కేసీఆర్‌ను ఓడించడమే నా జీవితాశయం తెలంగాణకు విముక్తి కల్పించడమే లక్ష్యం: రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-10-25T07:37:26+05:30 IST
వందల మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తన రాచరిక పోకడలతో నాశనం చేస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించి....

- వచ్చే ఏడాది డిసెంబరులో ఎన్నికలు ఖాయం
- కేసీఆర్‌ను వేధించడానికి అధికారం అక్కర్లేదు
- ఆరు నెలలు కూర్చొని ఫైళ్లు సిద్ధం చేస్తే చాలు
- కేసీఆర్ డిక్టేటర్ కాదు.. చీటర్
- నేనే ముఖ్యమంత్రి కావాలని అనుకోవడంలేదు
- అధిష్ఠానం నిర్ణయించిన వారికి మద్దతిస్తాను
- నాకు వ్యాపారం.. వ్యాపకం లేవు.. మందు తాగను
- పరోక్షంగా కేసీఆర్ వల్లే పీసీసీ అధ్యక్షుడినయ్యాను
- కేసీఆర్ శకం ఇక ముగిసినట్లే.. కార్యకర్తలు
- ఆయనను వద్దనే పరిస్థితిని కేటీఆర్ తీసుకొచ్చారు
- కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరుగుతుంది
- ఆయనకు అనుకూల పునరేకీకరణలో బీజేపీ
- హుజూరాబాద్ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాం
- ఇద్దరు సీఎంల పిలకలూ అమిత్ షా చేతిలోనే
- ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
కేసీఆర్‌ను ఓడించడమే తన జీవితాశయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ తనకు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిలో మార్పునకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో రేవంత్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
వందల మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తన రాచరిక పోకడలతో నాశనం చేస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించి.. ఆయన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే నా ఆశయం. కాంగ్రెస్ తరఫున నేనే ముఖ్యమంత్రిని కావాలని అనుకోవడంలేదు.
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
ఆర్కే: చాలా రోజుల తరువాత కలుస్తున్నాం. టెన్షనా? సాధించానన్న సంతోషం ఉందా?
రేవంత్: దీనిని (పీసీసీ అధ్యక్షుడు కావడాన్ని) రెండు రకాలుగా చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ పరంగా అత్యంత పెద్ద విజయం. రాష్ట్రాలకు సీఎంలు కావడమైనా సులభమేమో కానీ, కాంగ్రె్‌సలో ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడు కావడం ఆషామాషీ కాదు.
ఆర్కే: చాలా స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ వ్యవహారాలను అర్థం చేసుకొని, హేమాహేమీలను కాదని అధ్యక్ష పదవి సాధించారు కదా?
రేవంత్: అది నా శక్తి అని నేను అనుకోవడంలేదు. రాహుల్‌గాంధీ ప్రత్యేకమైన ఆలోచనతో సోనియాగాంధీని కన్విన్స్ చేసి, ప్రస్తుతం తెలంగాణ పరిస్థితుల్లో బోల్డ్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఒప్పించారు. ఆయన వ్యక్తిగతంగా చొరవ చూపి ముందుకు తీసుకెళ్లారు. ఇందులో నా ప్రయత్నం చాలా తక్కువ. ఇక్కడ కేసీఆర్ సృష్టించిన అగాధం, కాంగ్రెస్‌లోని అగ్ర నాయకత్వాన్నంతా తీసుకెళ్లి దొడ్లో కట్టేయడంతో ఇక్కడ వ్యాక్యూమ్ వచ్చింది. ఒకరకంగా నాకు ఈ అవకాశం రావడానికి పరోక్షంగా కేసీఆరే కారణం. ప్రశ్నించేవారే ఉండొద్దన్న పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయం లేకుండా, ప్రశ్నించేవారు లేకుండా చేయడం, పెద్ద నాయకులను ఓడగొట్టడం, కేసులతో బెదిరించడంతో.. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అన్న ఉద్దేశంతో కొందరు హుందాగా పక్కకు తప్పుకొన్నారు. దీంతో ప్రశ్నించేవారు ఎవరో ఒకరు ఉండాలన్న పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ నా మీద మరీ కసితో వ్యవహరించి, ఇంట్లో పడుకున్నా లాక్కెళ్లి బజారున పడేసి, జైల్లో పెట్టించి, రోడ్లమీద పడేసి.. 108 కేసులు పెట్టారు.
ఆర్కే: రోజూ పొద్దున కేసీఆర్‌కు దండం పెట్టుకుంటున్నారా?
