ఉపాధ్యాయ దంపతులకు మళ్లీ ఆప్షన్లు!

ABN , First Publish Date - 2021-12-30T08:06:26+05:30 IST

బదిలీల విషయంలో ఉపాధ్యాయ దంపతుల నుంచి అభ్యంతరాలు

ఉపాధ్యాయ దంపతులకు మళ్లీ ఆప్షన్లు!

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): బదిలీల విషయంలో ఉపాధ్యాయ దంపతుల నుంచి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో వారి నుంచి మళ్లీ ఆప్షన్లు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దంపతులు ఒకే జిల్లాలో విధుల్లో కొనసాగడానికి వీలుగా కసరత్తు చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు బృందాల వారీగా ఏర్పడి ఆయా జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ దంపతుల అభ్యంతరాల అంశాన్ని పరిశీలిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయిస్తున్న విషయం తెలిసిందే.


అయితే, ఈ ప్రక్రియలో దంపతులను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారనే విషయంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మరోపక్క ప్రభుత్వం మాత్రం దంపతులను ఒకే జిల్లాకు కేటాయించాలనే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పొరపాట్లను సరిచేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం టీచర్ల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్‌ను కూడా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. డీఈవోల నుంచి ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ దంపతుల సమాచారాన్ని సేకరించారు.  


Updated Date - 2021-12-30T08:06:26+05:30 IST