పాండవుల గుట్ట రాతి చిత్రాలను పరిరక్షించాలి
ABN , First Publish Date - 2021-01-26T04:07:46+05:30 IST
పాండవుల గుట్ట రాతి చిత్రాలను పరిరక్షించాలి
అమరావతి కల్చరల్ సెంటర్ సీఈవో శివనాగిరెడ్డి
హన్మకొండ, జనవరి 25, (ఆంధ్రజ్యోతి): పాండువులగుట్ట రాతి చిత్రాలను పరిరక్షించాలని ప్రముఖ పురావస్తు నిపుణుడు, విజయవాడ, అమరావతి కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం విజయవాడ, అమరావతి కల్చరల్ సెంటర్ చైర్‌పర్సన్ డాక్టర్ తేజస్విని, చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్యతో కలిసి పాండవులగుట్టను సందర్శించారు. ఈసందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ గుట్ట మీద గల మేకల బండ, ముంగిస బండ మీది మధ్య రాతియుగం, కొత్త రాతియుగం, ఇనుప రాతియుగం చిత్రాలు ఉన్నాయని తెలిపారు. అలాగే గొంతెమ్మ గుహలో ఉన్న శాతవాహనులకాలం నాటి చిత్రాలు, ఎదురు పాండువుల గుట్ట వద్ద మధ్య యుగపుచిత్రాలు, పోకిరీల చేష్టల వల్ల ప్రాధాన్యతను కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాతి చిత్రాలపై రసాయన రంగుల మూలంగా తీవ్రనష్టం వాటిల్లుతోందని తెలిపారు. పాండువులగుట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చే యాలని ప్రభుత్వాన్ని కోరారు. పర్యాటకులకు ఇక్కడి చారిత్రక విశేషాలను వివరించేందుకు గైడ్లను ఏర్పాటు చేయాలని, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఫొటోగ్రాఫర్ భరత్ రామినేని, శ్రీనాథ్, నవీన్ పాల్గొన్నారు.