సాగర్‌ ఉప పోరుకు నామినేషన్లు షురూ

ABN , First Publish Date - 2021-03-24T09:00:46+05:30 IST

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా తొలిరోజు ఐదుగురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.

సాగర్‌ ఉప పోరుకు నామినేషన్లు షురూ

  • తొలిరోజు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థుల దాఖలు 
  • పోటీకి జాతీయ, ప్రాంతీయ పార్టీలు సై

నల్లగొండ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా తొలిరోజు ఐదుగురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నిడమనూరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరించనుండగా; 31వ తేదీన స్ర్కూటినీ చేయనున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం, 17న పోలింగ్‌ జరుగుతుంది. సాగర్‌ సమరానికి ఆసక్తి చూపే వారి సంఖ్య 20 మందికి పైగానే కనిపిస్తోంది. ఈ నెల 29న నామినేషన్‌ వేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీ తన అభ్యర్థిగా మువ్వా అరుణ్‌కుమార్‌ను ప్రకటించింది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీలు నేడో, రేపో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. తాము కూడా పోటీలో ఉంటామని బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ, జై మహాభారత్‌ పార్టీ, దళిత శక్తి ప్రోగ్రాం(డీఎస్పీ), జస్టిస్‌ చంద్రకుమార్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రజల పార్టీ  అభ్యర్థిగా సీనియర్‌ జర్నలిస్ట్‌ వెంకటరమణను ప్రకటించారు. మంద కృష్ణ మాదిగ నేతృత్వంలోని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. తెలంగాణ ఇంటి పార్టీ, యువతెలంగాణ పార్టీలు సైతం బరిలో ఉంటాయని ఆయా పార్టీల నేతలు ప్రకటించారు. సీపీఎం పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది

అమరుల కుటుంబాల ఐక్యవేదిక తరఫున 400 మంది పోటీ

తమ డిమాండ్ల సాధనకు సాగర్‌ ఉప ఎన్నికను వేదికగా ఉపయోగించుకోవాలని పలువురు బాధితులు, సంఘాలు యోచిస్తున్నాయి. తెలంగాణ అమరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక పక్షాన 400 మంది అభ్యర్థులు నామినేషన్లు వేస్తారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి తెలిపారు.   తమ ను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు బరిలో దిగుతామని తెలిపారు.  

Updated Date - 2021-03-24T09:00:46+05:30 IST