రేవంత్: నేనేమో కానీ, నావల్ల వీడొకడు వచ్చాడని ఆయనకు ఆయనే చెంపలు వేసుకోవాల్సి ఉంటుంది. రాహుల్‌గాంధీ ఒక గొప్ప నమ్మకంతో నాకు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ అధిష్ఠానం మారిన వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ నిర్ణయాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. అవసరమైతే సంప్రదాయాలకు భిన్నంగా కూడా వెళతామని చాటినట్లయింది. పంజాబ్‌లో ఒక మహారాజును తప్పించి దళితుణ్ని సీఎంను చేయడం గొప్ప నిర్ణయం. అణగారిన వర్గాలు, పేదల పట్ల నాయకుడిగా రాహుల్‌గాంధీ నిబద్ధతకు ఇది నిదర్శనం. అరాచకం పెరిగిపోయినప్పుడు పార్టీలో కొట్లాడడానికి ఎటువంటి వెసులుబాటు కల్పించాలన్న ఆయన నిర్ణయాల్లో గొప్పతనం. ఇవి ఆషామాషీ పరిణామాలేమీ కాదు. కేసీఆర్‌కు సంబంధించినంత వరకు స్వయంకృతాపరాధం.
ఆర్కే: అందరూ చంద్రబాబు ఇప్పించారని అంటున్నారు.. కానీ, కేసీఆర్ పుణ్యానే వచ్చినట్లుంది!
రేవంత్: కేసీఆర్ సృష్టించిన వాతావరణం ఇందుకు కారణం. ఈ విషయంలో ఏకీభవిస్తాను.
ఆర్కే: చంద్రబాబు.. రాహుల్‌గాంధీకి ఏమైనా చెప్పారా?
రేవంత్: సాధారణంగా ఎవరైనా నాయకుడు ఓ పార్టీని వీడి వెళ్లేటప్పుడు అప్పటిదాకా పనిచేసిన పార్టీని, ఎదుగుదలకు కారణమైన నాయకులను దూషించి వెళ్లిపోతాడు. నేను అలా చేయలేదు. నా ఎదుగుదలకు టీడీపీయే కారణం. దానిని చూసే నన్ను కాంగ్రెస్ ఆహ్వానించింది. నేను ఉన్న పరిస్థితులను, ఆ పార్టీలో పనిచేయలేని స్థితిని చంద్రబాబుకు గౌరవంగా వివరించి పార్టీని వీడాను. ఆ తరువాత అందరూ ఊహించినట్లు చిల్లర మాటలు మాట్లాడకుండా నా స్థానంలో నేనున్నాను. నేను ఉన్న పార్టీకి పనిచేసుకుంటూ వెళ్లాను. దీంతో నా వెనక చంద్రబాబే ఉన్నారని, లేదంటే నేను ఆయనను తిట్టేవాడిని కదా అంటున్నారు.
ఆర్కే: టీడీపీ పట్ల ఇంకా సానుభూతితో ఉన్న కొందరి ఓట్లు మీవల్ల కాంగ్రెస్‌కు వస్తాయనే వాదన ఉంది..!
రేవంత్: మల్కాజిగిరి ఎంపీగా గెలవడంలో అది పనికొచ్చింది. నేను గెలవకపోతే రాజకీయ జీవితమే ఉండేదికాదు. సర్పంచ్‌గా గెలిచేందుకు కూడా కష్టపడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇక్కడ చంద్రబాబు పాత్రలేదు. రాష్ట్రంలో ఇప్పుడున్నది.. కేసీఆర్ అనుకూలం, కేసీఆర్ వ్యతిరేకమే. వ్యతిరేకంగా నేను, బండి సంజయ్, కిషన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, షర్మిల, ప్రవీణ్‌కుమార్ వంటి ఐదారు మందిమి లైన్‌లో ఉన్నాం. ఎవరికి వారు పాదయాత్రలు, కార్యక్రమాలు చేస్తున్నాం. వీరిలో ఎవరిని తెలంగాణ సమాజం ఆదరిస్తుందన్నది ఇంకా కొంతకాలమైతే తెలుస్తుంది. ఇంకా కొంత ప్రయాణం సాగాల్సి ఉంటుంది. మా కార్యక్రమాల వల్ల కేసీఆర్ కూడా విధిలేని పరిస్థితుల్లో బయటికి వస్తున్నారు. దళితబంధు వంటి పథకాలు తెస్తున్నారు. ఫామ్‌హౌ్‌సలో పడకోకుండా యాక్టివ్ అయ్యాడు. రాహుల్ గాంధీ నిర్ణయం తెలియగానే ఎమ్మెల్యేలు, నాయకులతో మాట్లాడడం, సమీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఈ రకంగా రాహుల్‌గాంధీ సక్సెసయ్యారు.
