6 నెలలకు సరిపడా ఆక్సిజన్
ABN , First Publish Date - 2021-05-09T08:26:26+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ సంక్షోభంలో.. ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఎదుర్కొంటున్న భారత్‌కు కీలక గల్ఫ్ దేశాలు బాసటగా నిలిచాయి.
- భారత్‌కు సరఫరాకు గల్ఫ్ దేశాల అంగీకారం
- యుద్ధ నౌకల ద్వారా అత్యవసర రవాణా
- సౌదీ నుంచి యథావిధిగా పెట్రోల్ కొనుగోలు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): కరోనా సెకండ్ వేవ్ సంక్షోభంలో.. ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఎదుర్కొంటున్న భారత్‌కు కీలక గల్ఫ్ దేశాలు బాసటగా నిలిచాయి. ఆరు నెలల పాటుఅవసరమైన మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామని హామీ ఇచ్చాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ దేశాల జాతీయ చమురు సంస్థలు ప్రత్యేక క్రయోజనిక్ ట్యాంకర్లలో వాణిజ్య ప్రాతిపదికన అందజేసేందుకు ముందుకొచ్చాయి. చమురు ఉత్పత్తిలో వినియోగించే నత్రజనిని నిల్వ చేయడానికి వాడే ప్రత్యేక శ్రేణి ట్యాంకర్లలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి భారత్‌కు అందించనున్నాయి. ఈ ట్యాంకర్లను విమానాల ద్వారా తరలించడం సాధ్యం కాదు. కాబట్టి నౌకల ద్వారా భారత్‌కు పంపిస్తున్నారు. కాగా, తమకు సాయంలా కాక వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సరఫరా చేయాలని గల్ఫ్ దేశాలను భారత్ కోరింది. మరోవైపు ఇప్పటివరకు ఆదానీ, అంబానీలకు చెందిన సంస్థలు వాణిజ్యపరంగా ఆక్సిజన్‌ను గల్ఫ్‌లోని దేశాల నుంచి కొని భారత్‌కు పంపుతున్నాయి.
ఈ విధంగా పంపిణీ, సరఫరాపై విమర్శలు వచ్చాయి. దీంతో కొనుగోలు బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), గెయిల్ సంస్ధలకు భారత్ అప్పగించింది. భారత నౌకా దళానికి చెందిన ఆరు యుద్ధ నౌకలు.. ‘సముద్ర సేతు’ అనే ప్రత్యేక ఆక్సిజన్ మిషన్‌పై ప్రస్తుతం అరేబియా సముద్ర జలాల్లో ఉన్నాయి. గల్ఫ్ నుంచి దిగుమతి అయ్యే ఆక్సిజన్ వీటి ద్వారా పశ్చిమ తీరంలోని గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని నౌకాశ్రయాలకు చేరుతుంది. తూర్పు తీరంలో విశాఖపట్టణం నౌకా స్థావరానికి చెందిన జలాశ్వ, ఐరావత్ యుద్ధ నౌకలు కూడా ఆక్సిజన్ రవాణా క్రతువులో ఉన్నాయి. జలాశ్వ.. సింగపూర్ నుంచి తీసుకొచ్చే ఆక్సిజన్ విశాఖ చేరితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. ఆ దిశగా జగన్ సర్కారు ప్రయత్నాలు చేసిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, గల్ఫ్ పెద్దన్న సౌదీ అరేబియా నుంచి చమురు కొనుగోలును తగ్గించాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం. ఆక్సిజన్ సంక్షోభంలో చూపిన వితరణకు ప్రతిగా.. ఎలాంటి కుదింపులు లేకుండా సౌదీ నుంచి చమురు కొనుగోలు చేయాలని భారతీయ చమురు సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్నారు.