‘పరకాలను జిల్లాగా ప్రకటించాలి’

ABN , First Publish Date - 2021-07-29T05:40:09+05:30 IST

‘పరకాలను జిల్లాగా ప్రకటించాలి’

‘పరకాలను జిల్లాగా ప్రకటించాలి’
పరకాలలో మోకాళ్లపై కూర్చోని నిరసన తెలుపుతున్న అఖిలపక్ష నేతలు

పరకాల, జూలై 28 : త్యాగాల పురిటిగడ్డ పరకాలను జిల్లాగా ప్రకటించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు లావుడ్య రాజు డిమాండ్‌ చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో బుధవారం నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. పరకాల ప్రజల చిరకాలవాంఛ జిల్లా ఏర్పాటని, ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరారు. పరకాల చుట్టుపక్కల గ్రామాలు, మండలాలకు పెద్దదిక్కుగా కొనసాగుతోందని అన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించకుంటే ఉద్యమం జిల్లా వ్యాప్తంగా విస్తరింపచేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాకేష్‌, సురేష్‌, శంకర్‌ తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌కు న్యాయవాదుల వినతి..

పరకాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు కలెక్టర్‌ హరితకు వినతి పత్రాన్ని అందజేశారు. నిజాం రజాకార్లతో పోరాడి ప్రాణాలను లెక్కచేయకుండా ముందుండి పోరాడిన గడ్డను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలని వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఒటేరు రాజమౌళి, టగ్గ విజయపాల్‌రెడ్డి, శంకర్‌, రవి, జగదీశ్వర్‌, రాజయ్య ఉన్నారు.

చరిత్రలో నిలిచిపోవాలి : అఖిల పక్షం

పరకాల : సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒప్పించి, పరకాల జిల్లాను ఏర్పాటు చేసి, చరిత్రలో నిలిచిపోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. అఖిలపక్షం నాయకులు పరకాలను అమరవీరుల జిల్లాగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక అమరధామం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు చెవిలో పువ్వులు పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ కూడలీ వద్ద మోకాళ్లపై కూర్చోని పరకాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ఘనచరిత్ర కలిగిన పోరుగడ్డ పరకాలను ఎమ్మెల్యే ధర్మారెడ్డి చొరవ తీసుకుని ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జిల్లా చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలుగా ఏర్పడి ఎన్నో ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంటే పాత తాలూకా కేంద్రమైన పరకాల అన్ని వర్గాలకు, వాణిజ్య వ్యాపారస్తులకు కేంద్ర బిందంగా ఉన్నప్పటికి పాలకుల నిర్తక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి సభ్యులు పిట్ట వీరస్వామి, దుబాసి వెంకటస్వామి, మార్త భిక్షపతి, దుప్పటి సాంబయ్య, ఆర్‌పీ జయంత్‌లాల్‌, పంచగిరి జయమ్మ, బెజ్జంకి పూర్ణచారి, మంద రాంచందర్‌, నాగెళ్ళి రంజిత్‌, అలీ, కక్కు రాజు, ఒంటేరు రాజమౌళి, కఫిల్‌, బండారి కృష్ణ, దావు పరమేశ్వర్‌ ఉన్నారు.

Updated Date - 2021-07-29T05:40:09+05:30 IST