ఆర్కే: రానున్న రోజుల్లో రేవంత్‌రెడ్డి కూడా పార్టీ మీద రాజశేఖర్‌రెడ్డి అంతటి పట్టు సాధిస్తారనే అభిప్రాయాలున్నాయి?
రేవంత్: ఆయనకు అధికారం వచ్చాక పట్టు దొరికింది. అప్పటిదాకా ఆయనకు అందరూ సవాల్ చేసినవారే. బషీర్‌బాగ్ కాల్పుల తరువాత చంద్రబాబు దిగిపోవడం ఖాయమైంది. దీంతో అందరూ నంబర్‌వన్ స్థానం కోసం పోటీపడ్డారు. కానీ, రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ద్వారా తనకు పోటీ అన్నదే లేకుండా చేసుకున్నారు. పార్టీలో 1 నుంచి 100వ స్థానం వరకు ఆయనే అయ్యారు. అధికారం రావడం, ఎక్కువ మంది ఎంపీలను గెలిపించడంతో అధిష్ఠానం కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ప్రస్తుతం అన్నీ ప్రతికూల పరిస్థితులే. అటు కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్రంలో అధికారం రావాలంటే ఒక రకంగా యుద్ధమే చేయాలి. కేసీఆర్ డిక్టేటర్ కాదు.. చీటర్. అప్పుడే కాళ్లు పట్టుకుంటారు. వెంటనే జుట్టు పట్టుకుంటారు.
ఆర్కే: మీరు ఆయన స్కూల్‌లో చదివి వచ్చినవాడిలా ఉన్నారు..!
రేవంత్: టోటల్‌గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. అబ్జర్వేషన్ లేకుండా ఏదీ చేయలేం. ప్రత్యర్థి బలాలు, బలహీనతలు తెలియకుండా ఏమీ చేయలేరు కదా! ఈ ఒక్క అంశంలో మిగతా వారికంటే నేను కాస్త బెటరేమో! జనంలో బలం ఉందన్నప్పుడే పట్టు వస్తుంది.. నాయకులను మెప్పించే ప్రయత్నం చేస్తే జీవితం ముగుస్తుంది. కార్యకర్తల కోసం పని చేస్తే జీవితాంతం పని చేయొచ్చు. నేను కార్యకర్తల మనిషిని. వారు ఏం చేస్తే మేలు జరుగుతుందో మనకు స్పష్టత ఉంటుంది. నాయకుడు తనకు ఏం కావాలో చెప్పడు.
ఆర్కే: రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించడానికి అనుసరించిన మెళకువలు, కేసీఆర్ తన ప్రత్యర్థులను రాచిరంపాన పెట్టడానికి అనుసరించిన మెళకువలను ఒంట బట్టించుకున్నావన్నమాట!
రేవంత్: అబ్జర్వేషనైతే ఉంది.
ఆర్కే: ఫోన్‌లో ఎవరికీ అందుబాటులో ఉండవంటారు?
రేవంత్: ఫోన్లు నేను ఎత్తను. ఎవరినీ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మన పక్కనే ఉండి ప్రాణమిస్తానన్న వాడు.. కొద్దిసేపటికే వెళ్లి టీఆర్‌ఎ్‌సలో చేరే పరిస్థితులున్నాయి. నాకు వ్యాపారం, వ్యాపకం లేవు. మందు తాగను. ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటాను.
ఆర్కే: తెలంగాణ సమాజంలో మందు తాగడం పెద్ద విషయమేమీ కాదు కదా?
రేవంత్: చిన్నప్పటి నుంచి మా గ్రామంలో, మా కుటుంబంలో ఉన్న పరిస్థితుల కారణంగా నాకు అలవాటు కాలేదు. ఇప్పుడు నాయకుడయ్యాక పది మంది దృష్టిలో గౌరవంగా ఉండాలన్న ఆలోచనతో ఉన్నాను. అనవసర విషయాలకు ఫోన్ వినియోగాలే పెరిగిపోయాయి. ఎంతో మంది నాయకుల ఫోన్ కాల్ రికార్డులు బయటకొస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా నమ్మకంలేని పరిస్థితుల్ని కేసీఆర్ సృష్టించారు. కేసీఆర్ ఏం చేస్తారో తెలియదుగానీ.. కాంగ్రెస్ జెండా కప్పుకొని చచ్చిపోతానన్నవారిని, టీడీపీ జెండా కప్పుకొని చచ్చిపోతానన్న వారిని గంటలోపే తీసుకెళ్లి టీఆర్‌ఎస్ కండువా కప్పుతారు.
