల్పోయారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి బూతులు తిట్టుకున్నారు. ఒకరిపైకి ఒకరు దూసుకువచ్చి బాహాబాహీకి తలపడ్డారు. వెంటనే అక్కడున్న వ్యాపారులు, పోలీసులు, అధికారులు ఇద్దరినీ చెరోవైపు లాక్కెళ్లి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం దిడ్డి బయటకు వెళ్లిపోగా, రవిందర్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు.

అధికారుల హామీ
సమావేశానికి చైర్‌పర్సన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి, ఏసీపీ గిరికుమార్‌, ఇంతేజర్‌గంజ్‌ సీఐ మల్లేశ్‌, మార్కెటింగ్‌శాఖ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) మల్లేశం, డీఎంవో ప్రసాదరావు, మార్కెట్‌ కార్యదర్శి రాహుల్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవిందర్‌ రెడ్డి, లింగారెడ్డి, వేదప్రకాష్‌, చింతపల్లి వీరారావు, మొగిలి చంద్రమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ మల్లేశం, ఏసీపీ గిరి కుమార్‌, డీఎంవో ప్రసాదరావు సమస్యను జిల్లా కలెక్టర్‌, సీపీ, మంత్రి దృష్టికి  తీసుకెళ్లారు. గతంలో ఏ విధంగా సెటిల్‌ చేసేవారో అదే విధంగా చేయాలని వారు సూచించినట్టు చాంబర్‌, వ్యాపారవర్గాలకు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలిగించకుండా వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని కోరడంతో వ్యాపారులు ఆందోళన విరమించారు.  దీంతో క్రయవిక్రయాలు మళ్లీ మొదలయ్యాయి.

కాగా, చాంబర్‌ ప్రస్తుత, మాజీ అధ్యక్షుల మధ్య జరిగిన రగడ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.   దిడ్డి, రవిందర్‌రెడ్డి మొదటి నుంచీ మార్కెట్‌లో  ప్రత్యర్థులుగా  కొనసాగుతున్నారు. గత చాంబర్‌ ఎన్నికల నుంచైతే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో దిడ్డి వర్గంపై రవిందర్‌రెడ్డి వర్గం విజయం సాధించగా, అందుకు దీటుగా దిడ్డి తన భార్య భాగ్యలక్ష్మికి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పదవి ఇప్పించుకున్నారు. మార్కెట్‌లో  ఆధిపత్య పోరు శృతి మించుతుండటంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇదిలావుండగా,  మార్కెట్లో సోమవారం క్రయవిక్రయాల్లో మూడు గంటల పాటు జాప్యం జరిగినా ధర మాత్రం రైతులు సంతోష పడేవిధంగా పలికింది. క్వింటాలుకు రూ.8500 పలికింది.

అధికారులు హామీ ఇచ్చారు..
పోలీసు, మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమిస్తున్నట్టు చాంబర్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవిందర్‌ రెడ్డి తెలిపారు. ‘నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ నుంచి అడ్తిదారులకు రావాల్సిన పద్దులు ఇప్పించేందుకు  అధికారులు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు..  మార్కెట్లో రైతులు, వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకురావాల్సిన మార్కెట్‌ కమిటీ  నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమైన విషయం.. గతంలో ఉన్న పాలకవర్గం, చైర్మన్లు ఏ విషయాన్ని వారి దృిష్టికి తీసుకెళ్లినా వెంటనే స్పందించి సమస్య పరిష్కరానికి కృషి చేసేవారు..’ అని రవిందర్‌రెడ్డి తెలిపారు.Updated Date - 2021-11-02T05:37:37+05:30 IST