ఎన్నికల ముందు బడులకు అనుమతి.. ఫలితాల తర్వాత మూత!

ABN , First Publish Date - 2021-03-24T08:45:06+05:30 IST

సరిగ్గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు నడుపుకోవడానికి అనుమతి! ఫలితాలు వెల్లడైన తర్వాత బడులు బంద్‌..

ఎన్నికల ముందు బడులకు అనుమతి.. ఫలితాల తర్వాత మూత!

  • కరోనా తీవ్రమవుతుందని తెలిసీ అనుమతులు.. 
  • ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసమేనని అప్పట్లోనే విమర్శలు
  • స్కూళ్ల ప్రారంభం 24 రోజుల ముచ్చట
  • ఒకేసారి రద్దీ పెరగడంతోనే కేసులు
  • ప్రభుత్వ నిర్ణయంపై ఉన్నత విద్యాసంస్థల దిగ్ర్భాంతి

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): సరిగ్గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు నడుపుకోవడానికి అనుమతి! ఫలితాలు వెల్లడైన తర్వాత బడులు బంద్‌!! వెరసి.. తరగతి గదుల్లో సందడి 24 రోజుల ముచ్చటే అయ్యింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఒత్తిళ్లు.. తరగతుల నిర్వహణకు అనుమతిస్తేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు పలుకుతామని వారు స్పష్టం చేయడం.. పాఠశాలలు తెరిస్తే వారి ఓట్లు పడతాయన్న ప్రభుత్వ స్వార్ధ ప్రయోజనాలే మాధ్యమిక పాఠశాలల అనుమతుల వెనక ప్రధాన కారణంగా నిలిచాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 11 నెలల విరామం అనంతరం ఫిబ్రవరి 1 నుంచి.. 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌, ఉన్నత విద్య తరగతులన్నీ ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతించ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు దాకా ఎక్కడా కొవిడ్‌ కేసులు నమోదు కాలేదు. అయితే.. ఫిబ్రవరి 24 నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభించుకోవచ్చని ఫిబ్రవరి 23న ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరగతులు ప్రారంభమైన 10 రోజుల నుంచి కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరగటం ప్రారంభమైంది.


ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 14న జరగగా.. అప్పటికి వారం క్రితం నుంచే విద్యాసంస్థల్లో పదుల సంఖ్యలో కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. కానీ.. అకస్మాత్తుగా ఇప్పుడు విద్యాసంస్థల మూసివేత  నిర్ణయం తీసుకుంది.. దేశవ్యాప్తంగా కొవిడ్‌ రెండో దశ ప్రారంభమైందనే ఆందోళన ఒకవైపు వ్యక్తమవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం 6, 7, 8 తరగతుల నిర్వహణకు అనుమతివ్వడమే ఈ సమస్యకు కారణమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 9, 10 తరగతులు మాత్రమే జరిగినప్పుడు బడుల్లో పిల్లలు భౌతిక దూరం పాటించడం సాధ్యమైందని.. 6, 7, 8 తరగతుల పిల్లలు కూడా రావడంతో రద్దీ పెరిగి, భౌతిక దూరం పాటించడం కష్ట సాధ్యంగా మారింది. దీంతో కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ముఖ్యం గా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఒకేసారి పదుల సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి.

  

జూనియర్‌, డిగ్రీ కాలేజీలెందుకు?

రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలూ బంద్‌ చేస్తున్నట్టు మంగళవారం ప్రభుత్వం చేసిన ప్రకటన ఉన్నతవిద్యాశాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. 15 రోజులుగా వెలుగుచూసిన కేసుల్లో దాదాపు అన్నీ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లోనివే. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఫార్మసీ కాలేజీలు ప్రారంభమవ్వగా.. వాటిల్లో ఎక్కడా ఇంతవరకూ పాజిటివ్‌ కేసులు నమోదవ్వలేదు. అనూహ్యంగా ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాలేజీలనూ మూసివేయాలన్న ప్రకటనతో ఉన్నత విద్యాసంస్థలు సైతం కంగుతిన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఉన్నత విద్యాసంస్థలతోపాటు.. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల ఓట్లతో కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న లక్ష్యంతోనే బడులు తెరిపించారని విమర్శిస్తున్నాయి. ఎన్నికలయ్యాక ఇప్పుడు బడుల మూసివేత నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నాయి.  


వైన్‌ షాపులనూ మూసివేయండి.. 

పాఠశాలల్లో రద్దీ పెరుగుతోందని, కేసులు పెరుగుతాయని పేర్కొంటున్న ప్రభుత్వానికి వైన్‌ షాపుల రద్దీ కనిపించడం లేదా? సినిమా హాళ్లను 100 శాతం ఆక్యుపెన్సీతో ఎందుకు అనుమతించారు? బస్సుల్లో రద్దీ ప్రయాణాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతిచ్చింది? బడుల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటే.. వైన్‌ షాపులనూ బంద్‌ చేయాలి. సినిమా హాళ్ల అనుమతులను రద్దు చేయాలి.

శ్రీనివాస్‌ రెడ్డి, ప్రైవేటు పాఠశాలల సంఘం (ట్రస్మా) గౌరవ అధ్యక్షుడు 


కాలేజీల మూత ఎందుకు?

జూనియర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఎలాంటి కేసుల్లేకపోయినా మూసివేయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? కరోనా లాక్‌డౌన్‌లో కాలేజీల మూసివేతతో వేలాది మంది ఉపాధి కోల్పోతే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించింది. ఇప్పుడిప్పుడే కాలేజీలు కోలుకుంటున్న దశలో.. మళ్లీ మూసివేత నిర్ణయం సరికాదు.

గౌరీ సతీష్‌, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - 2021-03-24T08:45:06+05:30 IST