ఆర్కే: ఏం చేస్తారో తెలియదా? (నవ్వుతూ)
రేవంత్: ఎవరి గురించేమోగానీ.. మండవ వెంకటేశ్వర్‌రావు టీఆర్‌ఎస్ కండువా కప్పుకొంటే రెండు రోజులు నాకు బాధ కలిగింది. ఇలాంటివాళ్ల ఎత్తులు, జిత్తుల నుంచి తప్పించుకోవడం తేలిక కాదు. తెలంగాణ పోరాట తత్వాన్ని దిగజార్చారు. వందల ఏళ్లు తెలంగాణకు ఉన్న డీఎన్‌ఏను చంపేసి వ్యవస్థలను, వ్యక్తులను సర్వనాశనం చేశారు. ఈ క్షణమే ఆయనను ఓడించి అడవులకు పంపిస్తే బాగుండునన్నంత కసి ఉంది.
ఆర్కే: రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందని షర్మిల అన్నారు. ఓటుకు నోటు కేసులో ఏమైనా చేస్తే?
రేవంత్: ఎవరైనా చట్ట పరిధిలో ఉండాల్సిందే. సర్పంచ్ నుంచి ఎంపీ దాకా ఓట్లు వేయాలంటూ ఓటర్లకు డబ్బులిస్తున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులేవీ పీసీ యాక్ట్ కిందికి రాకుండా నా ఒక్క కేసే ఎందుకు పోయింది?
ఆర్కే: నీ ఎదుగుదలకు ప్రమాదం లేదా?
రేవంత్: ఏమీ లేదు. కోర్టు పరిధిలో ఉంది. కేసీఆర్ ఎవరి శరణుజొచ్చినా చరిత్ర, కాలం సమాధానం చెబుతాయి. షర్మిల సొంత అన్నపై ఉన్న లెక్కలేనన్ని కేసుల గురించి మాట్లాడకుండా నా కేసు గురించి మాట్లాడితే ప్రయోజనం లేదు. తెలంగాణలో ఆమె పార్టీ నిలదొక్కుకోవాలంటే ముందుగా ఏపీతో జల వివాదాలపై మాట్లాడాలని సూచిస్తున్నాను.
ఆర్కే: రెండు రాష్ట్రాలు కలిసి తమ పిలకను కేంద్రం చేతిలో పెట్టాయి. షర్మిల తెలంగాణలో అడుగు పెట్టడం వల్లే కేసీఆర్ ఈ పరిస్థితికి కారణమయ్యారని అనుకోవచ్చు కదా?
రేవంత్: చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్ ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు అక్రమ ప్రాజెక్టులు అనాల్సిన అవసరం ఉండకపోయేది. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం ఇది.
ఆర్కే: ప్రపంచంలోని అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఉండవు కదా?
రేవంత్: కల్వకుర్తి ప్రాజెక్టును రాజశేఖర్‌రెడ్డి మొదలుపెడితే జగన్ అక్రమ ప్రాజెక్టు అంటున్నారు. కాళేశ్వరం ప్రారంభానికి కేసీఆర్ పిలిస్తే వచ్చారు. ఇప్పుడు అక్రమం అంటున్నారు. ప్రతి విషయంలో నూ రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. అనుమతుల్లేని ప్రాజెక్టులు కడుతున్నందుకు ముఖ్యమంత్రులను ప్రాసిక్యూట్ చేసే వీలుంటుంది. ఆ రకంగా ఈ ఇద్దరు సీఎంల పిలకలు అమిత్ షా చేతిలో ఉన్నాయి. అమిత్‌షా తలచుకుంటే కేసీఆర్‌ను ఒక్క నిమిషంలో బేడీలు వేసి తీసుకుపోవచ్చు. దేశంలో సొంత పార్టీ ముఖ్యమంత్రుల మీద, ప్రతిపక్ష నేతల మీద, వారి కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టిన ప్రధాని మోదీ, అమిత్ షా.. కేసీఆర్, ఆయన కుటుంబం మీద మాత్రం ఒక్క కేసు కూడా పెట్టడంలేదు. దీనిపై కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. గతంలో ఉన్న సహారా, ప్రావిడెంట్ ఫండ్ కేసులపై సీబీఐ చార్జిషీట్ వేయడంలేదు. ఈ ఫైలు కోసం మా లాయర్లు కోర్టులో రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా దొరకడంలేదు. ఎవరూ తనవైపు చూడకుండా చేయడంలో కేసీఆర్ సమర్థుడు. ఇలాంటి బీజేపీ తామే ప్రత్యామ్నాయమని ఎవరిని భ్రమల్లో పెడుతుంది?
