పెగాసస్‌ కాదు.. పోలీస్‌!

ABN , First Publish Date - 2021-10-29T08:07:11+05:30 IST

గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. ఆ పేరుతో చేపడుతున్న తనిఖీల్లో మానవ హక్కులను, వ్యక్తిగత గోప్యతను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. నాకాబందీ, స్పెషల్‌డ్రైవ్‌ పేరుతో చేస్తున్న తనిఖీల్లో.. వాహన పత్రాలను

పెగాసస్‌ కాదు.. పోలీస్‌!

గోప్యత గాలిలో!

పోలీసు తనిఖీల్లో ఫోన్‌లు, వాట్సాప్‌ చెకింగ్‌

ఇది వ్యక్తిగత స్వేచ్ఛ ఉల్లంఘనే: న్యాయనిపుణులు

నేరస్థుల్ని పట్టుకోవడానికి ఇది సాధారణమే: పోలీసులు


జాతీయ భద్రత పేరుతో ఇష్టారాజ్యంగా వ్యక్తుల ఫోన్లలోకి చొరబడి నిఘా పెట్టడం సరికాదు.

ఇటీవల పెగాసస్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్య


వాహన తనిఖీల సందర్భంగా పోలీసులు మొబైల్‌ను చెక్‌ చేయడం సరికాదు. సీఆర్‌పీసీ సెక్షన్‌  91 ప్రకారం నోటీసులు ఇచ్చాకే ఆ పనిచేయాలి. 

 న్యాయ నిపుణులు


నేరస్థులను పట్టుకోవడానికి చేపట్టే తనిఖీల్లో భాగంగా ఫోన్లను చెక్‌ చేస్తాం. ఇది సాధారణ విషయమే..!

హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 28 (ఆంధ్ర‌జ్యోతి): గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. ఆ పేరుతో చేపడుతున్న తనిఖీల్లో మానవ హక్కులను, వ్యక్తిగత గోప్యతను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. నాకాబందీ, స్పెషల్‌డ్రైవ్‌ పేరుతో చేస్తున్న తనిఖీల్లో.. వాహన పత్రాలను పరిశీలించడం, గంజాయి వంటి మాదకద్రవ్యాలు ఉన్నాయా? లేదా? అని చూడడం వరకే పోలీసుల బాధ్యత. కేంద్ర మోటారు వాహన నిబంధనలు/చట్టాలు, సిటీ పోలీసు(సీపీ) చట్టం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కానీ, హైదరాబాద్‌ నగర పోలీసులు ఓ అడుగు ముందుకేసి.. వాహనదారుల మొబైల్‌ ఫోన్లను కూడా తనిఖీ చేస్తున్నారు. ప్యాటర్న్‌ లాక్‌, పిన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌లను తీయించి మరీ.. వాట్సాప్‌ సందేశాలను పరిశీలిస్తున్నారు. ఈ చర్య ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘనే అని న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌ పాతనగరానికి చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు తన ఫోన్‌ను పోలీసులు బలవంతంగా లాక్కొన్నారని పేర్కొన్నాడు. ‘‘నాలుగు రోజుల కింద సాయంత్రం 6 గంటల సమయంలో.. మెహిదీపట్నం నుంచి మల్లేపల్లి వైపు వెళ్తున్నాను. పోలీసులు ఆపారు. డాక్యుమెంట్ల గురించి అడుగుతారనుకున్నా. కానీ, ఫోన్‌ ఇవ్వాలన్నారు. ఎదురుచెప్పే ధైర్యం లేక ఇచ్చాను. వారు గబగబా వాట్సాప్‌ చాట్‌ చూశారు.


