డబుల్‌ ఇళ్లలో స్వీయ గృహప్రవేశాలు!

ABN , First Publish Date - 2021-02-05T09:22:04+05:30 IST

డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు.. కేటాయింపులు జరపని అధికారుల తీరును నిరసిస్తూ ఆ ఇళ్లలో స్వీయ గృహ ప్రవేశాలు చేసుకున్నారు...

డబుల్‌ ఇళ్లలో స్వీయ గృహప్రవేశాలు!

  • అధికారుల వైఖరికి లబ్ధిదారుల నిరసన
  • తమకు తామే ఇళ్ల కేటాయింపులు
  • సిద్దిపేట జిల్లా బల్వంతాపూర్‌లో ఘటన 

దుబ్బాక, పిబ్రవరి 4: డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు.. కేటాయింపులు జరపని అధికారుల తీరును నిరసిస్తూ ఆ ఇళ్లలో స్వీయ గృహ ప్రవేశాలు చేసుకున్నారు. ఎవరికి వారు కేటాయింపులు జరుపుకుని, తాళాలను పగుల కొట్టి మరీ ఇళ్లలోకి ప్రవేశించారు. సిద్దిపేట జిల్లా దు బ్బాక మండలం బల్వంతాపూర్‌లో గురువారం ఇదం తా జరిగింది. బల్వంతాపూర్‌లో 60 మంది డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారులుండగా, వీరి కోసం 2019లో దశలవారీగా ఇళ్లను నిర్మించారు. వాటిలో మిషన్‌ భగీరథ నల్లాలు, కరెంటు స్థంభాలు ఏర్పాటు చేశారు. అయితే, రెండున్నరేళ్లుగా లబ్ధిదారు ల జాబితాను మార్చుతూ వస్తున్నారు. దీంతో అప్పట్లో లబ్ధిదారు లు ఆగ్రహించడంతో గతేడాది దసరాకు పంపిణీ చేస్తామని అధికారులు వారిని సముదాయించారు. అంతలోనే ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణానంతరం పరిస్థితులు మారాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే మంత్రి హరీశ్‌రావు ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈలోగా ఉపఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో పంపిణికీ బ్రేక్‌ పడింది. ఎన్నికలు ముగిసి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి చెందడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఓపిక నశించిన గ్రామస్థులు కొంతమంది గురువారం తాళాలను పగల కొట్టి, వాటిలోకి గృహప్రవేశాలు చేసుకున్నారు. ఇందులో అనర్హులు కూడా ఉండటంతో వివాదం నెలకొంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారని, ఖాళీ చేయకుంటే తామే ఖాళీ చేయించాల్సి వస్తుందని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  తహసీల్దార్‌ నూకల రాజేందర్‌రెడ్డి లబ్ధిదారులను హెచ్చరించారు. 


Updated Date - 2021-02-05T09:22:04+05:30 IST