ఆర్కే: దీనిని బట్టి బీజేపీ.. కాంగ్రెస్‌కు పోటీ కాదంటారు?
రేవంత్: బీజేపీ అనేది కేసీఆర్‌ను ఇక్కడ అధికారంలో ఉంచడానికి పనికొచ్చే పరికరం. కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంచడానికి పనికొచ్చే పరికరం కేసీఆర్. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారాన్ని కాపాడుకుంటుందో తెలుసుకునేందుకు కేసీఆర్ మూడు సర్వే ఏజెన్సీలకు బాధ్యత అప్పగించి, ఆ నివేదికను తీసుకెళ్లి మోదీ, అమిత్‌షాకు ఇచ్చారు. సమాజ్‌వాది పార్టీని ఓడించేందుకు ఎంఐఎంను పాచికలా వాడుకుంటరు. ఎంఐఎం తరఫున కేసీఆరే వ్యవహరిస్తారు. మతసామరస్యం ఉండాలని చెప్పే అసదుద్దీన్ తన ప్రచారాన్ని అయోధ్యలో మొదలుపెట్టారు. ఈ నలుగురు కలిసి దేశంలో మతాలు కలవకుండా చేస్తున్నారు.
ఆర్కే: ఎన్నికలు వచ్చే ఏడాదే వస్తాయని అంటున్నారు?
రేవంత్: వంద శాతం వచ్చే ఏడాదే వస్తాయి. ముందస్తు లేదని కేసీఆర్ అంటున్నారంటే ఉన్నాయనే అర్థం. పరిపాలనపై దృష్టి పెట్టాల్సిన కేసీఆర్.. పార్టీపై దృష్టి పెట్టారు. ఎన్నికల ముందు పార్టీలు చేసే ప్రక్రియను చేపట్టారు. పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎదురుగా కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది.
ఆర్కే: మోత్కుపల్లి నర్సింహులుకు మహర్దశ వచ్చింది!
రేవంత్: కండువా కప్పుకొన్నరోజే పండుగ. మోత్కుపల్లిని కేసీఆర్ తిట్టకుండానే తిట్టారు. పాతవేమీ మరిచిపోలేదు. సొంత ఆలోచన చేసేవారికి కేసీఆర్ బాధ్యతలు ఇవ్వరు.
ఆర్కే: కేసీఆర్, బీజేపీల ధనబలం, కండబలాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుంది?
రేవంత్: తెలంగాణలో ఇవన్నీ రెండో ప్రాధాన్య అంశాలు. మొదటి ప్రాధాన్యమైన విషయం ప్రజల వద్దకు వెళ్లి కూర్చోలేని అంశం. ప్రజలతో వారికి గ్యాప్ వచ్చింది. నేను నేరుగా వారి వద్దకు వెళతా. వారితో కలిసి కూర్చుంటా. నా బట్టలు కూడా సాధారణంగానే ఉంటాయి. ప్రతి ఒక్కరూ మనవాడేనన్న అభిప్రాయం కలిగిస్తా.
ఆర్కే: కేసీఆర్ తెలివితేటలు వచ్చాయి..
రేవంత్: వ్యాపారం ద్వారా పైకొచ్చాం. వ్యాపారానికి అధికారం అవసరంలేదు. 25ఏళ్ల క్రితమే బిల్డింగులు కట్టాం.
ఆర్కే: బ్లాక్‌మెయిలర్ అని ఆరోపిస్తుంటారు కదా?
రేవంత్: నేనెప్పుడూ ప్రతిపక్షంలోనే ఉన్నాను. బ్లాక్‌మెయిల్ చేస్తే ప్రభుత్వాలు నన్ను లోపల వేయకపోయేవా? ప్రభుత్వాలకు కూడా దొరకనంత తెలివితేటలున్నాయా? తప్పు చేసినవాడు తప్పించుకునేందుకు నేను బ్లాక్‌మెయిల్ చేశానని ఆరోపిస్తుంటాడు. కొన్నిసార్లు అసూయ, ద్వేషంతో అంటుంటారు. వారు చెప్పేది నమ్మితే ప్రజలు ఆదరించరు. నేను అధికారంలో లేకపోయినా.. పిలుపు ఇస్తే వేల మంది తరలివస్తున్నారు. ఇదొక్కటి చాలు నన్ను ముందుకు నడిపించడానికి. మీటింగ్‌ల పేరుమీద భారీగా కూడబెట్టారని అనేవారూ ఉన్నారు.
