‘పోడు’ ఆశలు చిగురించేనా..?
ABN , First Publish Date - 2021-10-21T05:40:46+05:30 IST
‘పోడు’ ఆశలు చిగురించేనా..?

సమస్య పరిష్కారంపై దృష్టిసారించిన ప్రభుత్వం
ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు
రేపు భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఏరియల్ సర్వే
అనంతరం ములుగు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష
రైతుల భవితవ్యాన్ని తేల్చనున్న నివేదికలు
(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)
పోడు సమస్యపై ప్రభుత్వం దృష్టిసారించింది. రైతు లకు హక్కు పత్రాలు ఇచ్చే విషయాన్ని పరిశీలి స్తోందని తెలుస్తోంది. ఇప్పటికే పోడు భూముల వ్యవ హారాన్ని తేల్చేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. తాజాగా ఉన్నత స్థాయి అధికా రులతో మరో కమిటీని ఏర్పాటు చేసింది. అడవులు విస్తారంగా ఉన్న జిల్లాల్లో ఏరియల్ సర్వే చేపట్టి, పోడు సమస్య పరిష్కారంతో పాటు వన సంపదను పెంచేందుకు ప్రణాళిక రూపొందించనుంది. ఈ క్రమంలో పోడు సమస్య తీవ్రంగా ఉన్న భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో శుక్ర వారం ఉన్నత స్థాయి అధికారుల కమిటీ పర్యటిం చనుంది. అదే రోజు సాయంత్రం ములుగు కలెక్ట రేట్లో నాలుగు జిల్లాల కలెక్టర్లు, అడవీ శాఖ అధి కారులు సమావేశమై సమీక్షించనున్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సుమారు 25వేల పోడు రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
అడవుల్లో ఏరియల్ సర్వే..
పోడు సమస్య పరిష్కారంతో పాటు అడవుల పరిర క్షణపై దృష్టి సారించిన ప్రభుత్వం గిరిజన సంక్షేమ శా ఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో పలుమార్లు సమావే శమైన మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. పోడు సమస్యతో పాటు అడవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి అధికారులతో ఓ కమిటీని నియమించింది. అడవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రీస్టినా జెడ్.చొంగ్తూ, సీఎం ఓఎస్డీ భూపాల్‌రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో అడవులు విస్తారంగా ఉన్న 13 జిల్లాల్లో ఈ కమిటీ మూడు రోజులపాటు పర్యటించనుంది. చివరి రోజు శుక్రవారం భూపాలపల్లి, ములుగు, మహబూ బాబాద్, వరంగల్ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేయ నుంది. భూపా లపల్లి జిల్లాలోని మహదేవపూర్, పలి మెల, మహముత్తారం, భూపాలపల్లి మండలాల్లోని అడవులతో పాటు ములుగు జిల్లాలోని కన్నాయి గూడెం, తాడ్వాయి, ఏటూరునాగారం, గోవింద రావుపేట, వెంకటాపురం, వాజేడు మండలాల్లో అడవుల పరిరక్షణ, రిజర్వ్ ఫారెస్ట్ వెలుపల హరితహారం మొక్కలను కమిటీ సభ్యులు పరిశీలిం చనున్నారు. ఇటీవల పోడుతో పాటు స్మగ్లర్ల వేటకు ఖాళీ అవుతున్న అడవులు దుస్థితిపై కూడా దృష్టిసారించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గంగారం, కొత్తగూడ, గూడురు, బయ్యారం, మహబూ బాబాద్ మండలాలు, అలాగే వరంగల్ జిల్లాలోని నర్సంపేట, ఖానాపూర్ మండలాల్లోని అడవులను ఏరి యల్ ద్వారా వీక్షించనున్నారు. అడవుల్లో సాగవుతున్న పోడు భూములతో పాటు అడవుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలించనున్నారు.
రేపు ములుగు కలెక్టరేట్లో సమీక్ష
ఉన్నతాధికారుల ఏరియల్ సర్వే అనంతరం శుక్రవా రం ములుగు జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించను న్నారు. వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూ బాబాద్ జిల్లాల్లో అడవుల పరిస్థితి, పోడు రైతులు స మస్యపై సమీక్షించనున్నారు. ప్రధానంగా అడవీ హ క్కుల పరిరక్షణ చట్టం, పోడు రైతుల తరలింపుపై చర్చించనున్నారు. అడవీ పరిరక్షణకు ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోవాలో, పోడు, అడవీ ఆక్రమణలు జరగకుండా ఎలా రక్షించాలో కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే నాలుగు జిల్లాల్లో ఎంత మంది పోడు రైతులు ఉన్నారు.. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? తదితర వివరాలు సేకరించి సమీక్షించనున్నారు. పోడు సమస్యపై పూర్తిగా అధ్యయనం చేయటంతో పాటు అడవులను మరిం తగా పెంచేలా దృష్టి సారించనున్నారు. ఉన్నత స్థాయి అధికారులు సేకరించిన సమాచారంతో పాటు నాలు గు జిల్లాల కలెక్టర్లు, డీఎఫ్‌వోలు, ఐటీడీఏ అధికారులు, ఆర్డీవోలు, ఇతర జిల్లాస్థాయి ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించి లోతుగా చర్చించనున్నారు. ఆ యా జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ఆధారం గా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా ఈ ఏడాది చివరి నాటికి పోడు సమస్య పరిష్కరించే అవకాశం ఉందని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
అఖిలపక్షం ఆందోళనలు
కొంతమంది పోడు రైతులకు 2005లో హక్కు పత్రాలు అందాయి. ఈ నేపథ్యంలో 2014 వరకు పోడులో ఉన్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కుర్చీ వేసుకొని పోడు సమస్యను దగ్గరుండి పరిష్కరిస్తానని గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చి ఉన్నారు. అయితే.. అది నెరవేరకోవడంతో ఏడేళ్లుగా పోడు రైతులు హక్కు పత్రాలు, భూ పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దశల వారీగా ఆందోళన లు చేపడుతున్నారు.పోడు రైతుల సమస్య పరిష్కారం కోసం ఇటీవల అఖిలపక్షం భారీ ఆందోళనకు దిగింది. సడక్ బంద్ నిర్వహించింది. ఈనెల 5న సడక్ బంద్ చేపట్టి సర్కారుపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.
25,117 మంది రైతుల నిరీక్షణ
ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగ ల్ జిల్లాల నుంచి 2006లో 1,25,700 ఎకరాల పోడు భూమి కోసం 42,292 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2009లో 17,175 మందికి 49,944.71 ఎకరాలకు హక్కు పత్రాలను అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా 25,117 మంది రైతులకు 75,755.29 ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వకుండా దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రధానంగా ములుగు జిల్లాలో 7,482 మంది, మహబూబాబాద్ జిల్లాలో 12,720 మంది, భూపాలపల్లిలో 3,021 మంది, వరంగల్ జిల్లాలో 1,894 మందితో కలిపి మొత్తం 25,117 మంది హక్కు పత్రాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. నిత్యం అడవీ శాఖ అధికారుల తో ఘర్షణలు జరుగుతుండటం, హరితహారం పేరిట పోడు భూములను అడవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవటం లాంటి పరిస్థితుల దృష్ట్యా ఉద్రిక్తత ఏర్పడుతోంది. ఈ క్రమంలో 2014 వరకు పోడులో ఉన్న రైతులందరికీ హక్కు పట్టాలు ఇవ్వటమే కాకుం డా రైతు బంధును అమలు చేయాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేస్తున్నారు.