వంద కోట్లు.. దొంగ ఓట్లు..ఇవే పల్లాను గెలిపించాయి

ABN , First Publish Date - 2021-03-21T08:34:10+05:30 IST

పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖర్చు పెట్టిన రూ. వంద కోట్లు, అక్రమంగా వేయించుకున్న దొంగ ఓట్లు.. ఇవే.. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాయని, తనవైపున్న పట్టభద్రుల నిర్ణయాన్ని తారుమారు చేశాయని వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు.

వంద కోట్లు.. దొంగ ఓట్లు..ఇవే పల్లాను గెలిపించాయి

‘సాగర్‌’లో పోటీపై త్వరలో నిర్ణయం: తీన్మార్‌ మల్లన్న

నల్లగొండ, మార్చి 20: పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖర్చు పెట్టిన రూ. వంద కోట్లు, అక్రమంగా వేయించుకున్న దొంగ ఓట్లు.. ఇవే.. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాయని, తనవైపున్న పట్టభద్రుల నిర్ణయాన్ని తారుమారు చేశాయని వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు. నల్లగొండ  కౌంటింగ్‌ కేంద్రం వద్ద శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం మూడు శాతం ఓట్లతో మాత్రమే గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్న ఆయన.. ఇకనైనా దొంగ ఓట్ల ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. ప్రగతిభవన్‌ సహా యావత్‌ తెలంగాణ దృష్టీ నల్లగొండ కౌంటింగ్‌ కేంద్రంపైనే నిలిచిందన్నారు. జాతీయ, రాష్ట్ర పార్టీలను కాదని.. సామాన్యుడినైన తనను తెలంగాణ ప్రజలు భుజాలకెత్తుకున్నారని, తన గెలుపుకోసం ఓ నిండు గర్భిణి తన ఆపరేషన్‌ను సైతం వాయిదా వేసుకుందని చెప్పారు. కాలు విరిగిన ఓ తల్లి, ఆస్ర్టేలియా వెళ్లాల్సిన ఓ సోదరుడు తన కోసం తమ పనులు వాయిదా వేసుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వంద శాతం ప్రజలే గెలిచారని, ఈ దిశగా మల్లన్న విజయం సాధించాడని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌ గోడలు బద్దలుకొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, అప్పుడు ఓ సామాన్యుడ్ని సీఎం కుర్చీలో కూర్చోబెడతామని చెప్పారు. అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకుని మరీ చివరి వరకు పోరాటం చేశామన్నారు. ఇకపై సామాన్యుడు కూడా ధైర్యంగా రాజకీయాల్లోకి రావచ్చని తనకు లభించిన ఓట్ల ద్వారా తెలిసిందని, డబ్బులున్న వాడిదే రాజకీయం అన్న వాదం ముగిసిందని చెప్పారు. రాబోయే రోజుల్లో పది లక్షల ప్రశ్నించే గొంతుకలను తయారు చేస్తామన్నారు. సాగర్‌ ఉప ఎన్నికలో తాను పోటీచేయాలా? లేదా వేరొకరిని నిలబెట్టాలా? అనేది త్వరలోనే నిర్ణయిస్తామని మల్లన్న తెలిపారు. 


‘తీన్మార్‌’తో మొదలై.. 

తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌ కుమార్‌) ఈ ఎన్నికల్లో గెలుపు తీరం చేరలేక పోయినప్పటికీ, అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానంలో నిలిచిన తీరు మాత్రం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఓ టీవీ చానల్‌లో ‘తీన్మార్‌’ అనే కార్యక్రమం ద్వారా ‘మల్లన్న’గా ప్రాచుర్యం పొందిన ఆయన.. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. చివరి వరకు పోరాడారు. కానీ, గెలుపు అంచున నిలిచిపోయారు. తన సొంత యూ ట్యూబ్‌ చానల్‌ ద్వారా ఆయన చేసిన ప్రచారం.. పట్టభద్రులకు ఆయన్ను బాగా చేరువ చేసిందని, అందుకే ఇన్ని ఓట్లు దక్కాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఎన్నిక కోసం తీన్మార్‌ మల్లన్న.. అనేక సభలు, సమావేశాల్లో మాట్లాడారు. రోజు తన యూ ట్యూబ్‌ చానల్‌ ద్వారా జనాన్ని పలకరించారు. ఈ సందర్భంగా మల్లన్న తన ప్రసంగాల కోసం ఎంచుకున్న అంశాలు, ఉపయోగించిన భాష, యాస జనానికి బాగా చేరడం వల్లే తీవ్రమైన పోటీ ఇవ్వడం సాధ్యమైందని వారు అంటున్నారు.

Updated Date - 2021-03-21T08:34:10+05:30 IST