రూ.కోటి లోపు ఉన్న బిల్లులను చెల్లించండి

ABN , First Publish Date - 2021-01-20T09:33:09+05:30 IST

పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును కోరారు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర

రూ.కోటి లోపు ఉన్న బిల్లులను చెల్లించండి

మంత్రి హరీశ్‌రావును కోరిన కాంట్రాక్టర్లు


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును కోరారు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు మంగళవారం హరీశ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల నుంచి బిల్లులను పెండింగ్‌లో ఉంచడంతో చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రూ.కోటిలోపు ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఇలా చేస్తే చిన్న, మధ్య తరగతి కాంట్రాక్టర్లు అప్పుల నుంచి బయట పడతారని చెప్పారు. చాలా కాలం నుంచి బిల్లులను చెల్లించకపోవడంతో పలువురు కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, వీఆర్వోలను ప్రత్యేక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఆర్‌ఐ) లుగా నియమించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గోల్కొండ సతీశ్‌, పల్లెపాటి నరే్‌షల నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసి, వినతిపత్రాన్ని అందించింది. ఐదు నెలల కిందట వీఆర్వో వ్యవస్థను రద్దుచేయగా.. ఇప్పటి వరకు వారిని సర్దుబాటు చేయడం లేదని ప్రతినిధులు మంత్రికి తెలిపారు. భూములతో ముడిపడి ఉన్న పనులేవీ అప్పగించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ వైపు ఆదేశాలు ఇవ్వగా.. భూములతో ముడిపడి ఉన్న పనులు చేయకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-01-20T09:33:09+05:30 IST