గంజాయి, నార్కో, చాక్‌, శాండ్‌విచ్‌ వంటి పదాలను తనిఖీ చేశారు. ఓ చాటింగ్‌లో నా చెల్లెలు శాండ్‌విచ్‌ తీసుకురావాలని పంపిన మెసేజ్‌ ఉంది. దాని గురించి అడిగారు. నా చెల్లెలు నిజంగానే శాండ్‌విచ్‌ అడిగిందని నిర్ధారించుకున్నాకే నన్ను వదిలేశారు’’ అని వాపోయాడు. యువతకే కాకుండా.. విద్యావంతులకూ ఈ బాధలు తప్పడం లేదు. ‘‘పురానాపూల్‌ వద్ద పోలీసులు ఆపారు. ఫోన్‌ అడిగారు. ఇవ్వనని చెప్పడంతో బెదిరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చాను. వాట్సాప్‌ చాట్‌ తనిఖీ చేసి.. మాదకద్రవ్యాల కీవర్డ్స్‌ను సెర్చ్‌ చేశారు. ఆ తర్వాత ఇచ్చేశారు’’ అని ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వాపోయారు. గడిచిన పది రోజులుగా గంజాయి, డ్రగ్స్‌ స్పెషల్‌ డ్రైవ్‌ పేరుతో పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో వాహనదారుల ఫోన్లను తనిఖీ చేస్తున్నారు. ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ఏమీ చేయలేని పరిస్థితి. పెగాసస్‌ స్థాయిలో కాకున్నా.. ఒక మొబైల్‌ ఫోన్‌లో స్పైవేర్‌/మాల్‌వేర్‌ను చొప్పించేందుకు ఆ ఒకట్రెండు నిమిషాలు చాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు నగర పోలీసు ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. అలా అనుమతి లేకుండా/బలవంతంగా ఫోన్లను తనిఖీ చేయడం చట్టవిరుద్ధమని, ఐటీ చట్టం కింద అలా చేసేవారు ప్రాసిక్యూషన్‌కు అర్హులని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఆ పదాలనే తనిఖీ చేస్తున్నాం: సిబ్బంది

డ్రగ్స్‌, గంజాయి, వీడ్‌ వంటి పదాలను వాట్సాప్‌ చాటింగ్‌లలో తనిఖీ చేయాలని మాకు ఆదేశాలున్నాయి. అంతేకాకుండా.. మత్తుపదార్థాలకు కోడ్‌వర్డ్స్‌ అయిన చాకీ, శాండ్‌విచ్‌ వంటి వాటిని తనిఖీ చేస్తున్నాం. వాట్సాప్‌ సెర్చ్‌లో వాటిని తనిఖీ చేసి.. ఏవైనా చాటింగ్‌లలో ఆ పదాలను వాడారా? అని చెక్‌ చేసుకుంటున్నాం.


నోటీసు ఇవ్వాల్సిందే

వాహనాన్ని ఆపి, వాహనదారుల ఫోన్‌ చెక్‌ చేయాలంటే.. పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందే. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 91 ప్రకారం నోటీసులు ఇచ్చాకే.. ఫోన్‌ను తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా.. బలవంతపు తనిఖీలు ప్రైవసీ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి. పోలీసు ఉన్నతాధికారులు వారి అధికారిక మొబైల్‌ నంబర్‌కు కాకుండా.. పర్సనల్‌ నంబర్‌కు కాల్‌ చేస్తే కసురుకుంటారు. అది తమ ప్రైవసీ అనేది వారి ధీమా. అదే ప్రైవసీ సామాన్యులకు ఉండదా? పోలీసులు చట్టప్రకారం వెళ్తే.. అక్కడికక్కడే నోటీసు ఇచ్చి ఫోన్లను తనిఖీ చేయొచ్చు. అలా చేయని పక్షంలో.. అది చట్ట విరుద్ధమే అవుతుంది.   

జయవింధ్యాల, సీనియర్‌ న్యాయవాది


నిందితులను గుర్తించేందుకే

నేరస్థులను గుర్తించేందుకు, కేసుల మిస్టరీ ఛేదనకు ఎలకా్ట్రనిక్‌ పరికరాలను వినియోగిస్తాం. ఈ క్రమంలోనే సీసీ కెమెరా ఫుటేజ్‌, ల్యాప్‌టాప్‌, ఐపాడ్‌, సెల్‌ఫోన్‌ డేటా, హార్డ్‌డిస్క్‌, పెన్‌డ్రైవ్‌లను విశ్లేషిస్తాం. ఇలా ఎందరో నేరస్థుల్ని పట్టుకున్నాం. అదే తరహాలో.. ఇప్పుడు ఫోన్‌, వాట్సాప్‌ తనిఖీలు చేస్తున్నాం. ఇది కేవలం నేరస్థులు, అసాంఘిక శక్తులను గుర్తించడానికే.    

అంజనీకుమార్‌, హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌

Updated Date - 2021-10-29T08:07:11+05:30 IST