పీవీ..తెలంగాణ ఠీవి
ABN , First Publish Date - 2021-06-29T09:28:23+05:30 IST
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఒక కీర్తి శిఖరం, దీప స్తంభం అని సీఎం కేసీఆర్ అన్నారు.
- నరసింహారావు ఒక కీర్తి శిఖరం
- ఆయన వల్లే దేశంలో సంస్కరణలు
- కేయూలో పీవీ విద్యాపీఠం నెలకొల్పుతాం
- పలు పథకాలకు పీవీ పేరు పెడతాం: సీఎం
- భారతమాత భూమిపుత్రుడు పీవీ
- రాజకీయాలకతీతంగా పనిచేశారు: తమిళిసై
- పీవీ శత జయంతి ముగింపు వేడుకలు
- కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్, సీఎం
- నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం
హైదరాబాద్/ఖైరతాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఒక కీర్తి శిఖరం, దీప స్తంభం అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి అవసరమైన పరిపూర్ణ సంస్కరణలు తెచ్చిన మహనీయుడని కొనియాడారు. ఆయనను ఎంత స్మరించుకున్నా తక్కువేనన్నారు. సోమవారం పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లె్సరోడ్కు ‘పీవీ మార్గ్’గా నామకరణం చేశారు. ఈ రోడ్డులోని రోటరీ చౌరస్తా సమీపంలో 16 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. పీవీ రచించిన, పీవీపై రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మన పీవీ.. మన తెలంగాణ ఠీవి అని అన్నారు. అందుకే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, నెక్లెస్ రోడ్డుకు ఆయన పేరు పెట్టామని, అనేక పుస్తకాలను ముద్రిస్తున్నామని చెప్పారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ విద్యాపీఠం నెలకొల్పుతున్నామని, భవిష్యత్తులో అనేక పథకాలకు పీవీ పేరు పెడతామని ప్రకటించారు. ‘‘పీవీ ఒక విద్యా నిధి, సాహిత్య పెన్నిధి, కవి, పండితుడు, బహుభాషా కోవిదుడు. అనేక పుస్తకాలను అధ్యయనం చేశారు.
స్వయంగా పుస్తకాలు రాశారు. ఆయన సాహిత్య స్ఫూర్తి ఉన్నవారు. ప్రపంచానికి అనేక విషయాల్లో మార్గదర్శనం చేశారు. అది నిరంతరం ప్రజ్వరిల్లాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర పోరాటంలోనూ పీవీ పాల్గొన్నారని తెలిపారు. ఆయనకున్న 800 ఎకరాల భూమిని ప్రజలకు ఇచ్చారని ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అనేక సంస్కరణలు ఆయన వల్లనే సాధ్యమయ్యాయన్నారు. అనేక రాష్ర్టాలు పీవీ భూ సంస్కరణలను స్పూర్తిగా తీసుకుని అమలు చేశాయన్నారు. దేశం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో ప్రధాని పీఠాన్ని అధిరోహించి, అనేక సంస్కరణలతో వ్యవస్థను గాడిన పెట్టారన్నారు. ఫలితంగానే బహుళజాతి సంస్థలు మన దేశానికి వచ్చాయని, యువతకు అనేక ఉద్యోగావకాశాలు వచ్చాయని తెలిపారు. పీవీ విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడే గురుకుల, నవోదయ పాఠశాలలు స్థాపించారన్నారు. మైనారిటీలో ఉన్న తన ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపారన్నారు. మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్ కూడా పీవీని తన గురువుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. పీవీ స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆయన ఆదర్శాలను పాటిస్తూ.. సమాజానికి దోహదపడడమే నిజమైన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.
దేశం గర్విచదగ్గ వ్యక్తి పీవీ..
పీవీ నర్సింహారావు భారతమాత భూమి పుత్రుడు, ఈ భూమి చరిత్ర తెలిసిన వాడు అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దక్షిణ భారతమే కాకుండా దేశం మొత్తం గర్వించదగిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన తెలంగాణ పుత్రుడు కావడం మనందరమూ గర్వించదగిన విషయమన్నారు. ఇతరుల తోటలోని మల్లెపూలు కూడా మంచి వాసననే ఇస్తాయన్నట్లుగా.. కాంగ్రె్‌సలో పెద్ద నేత అయిన పీవీని ఇతర పార్టీల నేతలు కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. పీవీ జీవిత చరిత్ర పుస్తకాన్ని వాజపేయి ఆవిష్కరించారని తెలిపారు. రాజకీయాల కంటే దేశాన్ని పీవీ ఎక్కువగా ప్రేమించారని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పారన్నారు. పీవీ శత జయంతి కార్యక్రమానికి హాజరు కావడం తనకు గర్వంగా ఉందన్నారు. కాగా, ఢిల్లీలోనూ, పీవీ స్థలంలోనూ ఆయన విగ్రహాలను నెలకొల్పుతామని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశవరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎమ్మెల్సీ వాణిదేవి, ప్రభాకర్‌రావు, పీవీ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. కాగా, పీవీ విగ్రహావిష్కరణ సందర్భంగా పీవీ మార్గ్‌లో పోలీసులు ఎవరినీ అనుమతించకపోవడం, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. మీడియా ప్రతినిధులను సైతం పోలీసులు కార్యక్రమ స్థలానికి అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ప్రొటోకాల్ పేరుతో చాలా మంది వీఐపీలను కూడా పోలీసులు అనుమతించలేదు. కాగా, పీవీ విగ్రహం నగరవాసులకు మరో సెల్ఫీ స్పాట్‌గా మారింది. సోమవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు కుటుంబాలతో సహా వచ్చి అక్కడ సెల్ఫీలు దిగారు.
పీవీకి వెంకయ్య నివాళి
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ప్రారంభించిన విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ఆ తరువాత వచ్చిన వాజపేయి కొనసాగించగా, ఇప్పటి ప్రధాని నరేంద్రమోదీ వేగవంతం చేశారని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పీవీ శత జయంతి సందర్భంగా విశాఖ సిరిపురం జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి సోమవారం ఉదయం వెంకయ్యనాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పీవీ నాయకత్వం, దూరదృష్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పథం వైపు నడిపించాయన్నారు. దేశంలో లైసెన్స్ రాజ్‌ను రద్దు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్య బోధన జరగాలని పీవీ ఆకాంక్షించారని, తానైతే హైస్కూల్ స్థాయి వరకు మాతృభాషలో బోధించాలని కోరుతున్నానన్నారు. పీవీ వంటి మహనీయుల గురించి భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