ఆర్కే: కేసీఆర్‌ను కూడా వేల కోట్లు అంటున్నారు.. అలా ఉంటాయా? హెటిరో బ్లాక్‌మనీగా చెప్పిందంతా కలిపి 150 కోట్లే దొరికింది కదా!
రేవంత్: రెమ్‌డెసివర్ బ్లాక్‌మార్కెట్‌పై హెటిరో గురించి నేను ముందే చెప్పాను. ఇప్పుడది బయటపడింది కదా? ప్రభుత్వం తేలు కుట్టిన దొంగలా ఉంది. అది పేద ప్రజల సొమ్ము. కరోనా సమయంలో పేద ప్రజలను పీల్చి పిప్పి చేసి, బ్లాక్‌లో అమ్మి వసూలు చేసుకున్న సొమ్ము. ప్రభుత్వానికి, కేటీఆర్‌కు వారితో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ నేను చెబితే అప్పుడు కూడా నేను బ్లాక్‌మెయిల్ చేస్తున్నానన్నారు.
ఆర్కే: కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ మాత్రమే సీఎం అవుతాడని చెప్పొచ్చా?
రేవంత్: అదేం లేదు. నేనే సీఎం కావాలని కోరుకోవడంలేదు. పార్టీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారని నిర్ణయిస్తే వారి పేరును నేనే మొదట ప్రతిపాదిస్తాను. అధికారం నన్ను ఆకర్షించదు.
ఆర్కే: కేసీఆర్ సంగతి తేల్చాలన్న కోరిక నెరవేరాలంటే అధికారం కావాలి కదా?
రేవంత్: కేసీఆర్ సంగతి తేల్చాలంటే ఆయనను వేధించాలన్న ఆలోచన లేదు. అధికారం ముందు కేసీఆర్ చిన్న పిచ్చుక. ఒక వ్యక్తిని సాధించడానికి అధికారం అవసరమా?
ఆర్కే: ఆయన ఇప్పుడు అదే పని చేస్తున్నారని మీరు అంటున్నారు కదా?
రేవంత్: నన్ను చేస్తున్నాడు.. ఆయన పిచ్చోడు. ప్రజలు వి శాల దృక్పథంతో అధికారం ఇచ్చారు. మేలు చేస్తారన్నఆలోచనతో ఇచ్చారు. నచ్చనివారిని వేధించడానికి కాదు.
ఆర్కే: కేసీఆర్‌ను ఓడించాలనే పట్టుదల ఉంది కదా?
రేవంత్: వందశాతం ఉంది. నా జీవితాశయం అదే. నాకు, నా కుటుంబానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. వందల మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణను తన కుటుంబం కోసం, రాచరిక పోకడల కోసం వాడుకుంటూ నాశనం చేస్తున్న కేసీఆర్ నుంచి విముక్తి చేయడమే లక్ష్యం.
ఆర్కే: బక్క కేసీఆర్‌ను పొట్టివాడు కొట్టబోతున్నాడన్నమాట!
రేవంత్: చరిత్రలో చాలా మంది పొట్టివాళ్లు చాలా సాధించారు. ప్రజలు ఇచ్చిన అద్భుత అవకాశాన్ని తన చర్యలతో కేసీఆర్ చేజార్చుకున్నారు. కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు. నన్నూ వేధించారు. కానీ, సమాజానికి ఇది మంచిదికాదు.
ఆర్కే: 40, 50 ఏళ్ల కిందటి పోకడలు తెలంగాణలో మళ్లీ వచ్చాయంటారా?
రేవంత్: ఒకప్పుడున్న ఫ్యూడల్ వ్యవస్థను మళ్లీ తెచ్చారు. గ్రామం మొత్తం తన కాలికింద చెప్పులా ఉండాలనే ఆలోచనతో ఉన్న గ్రామపెద్ద లాగా తెలంగాణను కూడా కేసీఆర్ చూస్తున్నారు. దేనికైనా పరిమితి ఉండాలంటాను.
ఆర్కే: భాషకు కూడా హద్దు ఉండాలి కదా?
