పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయంలో ఇవే కీలకం..

ABN , First Publish Date - 2021-03-22T08:00:17+05:30 IST

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాధించిన...

పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయంలో ఇవే కీలకం..

  • పార్టీ బలం.. విపక్ష ఓట్ల చీలిక

నల్లగొండ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాధించిన విజయంలో పార్టీ బలానికితోడు తన మంత్రాంగమూ పని చేసింది. ఓటర్ల నమోదు నుంచి వారిని పోలింగ్‌ బూత్‌కు తీసుకెళ్లి ఓట్లు వేయించుకునే దాకా ప్రణాళిక ప్రకారం వ్యవహరించారు. వార్డు సభ్యుడు మొదలు మంత్రులు, ఎంపీల వరకు ఉన్న పట్టభద్రులతోపాటు తాము అనుకున్న ఓట్లు పక్కాగా మొదటి ప్రాధాన్యానికి వేయించుకోవడంలో నూటికి నూరుశాతం విజయం సాధించారు. దీంతోనే పల్లాకు తొలి నుంచీ గౌరవప్రద మెజారిటీ కొనసాగింది. పోలీసులు, టీఎన్‌జీవోలు, విద్యుత్తు, వైద్యశాఖ పోస్టల్‌ బ్యాలెట్‌లు పెద్ద సంఖ్యలో సేకరించడం కూడా పల్లా విజయంలో కీలక భూమిక పోషించింది. పోలీసు సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్ల సేకరణ విషయంలో జిల్లా బాస్‌లే పర్యవేక్షించారని సమాచారం.


 ఇక కౌంటింగ్‌ నాటికి పల్లా విద్యాసంస్థల సిబ్బంది, గుర్తించిన పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో నల్లగొండలో మకాం వేసి సకల సౌకర్యాలతో భోజన, వసతి ఏర్పాట్లు చేశారు. భారీగా నామినేషన్ల దాఖలు, ఐదు లక్షల పైచిలుకు ఓట్లు ఉండటంతో 50 శాతం ఓటర్లకు ఓటుకు వెయ్యి రూపాయలు పంచారని విపక్షాలు పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశాయి. ఇదంతా ఓ భాగమైతే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలడం, అధికార పార్టీ తన ఓట్లను నిలబెట్టుకోవడంతో పల్లా విజయం ఖరారైంది. తాను విజయం సాధిస్తానని, రెండో స్థానంలో తీన్మార్‌ మల్లన్న ఉంటారని కౌంటింగ్‌ ప్రక్రియ మొదటి రోజే పల్లా ‘ఆంధ్రజ్యోతి’కి స్పష్టం చేశారు.


కోదండరాం, మల్లన్నకు కౌంటింగ్‌ ఏజెంట్లూ కరువే..

టీజేఎస్‌ తరఫున పోటీ చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నారు. ఆర్థిక వనరుల లేమి ఓవైపు వేధించగా.. పార్టీ జిల్లా కమిటీలు విస్తృత స్థాయిలో పనిచేసే పరిస్థితిలో లేవు. పోలింగ్‌ రోజు ఏజెంట్లు లేక ఎవరైనా దొరుకుతారా? ముందుకొస్తే రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తామంటూ ఆ పార్టీ నేతలు వెతుకులాడిన పరిస్థితి నెలకొంది. చివరికి మొదటి ప్రాధాన్యంలో 70,072 ఓట్లు, రెండో ప్రాధాన్యంలో 33వేల ఓట్లు సాధించిన ఫ్రొఫెసర్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇక నియోజకవర్గంలో విస్తృత పాదయాత్ర, తన వెబ్‌ చానల్‌ ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ కుటుంబాన్ని, బోగస్‌ ఓట్ల నమోదును ప్రశ్నించడంతో తీన్మార్‌ మల్లన్న.. యువకులు, యువ ఉద్యోగులకు బాగా దగ్గరయ్యారు. పార్టీ, జెండా, అనుచరబలగం, ఆర్థిక వనరులు ఏవీ లేవు. ఓట్ల నమోదు కార్యక్రమం సైతం చేపట్టలేని పరిస్థితి. అయినా అందరికన్నా భిన్నంగా పనిచేసిన తీన్మార్‌ మల్లన్నకు ఈ ఎన్నికలో మంచి ఆదరణ లభించింది. పోలింగ్‌ రోజు బూత్‌లకు ఏజెంట్లుగా సమకూర్చుకునేందుకు మల్లన్న సైతం యువకులకు కొంత నగదు చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అధికార పార్టీతోపాటు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెమటలు పట్టిస్తూ మల్లన్న ఈ ఎన్నికలో గుర్తింపు పొందారు. కోట్లు ఖర్చుపెట్టి, భారీ ర్యాలీలు, కళాజాతలు, ఆత్మీయ సమ్మేళనం పేరుతో పెద్దసంఖ్యలో భోజనాలు పెట్టిన వారికంటే కోదండరాం, మల్లన్న పెద్ద సంఖ్యలో ఓట్లు సాధించడం తీవ్ర చర్చకు దారి తీసింది. నగదు రహిత రాజకీయాలకు ఓ రకంగా వీరిద్దరూ ప్రాణం పోశారు.

Updated Date - 2021-03-22T08:00:17+05:30 IST