ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు

ABN , First Publish Date - 2021-05-18T07:57:41+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు

  • 48 సర్కారీ దవాఖానల్లో ఏర్పాటు
  • 324 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి
  • రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్‌ కాలేజీలు
  • కొవిడ్‌ చికిత్సకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో
  • మందులు, భోజనం సహా అన్ని సౌకర్యాలు
  • పేద ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు పోవద్దు
  • కొవిడ్‌ చికిత్స ధరలపై 11 నెలల క్రితమే జీవో
  • వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్‌ 


హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు, వీటిలో 324 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. వీటిలో 16 మెట్రిక్‌ టన్నుల ప్లాంట్లు 6 యూనిట్లు, 8 మెట్రిక్‌ టన్నుల ప్లాంట్లు 15 యూనిట్లు, 4 మెట్రిక్‌  టన్నుల ప్లాంట్లు 27 యూనిట్లు హైదరాబాద్‌లో, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. అదనంగా మరో 100 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కొక్కటి 20 టన్నుల సామర్థ్యం గల 11 ఆక్సిజన్‌ ట్యాంకర్లను 10 రోజుల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను కోరారు. ఆక్సిజన్‌ సరఫరాలో పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. 


ఆక్సిజన్‌ సరఫరా విషయంలో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి ఉండొద్దన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై సోమవారం ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వీటిని సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్‌ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే అనుమతులు వచ్చిన నర్సింగ్‌ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సూచించారు. 


12 రీజినల్‌ సబ్‌ సెంటర్లు..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించేందుకు కొత్తగా 12 రీజినల్‌ సబ్‌సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వీటిని సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్‌, కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్‌, గద్వాలలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ రీజినల్‌ సబ్‌ సెంటర్ల పరిధిలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు యుద్ధప్రాతిపదికన మందులు అందించేందుకు వాహనాలను అద్దెకుగానీ, సొంత ప్రాతిపదికనగానీ వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. మందులు నిల్వ చేయడానికి సబ్‌ సెంటర్లలో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా చికిత్స కోసం పేద ప్రజలు ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయించవద్దని, డబ్బులు పోగొట్టుకోవద్దని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు సహా అన్నీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్‌ రంగంలోనైనా వైద్యం ఒక్కటేనని, కొవిడ్‌ చికిత్సకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని అన్నారు. పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌కు పూర్తిగా ఉచిత వైద్యంతోపాటు భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, వీటిలో ఆక్సిజన్‌ పడకలు 2,253, ఐసీయూ 533, సాధారణ పడకలు 4,140 ఉన్నాయని వెల్లడించారు. 


బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స పరికరాల కొనుగోలు..

కరోనా రోగులకు తర్వాతి దశలో బ్లాక్‌ ఫంగస్‌ అనే వ్యాధి సోకుతోందని, దానికి చికిత్స అందించేందుకు కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రి, సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రితోపాటు జిల్లాల్లోని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రుల్లో పరికరాలు, అవసరమైన మందులను సమకూర్చాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన 25 మైక్రో డీబ్రైడర్‌ మెషీన్లు, హెచ్‌డీ ఎండోస్కోపిక్‌ కెమెరాలను తక్షణమే తెప్పించాలన్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు  బెడ్ల కేటాయింపుతోపాటు నిర్ణీత ధరలను నిర్ణయిస్తూ 11 నెలల క్రితమే ప్రభుత్వం జీవో (248) విడుదల చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, తదితర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇదే తరహా నిబంధనలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఆ రాష్ట్రాల్లోనూ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పేషంట్లే తమ బిల్లులు చెల్లిస్తున్నట్లు తమ పరిశీలనలో తెలిసిందని అధికారులు వివరించారు.   


ఆ ఆస్పత్రుల్లో కొవిడ్‌ సేవలు..

వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 200 పడకల ఆస్పత్రిని తక్షణమే కొవిడ్‌ చికిత్సకు ఉపయోగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతోపాటు సింగరేణి, ఆర్టీసీ, సీఐఎ్‌సఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, రైల్వే, ఆర్మీ, ఈఎ్‌సఐ సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులను కొవిడ్‌ సేవలందించేందుకు వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. ఆస్పత్రుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, లాక్‌డౌన్‌, జ్వర సర్వే, కొవిడ్‌ కిట్ల పంపిణీ వంటి చర్యల వల్ల కొవిడ్‌ అడ్మిషన్లు తగ్గడం, డిశ్చార్జులు పెరగడం సంతోషకరమని సీఎం అన్నారు. కరోనా రోగుల్లో కోలుకుంటున్న వారి శాతం మెరుగ్గా ఉండటం మంచి పరిణామమన్నారు. జ్వర సర్వేలో లక్షణాలు గుర్తించిన వారిని వైద్య బృందాలు నిరంతరం సంప్రదిస్తూ, కనిపెట్టుకుంటూ ఉండాలని సూచించారు. కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-05-18T07:57:41+05:30 IST