రేవంత్: వాస్తవమే. దీనికి ఎక్కడ ఫుల్‌స్టాప్ పడుతుందో అర్థం కావడంలేదు.
ఆర్కే: ఇక్కడైనా ఆపండి.. మీరు, మల్లారెడ్డి తిట్టుకున్నారు కదా?
రేవంత్: మల్లారెడ్డిని నేనేమీ తిట్టలేదు. కేటీఆర్ తిట్టమన్నాడని ఆయనే మళ్లీ చెప్పి పంపించారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రజల సమస్యలను వ్యక్తపరిచే క్రమంలో కొన్నిసార్లు గట్టిగా మాట్లాడవలసి వస్తుంది. ప్రభుత్వంలో ఉన్నవారు సంయమనంతో వాటిని పరిష్కరించాలి. కానీ, అంతకంటే ఎక్కువ తిడతా, కొడతా.. అంటున్నారు.
ఆర్కే: ఈ మధ్య కేసీఆర్‌ను కొంత పక్కన పెట్టి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు... ఇక మేమిద్దరమే ఢీకొనబోతున్నామని అనుకుంటున్నారా?
రేవంత్: కేసీఆర్ ముగిసిన శకం. ఆ పార్టీవారే కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేద్దామని అంటున్నారు. కేసీఆర్ వద్దు అనే పరిస్థితిని కేటీఆర్ తీసుకొచ్చారు. కేసీఆర్ కూడా ఇక చాలని అనుకుంటున్నారు. చివరి దశలో కాలక్షేపం చేయడానికన్నట్లుగా గుడి కట్టిస్తున్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి యాదాద్రికి రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదో ఒక రకంగా మళ్లీ రాజ్యం తెచ్చి కొడుక్కి ఇచ్చి ఇంటికిపోదామని అనుకుంటున్నారు.
ఆర్కే: హుజూరాబాద్ ఉప ఎన్నికను వదిలేసినట్టేనా?
రేవంత్: ఉప ఎన్నికను సీరియ్‌సగా తీసుకుంటున్నాం. 40 ఏళ్ల భవిష్యత్తు ఉన్న విద్యార్థి నాయకుడిని నిరుద్యోగులకు ప్రతినిధిగా అభ్యర్థిగా నిలబెట్టాం. ప్రతి ఇంట్లో ఒక ఓటును కాంగ్రె్‌సకు వేయాలని కోరుతున్నాం. విద్యార్థులు, నిరుద్యోగులు ఓట్లు వేసినా మాకు 60 వేల ఓట్లు వస్తాయి.
ఆర్కే: బీజేపీ నేతలంతా కాంగ్రెస్‌లో చేరతారని కేటీఆర్ అన్నారు?
రేవంత్: రాజకీయాల్లో వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయి. నా ప్రత్యర్థి నన్ను చూసి భయపడుతున్నాడంటే నేను పాక్షికంగా విజయం సాధించినట్లే కదా! హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత లేదు. టీఆర్‌ఎ్‌సకు ఎదురుకానున్న ఓటమికి కేటీఆర్ ముందుగానే కారణాలు వెతుక్కుంటున్నారు.
ఆర్కే: ఈటల, కేసీఆర్ మధ్య పోటీగానే ఎన్నికను ప్రజలు చూస్తున్నారు కదా?
రేవంత్: ఈ ఎన్నిక తరువాత టీఆర్‌ఎస్‌పై కేసీఆర్ పట్టు కోల్పోతారు. రాజేందర్ ఎదురు తిరిగి నిలబడ్డడు. ముందు ముందు చాలామంది తిరగబడతారు. ఆ భయం కేసీఆర్‌ను వెంటాడుతుంది. అందుకే విజయగర్జన పెడుతున్నారు. ఆ భయంతోనే ముందస్తు ఎన్నికలు వస్తాయి.
ఆర్కే: ముందస్తుకు మీరు కూడా రెడీగా ఉన్నారా?
రేవంత్: జిల్లాలు తిరిగి సభలు పెట్టి ప్రజల్లోకి వెళుతున్నది అందుకే. మేం ఏం చేస్తామన్నది వారికి చెబుతున్నాం. వచ్చే ఏడాది డిసెంబరులో ఎన్నికలు ఖాయం. 2022 ఆగస్టు 15న భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం తరువాత అసెంబ్లీ సమావేశం పెట్టి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. గుజరాత్ ఎన్నికలతోపాటే తెలంగాణకూ ఎన్నికలు నిర్వహించే పరిస్థితిని ఎన్నికల కమిషన్‌కు కల్పిస్తారు. నవంబరు 15న విజయగర్జనతో కేసీఆర్, డిసెంబరు 9న విద్యార్థి, నిరుద్యోగ గర్జనతో మేము ఎన్నికల శంఖాన్ని పూరించబోతున్నాం. ఆ తరువాత ఎన్నికలకు ఇక 365 రోజులే ఉంటాయి.
