పాతబస్తీలో యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-10-14T14:26:59+05:30 IST

కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి బయటికి లాగి కత్తులతో పొడిచి చంపేశారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చాంద్రాయణగుట్ట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. విషయం తెలియగానే

పాతబస్తీలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్/మదీన: కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి బయటికి లాగి కత్తులతో పొడిచి చంపేశారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చాంద్రాయణగుట్ట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. విషయం తెలియగానే వెంటనే చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌ ప్రసాద్‌వర్మ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌ హత్య జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. బార్క్‌సకు చెందిన హమీద్‌ బిన్‌ అల్‌ జుబేది (37) చాంద్రాయణగుట్టలో మిలీనియమ్‌ ట్రావెల్స్‌, వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ బిజినెస్‌ చేస్తుంటాడు. బార్క్‌సకు చెందిన రయీస్‌ జాబ్రీ దుబాయ్‌లో ఉంటాడు. పాత పరిచయం, స్నేహితుడు కావడంతో దుబాయ్‌ నుంచి వచ్చేటప్పుడు బంగారం తీసుకురావాలని జుబేదీ కోరాడు. 2019లో జాబ్రీ బంగారం తీసుకుని వస్తుండగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అతనిపై స్మగ్లింగ్‌ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఆయన పాస్ట్‌పోర్ట్‌ జప్తు అయింది. స్మగ్లింగ్‌ కేసులో ఉన్నందున దుబాయ్‌లో అతని ఉద్యోగం కూడా పోయింది. దీంతో జుబేది కారణంగానే తన జీవితం నాశనమైపోయిందని జాబ్రీ బాధపడేవాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత నష్టపరిహారం చెల్లించాలని జుబేదీని డిమాండ్‌ చేశాడు. కొన్నిరోజులుగా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు జుబేదీ చాంద్రాయణగుట్ట పోలీ్‌సస్టేషన్‌కు కారులో బయలుదేరాడు. సమాచారం తెలిసిన జాబ్రీ తన సోదరులు ఆదిల్‌ జాబ్రీ, సయీద్‌ జాబ్రీలతో కలిసి హషమాబాద్‌ ప్రధాన రోడ్డుపై కారును అడ్డగించారు. కారులో ఉన్న జుబేదీని బయటికి లాగి కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. తల, చాతీపై బండరాయి వేసి నిర్దాక్షిణ్యంగా హత్యచేశారు. స్థానికులు పెద్దసంఖ్యలో గుమిగూడడంతో నిందితులు అక్కడినుంచి పారిపోయారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని డీసీపీ తెలిపారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more