మళ్లీ ఎమ్మెల్సీ బరిలో కవిత

ABN , First Publish Date - 2021-11-23T09:16:47+05:30 IST

సీఎం కేసీఆర్‌ కూతురు, సిటింగ్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

మళ్లీ ఎమ్మెల్సీ బరిలో కవిత

  • నిజామాబాద్‌ ‘స్థానిక’ అభ్యర్థిగా ఖరారు
  • నేడు నామినేషన్‌ 
  • గాయకుడు సాయిచంద్‌కు నిరాశే
  • కూచుకుళ్లకు మళ్లీ అవకాశం
  • నామినేషన్లకు నేడే చివరిరోజు(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): సీఎం కేసీఆర్‌ కూతురు, సిటింగ్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా ఆమె మళ్లీ పోటీ చేయనున్నారు. ఈ మేరకు కవిత అభ్యర్థిత్వాన్ని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది. మంగళవారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కవిత ప్రస్తుత మండలి సభ్యత్వం త్వరలో ముగియనుండగా.. మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపడంలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకా్‌షను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ఖరారు చేయడంతో.. ఆయన స్థానంలో కవితను  పంపిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్‌ స్థానానికి సిటింగ్‌ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఊహాగానాలకు తెరదించుతూ.. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ కవిత పేరునే ఖరారు చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయరాదని బీజేపీ నిర్ణయించగా, కాంగ్రెస్‌ మాత్రం కొన్నిచోట్ల పోటీ చేయాలని, మరికొన్నిచోట్ల దూరంగా ఉండాలని యోచిస్తోంది. 


నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ ఒకవేళ పోటీ చేసినా.. సభ్యుల పరంగా టీఆర్‌ఎ్‌సకు భారీ మెజారిటీ ఉండడంతో కవిత విజయం సులువు కానుంది. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో హైడ్రామా నడిచింది. సిటింగ్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి రెన్యువల్‌ దక్కదని, గాయకుడు సాయిచంద్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటిస్తుందనే వార్తలు వచ్చాయి. దీంతో కూచుకుళ్ల.. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన సమయంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌కు గుర్తు చేసి రెన్యువల్‌ పొందారు. కాగా, సోమవారం వరంగల్‌ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, ఖమ్మం నుంచి తాతా మధుసూదన్‌ నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలినవారు చివరి రోజు మంగళవారం వేయనున్నారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 26 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబరు 10న పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. 


బలం ఉన్నచోట్ల కాంగ్రెస్‌ పోటీ!

మెదక్‌ స్థానం నుంచి సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిని, ఖమ్మం నుంచి స్థానిక నేత రాయల నాగేశ్వర్‌రావును కాంగ్రెస్‌ పోటీకి దించనున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరగడం, పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎ్‌సలోకి ఫిరాయించినందున పోటీకి దూరంగా ఉండాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. కానీ, స్థానిక నాయకత్వాల ఒత్తిడితో కొన్నిచోట్ల పోటీకి సిద్ధమైంది. వరంగల్‌లో వాసుదేవరెడ్డి, నిజామాబాద్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ను పోటీ చేయించే అంశంపై సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ విషయంలోనూ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.

Updated Date - 2021-11-23T09:16:47+05:30 IST