పోలీసు శాఖ అప్రమత్తం!
ABN , First Publish Date - 2021-03-24T08:00:48+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో.. పోలీసు శాఖ అప్రమత్తమవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం.. కరోనా కల్లోలం ప్రారంభమైన సమయంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం..

హైదరాబాద్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో.. పోలీసు శాఖ అప్రమత్తమవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం.. కరోనా కల్లోలం ప్రారంభమైన సమయంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం.. పకడ్బందీగా లాక్‌డౌన్ అమ లు.. వంటి అంశాలపై విశేష సేవలు అందించింది. ఆస్పత్రులు, కంటైన్‌మెంట్ జోన్ల వద్ద భద్రత విధుల్లో ఉంటూ.. ఫ్రంట్‌లైన్ వారియర్లుగా అలుపెరగని పోరాటమే చేసింది. వైరస్ వల్ల సుమారు 70 మందికిపైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది తర్వాత.. మళ్లీ.. కరోనా కేసులు పెరుగుతుండటం, పొరుగు రాష్ట్రాల నుంచి వైరస్ వ్యాప్తి చురుగ్గా ఉండటంతో కట్టడి చర్యల్లో భాగంగా మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావొద్దంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన మరుక్షణం నుంచి రంగంలోకి దిగేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో భౌతిక దూరం, మాస్కుల ధారణ వంటి కనీస జాగ్రత్తల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సిద్ధమవుతున్నారు.