టీఆర్‌ఎస్‌ ‘ప్లీనరీ ఫ్లెక్సీ’లకు జరిమానా

ABN , First Publish Date - 2021-10-29T08:25:14+05:30 IST

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఇటీవల భారీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలు, తోరణాలపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎట్టకేలకు స్పందించింది.

టీఆర్‌ఎస్‌ ‘ప్లీనరీ ఫ్లెక్సీ’లకు జరిమానా

  • మంత్రి తలసాని శ్రీనివాస్‌కు రూ.1.50 లక్షలు జరిమానా
  • ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అత్యధికంగా రూ.3.10 లక్షలు
  • ఇప్పటివరకు రూ.10 లక్షల ఫైన్‌.. ఇంకా పెరిగే అవకాశం!


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఇటీవల భారీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలు, తోరణాలపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎట్టకేలకు స్పందించింది. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంలో బల్దియా నిర్లక్ష్యం పట్ల ‘‘ఆంధ్రజ్యోతి’’ ప్రచురించిన వరుస కథనాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) అధికారులు చర్యలు తీసుకోక తప్పలేదు. ఫ్లెక్సీలపై ఎక్కడ ఫిర్యాదులు వస్తాయోనన్న ఉద్దేశంతో.. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పేరిట నిలిపివేసిన సీఈసీ (సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌)- ఈవీడీఎం ట్విటర్‌ ఖాతాను గురువారం సాయంత్రం పునరుద్ధరించారు. ఆ వెంటనే వందల పోస్టులు వెల్లువెత్తాయి. ఖాతాను నిలిపివేసినా.. ఫ్లెక్సీలు, కటౌట్ల ఫొటోలను నెటిజన్లు పోస్టు చేశారు. కొందరు గతంలోనే పోస్ట్‌ చేయగా.. కొందరు గురువారం ఫొటోలు అప్‌లోడ్‌ చేశారు. వీటి ఆధారంగా అధికారులు జరిమానాలు వేశారు.


రాత్రి 9 గంటల వరకు రూ.10 లక్షలకుపైగా చలానాలు జనరేట్‌ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని, ట్విటర్‌ పోస్టుల ఆధారంగా జరిమానాలు వేస్తామని చెప్పారు. కాగా, అత్యధికంగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ.3.10 లక్షలు,  తర్వాత పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌కు రూ.1.50 లక్షలు ఫైన్‌ విధించారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మికి రూ.65 వేలు, కార్మిక మంత్రి మల్లారెడ్డికి రూ.10 వేలు జరిమానా వేశారు. పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకూ పెనాల్టీ వేశారు.


వారం తర్వాత..

అలంకరణ చేయండి.. జీహెచ్‌ఎంసీ వారు తొలగించకుండా చూసుకుంటామన్న పార్టీ అగ్రనేతల హామీతో కార్యకర్తలు ఇష్టారీతిన ప్రధాన, అంతర్గత రహదారి తేడా లేకుండా గులాబీమయం చేశారు. అయితే, ఈ నెల 25న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరగ్గా.. అంతకు నాలుగు రోజుల ముందు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తున్నామని సీఈసీ- ఈవీడీఎం ట్విటర్‌ ఖాతాను నిలిపివేశారు. అధికార పార్టీ అగ్ర నేతల ఆదేశాలతోనే ఈ పని చేశారన్న ప్రచా రం జరిగింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జీహెచ్‌ఎంసీ తీరు, టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగంపై ప్రతిపక్ష పార్టీలు ఽధ్వజమెత్తాయి. అయినా.. మాకేంటి అన్నట్టు వ్యవహరించిన అధికారులు తాపీగా గురువారం ట్విటర్‌ ఖాతా పునరుద్ధరించారు. మరోవైపు ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్ల కారణంగా నగర అందం దెబ్బతింటుందని, అలాంటివి ఏర్పాటు చేసేవారిపై పబ్లిక్‌ ప్లేసేస్‌ డిఫే్‌సమెంట్‌ చట్టం కింద కఠినంగా వ్యవహరించాలని గతంలో పురపాలక మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇవే ఆదేశాలను సొంత పార్టీ సమావేశం సందర్భంగా ఉల్లంఘించిన తీరును నెటిజన్లు ప్రస్తావించారు.


గురువారం రాత్రి 9 గంటల వరకు ఇదీ లెక్క..

Updated Date - 2021-10-29T08:25:14+05:30 IST