ఆర్కే: పొత్తులు ఉంటాయా?
రేవంత్: పొత్తులపై జాతీయ స్థాయిలో నిర్ణయం జరుగుతుంది. నా వరకైతే.. కేసీఆర్ వ్యతిరేకంగా, విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కలిసివచ్చే పార్టీలు, శక్తులు, వ్యక్తులు, సంస్థలన్నింటినీ కలుపుకొని పోవాలన్నది నా ఆలోచన. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి. టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కేసీఆర్ అనుకూల పునరేకీకరణలో ఉంటాయి. వారిద్దరినీ వేర్వేరుగా చూడొద్దు.
ఆర్కే: 2014లో కాంగ్రెస్‌వారే ఇంటికో సీఎం అభ్యర్థి తయారై చెడగొట్టుకున్నారు కదా?
రేవంత్: అది కరెక్టే అనుకున్నా.. కేసీఆర్‌కు రెండుసార్లు అధికారం ఇచ్చి ప్రజలు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ కూలీయే ఇచ్చారు కదా! సోనియమ్మ రాజ్యం తీసుకొస్తాం. తెలంగాణ సమాజం సోనియమ్మకు కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఉంది. ఆమెకు ముడుపు చెల్లించాలి. ఈ లక్ష్యంలో నేను వెనక్కి తిరిగి చూడను.
ఆర్కే: కాంగ్రెస్ పార్టీలో మిగతా వారిని సమన్వయం చేసుకోవడం కష్టం కదా? ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండనే స్టేట్‌మెంట్ ఎలా ఇవ్వగలిగావు?
రేవంత్: నాకు స్పష్టత ఉంది. మిగతా వారికి కూడా స్పష్టత ఉండాలని కోరుకుంటున్నా. కేసీఆర్‌తో చేసేది యుద్ధం. ఈసారి ఎన్నికల్లో అధికారం రాకపోతే చాలామందికి వయసు, రాజకీయం ఏవీ సహకరించవు. అందరికీ అదే చెబుతున్నా. ఆ తరువాత మనం మనం తిట్టుకున్నా ప్రయోజనం ఉండదని చెబుతున్నా. సర్ది చెప్పే బాధ్యతను జానారెడ్డి లాంటి వారు చూసుకుంటారు. నేనైతే పరిగెత్తుతా. నాతోపాటు పరిగెత్తలేనివారు కిందపడిపోతారు.
ఆర్కే: అందరికీ క్లారిటీ వచ్చినా.. నల్లగొండ వారికి రానట్టుంది?
రేవంత్: నల్లగొండ వారికీ క్లారిటీ ఉంది. రాజశేఖర్‌రెడ్డికి కూడా 80 శాతమే మద్దతు లభించింది. కాంగ్రె్‌సలో యాభై శాతం సమర్థిస్తే చాలు. ముందుకెళ్లగలుగుతాం.
ఆర్కే: ముక్కోణపు పోటీలో కాంగ్రెస్, బీజేపీ సమాంతరంగా ఉంటే కేసీఆర్‌ను ఏం చేయగలుగుతారు?
రేవంత్: 2014లో 65 శాతం ఓటర్లు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నా.. అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత అన్ని రకాల ప్రయత్నాలు చేసి 2018లో గెలిచారు. ఇంకా రెండున్నరేళ్లు అధికారంలో ఉండగానే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రజలే తీర్పునిస్తారు. కేసీఆర్ కక్షతోనో, దురాశతోనో, దుర్మార్గంతోనో నన్ను చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేశారు. దానితో నేనే పైకి లేచాను. నా పేరు ప్రస్తావించనంత మాత్రాన నన్ను ఎంత వేధిస్తున్నారో ప్రజలకు తెలియదా? మమ్మల్ని కుక్కలు, నక్కలు అని తిట్టడం, మేము మాట్లాడితే తప్పుబట్టడం జరగడంలేదా? దళితుణ్ని ముఖ్యమంత్రిని ఎందుకు చేయడంలేదని కేసీఆర్‌ను కేటీఆర్ అడగొచ్చు కదా!